వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియాలో దారుణం జరిగింది. మహిళను వేధిస్తున్నాడని అడ్డుకోబోయిన పోలీస్ ఆఫీసర్(28)ను ఓ దుండగుడు కాల్చి చంపాడు. అనంతరం బైక్‌పై గంటకు 240 కి.మీ వేగంతో పారిపోతున్న నిందితుడిని పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. శాన్ బెర్నార్డినో కౌంటీలో ఆండ్రూ నూనెజ్ అనే ఆఫీసర్ డ్యూటీ చేస్తున్నాడు. ఓ వ్యక్తి తనను వేధిస్తున్నాడని మహిళ నుంచి కాల్ రావడంతో నూనెజ్ తన సిబ్బందితో కలిసి రాంచో కుకమోంగాకు బయలుదేరాడు.
స్పాట్‌కు చేరుకోగానే వారిపై దుండగుడు కాల్పులు జరిపాడు. ఆండ్రూ నూనెజ్కు బుల్లెట్ తగలడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఆఫీసర్ చనిపోగానే నిందితుడు బైక్ పై గంటకు 240 కి.మీ వేగంతో పారిపోయాడు. అంతే స్పీడుతో కారుతో ఛేజ్ చేసిన పోలీసులు దుండగుడి బైకును ఢీకొట్టారు. అతను కిందపడగానే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. అతనికి కచ్చితంగా శిక్షపడేలా చేసి, బాధిత పోలీస్ కుటుంబానికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు.
