రోడ్డుపై బురద నీటిలో స్నానం... దిగొచ్చిన సర్కార్

రోడ్డుపై బురద నీటిలో స్నానం... దిగొచ్చిన సర్కార్

దేశంలో ఇటీవల కురిసిన వర్షాలకు పలు రాష్ట్రాల్లోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తమకు స్థానికంగా ఉన్న రహదారుల దుస్థితిని అధికారుల దృష్టికి తెచ్చేందుకు ఓ వ్యక్తి వినూత్న ప్రయత్నం చేశాడు. రోడ్డుపై నిలిచిన వరద నీటిలో స్నానం చేసి, యోగాసనాలు వేశాడు. దీంతో అక్కడి ఎమ్మెల్యే పరిగెత్తుకొని వచ్చి.. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చాడు. ఈ సంఘటన కేరళలోని పాండిక్కాడ్ జిల్లా మలప్పురంలో జరిగింది. అదే ప్రాంతానికి చెందినస ఓ సామాజిక కార్యకర్త హమ్జా పోరాలి అక్కడి రోడ్ల పరిస్థితిని అధికారులకు చెప్పేందుకు కొత్త దారిని కనుక్కు్న్నాడు. అందుకు అతనితో పాటు మరికొందరి బృంద సభ్యుల సహకారమూ తీసుకున్నాడు.

హిమ్జా కేవలం టవల్ మాత్రమే కట్టుకొని, గుంతలు పడ్డ రోడ్డుపై నిలిచిన బురద నీటిలో స్నానం చేశాడు. అదే నీటిలో బట్టలు ఉతికి, యోగాసనాలు వేశాడు. దీన్నంతటినీ జనం వింతగా చూస్తున్నా.. అతను మాత్రం తన నిరసనపైనే దృష్టి పెట్టాడు. సరిగ్గా ఆ సమయంలోనే స్థానిక ఎమ్మెల్యే లతీఫ్ అక్కడి వైపుగా వెళ్తున్నారు. కారు దిగుతూనే ‘గుంతలో నాలుగైదు అరటి చెట్లు నాటకపోయావ్’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. జనం కష్టాలను తీర్చేందుకు ఏదైనా చేయాలని ఎమ్మెల్యేతో స్థానికులు అన్నారు. దీనికి ఎమ్మెల్యే లతీఫ్ బదులిస్తూ.. ‘అతనే చేయాలి, నేను కాదు, గుంతలో కొన్ని అరటి చెట్లను నాటండి’ అని సమాధానం ఇచ్చారు.  ఆ తర్వాత ఎమ్మెల్యే వ్యాఖ్యలపై జనం నుంచి వ్యతిరేకత రావడంతో ఆయన దిగొచ్చారు. ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ తన మాటలను మార్చుకున్నారు. గుంతలలో అరటి చెట్లను నాటడం తాను చూశానని, అందుకే అలా చేయాలని చెప్పానని వివరణ ఇచ్చారు. రోడ్ల దయనీయ స్థితిని రహదారులు శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

అయితే సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే తాము ఇలా చేశామని హమ్జా తెలిపారు. ‘పాండిక్కాడ్, దాని చుట్టుపక్కల ఉన్న రోడ్లు, ముఖ్యంగా ఊటీ రోడ్డు బాగా దెబ్బతిన్నాయని..  గుంతల కారణంగా చాలా మంది ప్రమాదాలలో గాయపడ్డారని చెప్పారు. పాండిక్కాడ్‌ - పాలక్కాడ్‌ హైవే మార్గంలో 4 నెలల కిందటే తారు వేశారు. వర్షాకాలం ప్రారంభమైన మొదటి నెలలోనే అది కొట్టుకుపోయిందని స్థానికులు చెబుతున్నారు. గుంతల వల్ల ప్రమాదాలు జరగకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హమ్జా ఇంతకుముందు కూడా ఇలాగే నిరసనలు చేశాడు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా పాండిక్కాడ్ పట్టణ వీధుల్లో స్పీకర్‌ను భుజాలపై వేసుకుని ఒంటరిగా నిరసన చేపట్టాడు.