మందు తాగి 2 వయాగ్రా టాబ్లెట్లు వేసుకోవడంతో రక్తం గడ్డకట్టి మృత్యువాత

మందు తాగి 2 వయాగ్రా టాబ్లెట్లు వేసుకోవడంతో రక్తం గడ్డకట్టి మృత్యువాత

మహారాష్ట్రలోని నాగ్​పూర్​లో ఘటన

నాగ్ పూర్ : ఆల్కహాల్  తాగుతూ రెండు వయాగ్రా మాత్రలు వేసుకున్న వ్యక్తి(41) రక్తం గడ్డకట్టి చనిపోయాడు. మహారాష్ట్రలోని నాగ్​పూర్​లో జరిగిన  ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్​తో కలిసి నాగ్​పూర్​లోని ఓ హోటల్ కు వెళ్లాడు. మద్యం తాగుతూ 2 వయాగ్రా మాత్రలు వేసుకున్నాడు. తర్వాత గర్ల్​ఫ్రెండ్​తో కలిశాడు.

మరుసటి రోజు ఉదయం అస్వస్థతకు గురయ్యాడు. అదేపనిగా వాంతులు చేసుకోవడంతో ఆసుపత్రికి వెళ్దామని గర్ల్ ఫ్రెండ్ సూచించినా వద్దన్నాడు. అయితే కొద్దిసేపట్లోనే అతని పరిస్థితి సీరియస్ గా మారింది. అతను అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. సెరిబ్రోవ్యాస్కులర్  హెమొరేజ్  (మెదడుకు ఆక్సిజన్  సరఫరా ఆగిపోవడం) కారణంగానే అతను ప్రాణాలు కోల్పోయినట్లు పోస్టుమార్టంలో తేలిందని డాక్టర్లు చెప్పారు.

‘మృతుడికి ఎలాంటి మెడికల్, సర్జికల్  హిస్టరీ లేదు. కేవలం ఆల్కహాల్ తో వయాగ్రా మాత్రలు వేసుకున్నందువల్లే అతను చనిపోయాడు. అతని శరీరంలో 300 గ్రాముల బ్లడ్ క్లాట్​ను గుర్తించాం. వైద్యుల సలహా తీసుకోకుండా ఎవరూ కూడా అలాంటి మాత్రలు వేసుకోరాదు’ అని డాక్టర్లు పేర్కొన్నారు. కాగా, ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ కేసును జర్నల్  ఆఫ్  ఫోరెన్సిక్  అండ్  లీగల్  మెడిసిన్ ప్రచురించింది.