అసలేం జరిగింది : మేక కన్ను తిన్నాడు.. ఆ వెంటనే చచ్చిపోయాడు

అసలేం జరిగింది : మేక కన్ను తిన్నాడు.. ఆ వెంటనే చచ్చిపోయాడు

'కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా'.. ఈ డైలాగ్​ వినగానే అప్పట్లో సంచలనం సృష్టించిన నరసింహా నాయుడు సినిమానే గుర్తొస్తుంది. ఇప్పుడు జరిగిన ఓ ఘటనను చూస్తే.. ఈ డైలాగ్​ని కాస్త 'కత్తితో వేటు వేస్తే.. కంటిని యమపాశంలా మార్చి చంపేస్తా' అని తిరగరాయాల్సి వస్తుందేమో.  ఓ మేకను బలి ఇచ్చిన యజమాని చివరికి ప్రాణాలు కోల్పోయాడు. అది కూడా మేక కంటితో.. అదెలాగంటారా.. ఈ వార్త చదవండీ..

ఛత్తీస్​ఘడ్ లోని సూరజ్​పూర్​జిల్లాలోని  మదన్​పూర్​ గ్రామానికి చెందిన 50 ఏళ్ల బగార్​రాయ్​ తన స్నేహితులతో కలిసి ప్రముఖ ఖోపాథామ్​కు వెళ్లాడు. అక్కడ పూజలు నిర్వహించిన తరువాత మేకలను బలి ఇచ్చి, వాటితో కర్రీ వండించాడు. అనంతరం  గ్రామస్థులకు వడ్డించాడు.

తింటూ గొంతులో ఇరుక్కుపోయి..

గ్రామస్థులకు వడ్డించాక మిగిలిన వారితో కలిసి ఆయన తినడానికి కూర్చున్నాడు. మటన్​లో మేక కనుగుడ్డు కనిపించడంతో నోరూరి చటుక్కున నోట్లో వేసుకున్నాడు. అంతే.. ఆ కనుగుడ్డు ఆయన గొంతులో ఇరుక్కు పోయింది. దీంతో ఊపిరి ఆడక అటూ ఇటూ చాలా కదులుతూ ఇబ్బంది పడ్డాడు. గమనించిన స్థానికులు ఆయన్ని వెంటనే జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బగర్​రాయ్​ మరణించాడు. కనుగుడ్డు ఇలా ప్రాణాలు తీస్తుందని ఊహించలేకపోయామని బంధువులు రోదించారు.  ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మేక కంటితో చనిపోయిన ఘటనను ఇదే మొదటి సారిగా చూస్తున్నామని స్థానికులు అంటున్నారు.