జూన్ 12న పాట్నాలో ప్రతిపక్షాల సమావేశం.. 2024 ఎన్నికల వ్యూహంపై చర్చ

 జూన్ 12న పాట్నాలో ప్రతిపక్షాల సమావేశం.. 2024 ఎన్నికల వ్యూహంపై చర్చ

పాట్నా: బీహార్‌ రాజధాని పాట్నాలో ప్రతిపక్ష పార్టీల సమావేశం జూన్‌ 12వ తేదీన జరగనుంది. వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నారు. ఈ మెగా సమావేశానికి 18కి పైగా భావసారూప్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతలు హాజరుకానున్నారు. 

కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం (మే 28న)  ప్రారంభించిన నేపథ్యంలో విపక్షాల భేటీ తేదీ ఖరారు అయ్యింది. దేశంలోని 20 ప్రతిపక్ష పార్టీలు కొత్త పార్లమెంట్‌ భవనాన్ని మోడీ ప్రారంభించడాన్ని  బహిష్కరించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాకుండా ప్రధాని మోడీ కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించడాన్ని విపక్ష పార్టీలు తప్పుపట్టాయి. 

ఈ నేపథ్యంలో జూన్‌ 12వ తేదీన పాట్నాలో సమావేశం కావాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. అయితే.. ఇది సన్నాహక సమావేశం మాత్రమే అని ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఒక నాయకుడు తెలిపారు. ప్రతిపక్ష పార్టీల ప్రధాన సమావేశం ఆ తర్వాత జరుగుతుందని వివరించారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల ఐక్యత కోసం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు పార్టీల అధినేతలను కలుస్తున్నారు. 

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్‌ ఖర్గే, రాహుల్‌ గాంధీతో ఇటీవల ఢిల్లీలో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ను వ్యతిరేకించే టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఆప్‌ చీఫ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ తోనూ భేటీ అయ్యారు. బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలను ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు నితీష్ కుమార్ వారితో మంతనాలు జరుపుతున్నారు.