టమాట రైతు కన్నీరు 

టమాట రైతు కన్నీరు 

ఆదిలాబాద్, వెలుగు : నెల రోజుల క్రితం కిలో రూ. 50 వరకు ఉన్న టమాట ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు 1,400 ఎకరాల్లో టమాట పంట సాగు చేశారు. రెండు నెలల క్రితం టమాట 25 కేజీల క్రేట్​ధర రూ. 900 వరకు ఉంటే ఇప్పుడు రూ. 100 కూడా పలకడం లేదు. అటు దళారులు, వ్యాపారులు మాత్రం రైతుల వద్ద కొనుగోలు చేసిన పంటను మార్కెట్లో ఎక్కువకు అమ్ముకొని లాభపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో వ్యాపారులు టమాట కిలో రూ. 10 పైగానే అమ్ముతున్నారు. రైతులకు మాత్రం కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు. 

దిగుబడి లేదు.. ధరా తగ్గింది

రైతులు పంట వేసేటపుడు ఉన్న రేటు దిగుబడి చేతికందేసరికి ఒక్కసారిగా పడిపోతోంది. నెల క్రితం రైతులకు కిలోకు రూ. 30 పైగానే దక్కింది. అయితే ఈ సీజన్​లో అధిక వర్షాలతో పంట దిగుబడి తగ్గింది. రైతులు ఎకరానికి దాదాపు రూ. 60 వేలు పైగానే పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం పంట దిగుబడి లేక.. ఉన్న పంటకు ధర రాకపోవడంతో పెట్టుబడిలో సగం కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆదిలాబాద్​ జిల్లాకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి వ్యాపారులు వచ్చి టమాట కొనుగోలు చేసేవారు. ఇక్కడి నుంచి లారీల్లో వారి రాష్ట్రాలకు తరలించేవారు. అయితే ఈ ఏడాది అధిక వర్షాలతో టమాట సైజు తగ్గింది. దీంతో వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. లోకల్ గా ఉన్న దళారులు, వ్యాపారులు రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేసి మార్కెట్​లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. వాతావరణం అనుకూలిస్తే టమాట ఎకరానికి ప్రతి వారం వెయ్యి కేజీల వరకు దిగుబడి వస్తుంది. కానీ ఇప్పుడు 
సగం కూడా రావడం లేదు. అటు వ్యాపారులు సైతం కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో తోటలోనే పంట రాలిపోతోంది. 

రూ. 100 కూడా వస్తలే

నేను రెండెకరాల్లో టమాట పంట సాగు చేసిన. ఈసారి దిగుబడి రాకపోగా.. సరైన ధర కూడా దక్కడం లేదు. గతంలో 25 కేజీల డబ్బా రూ. 1,200కు అమ్మిన. నెల రోజుల నుంచి రూ. 50, రూ. 100 కే అమ్ముకుంటున్నం. ఇటు వ్యాపారులు ధర పెట్టడం లేదు. అటు పంట ఎండిపోతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నం.  
- అంకతి సికిందర్, గుడిహత్నూర్ 

టమాట ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి కూడా వస్తలేదని కన్నీళ్లు పెడుతున్నారు. నెల కింద కిలో రూ.50 పలికిన టమాట.. ఇప్పుడు రూ.10కి పడిపోయింది. మార్కెట్ లో రూ.10 పలుకు తున్నప్పటికీ, రైతులకు మాత్రం కిలోకు రూ. 2 చొప్పునే దక్కుతోంది. రైతుల దగ్గర దళారులు, వ్యాపారులు తక్కువ ధరకు కొని ప్రజలకు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు.

ఆదిలాబాద్​ జిల్లా గుడిహత్నూర్ మండలం డొంగర్గావ్ కు చెందిన పసారే పాండురంగ్​ రూ. 3 లక్షల పెట్టుబడితో మూడెకరాల్లో టమాట పంట సాగు చేశాడు. ఇటీవల 40 పెట్టెల టమాటాలు మార్కెట్ కు తీసుకువెళ్తే డబ్బా రూ.120 రూపాయలు పలికింది. కోత నుంచి మార్కెట్ కు తరలించేందుకు కూలి, రవాణా ఖర్చులు కలిపి పెట్టెకు(25 కేజీలు)  రూ.70 వరకు ఖర్చయ్యాయి. ఖర్చులన్నీ పోనూ పెట్టెకు రూ. 50 మిగిలాయి. కిలోకు రూ. 2 మాత్రమే దక్కుతుండడంతో  పెట్టుబడి వచ్చే పరిస్థితి కన్పించడం లేదని రైతు వాపో తున్నాడు. ఇప్పటికే రూ. లక్ష లాస్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు.