కూతురును ‘జోగిని’గా మార్చాలనుకున్న తల్లి.. కాపాడి పెళ్లిచేసిన అధికారులు

కూతురును ‘జోగిని’గా మార్చాలనుకున్న తల్లి.. కాపాడి పెళ్లిచేసిన అధికారులు

నిజామాబాద్‌కు చెందిన ఒక తల్లి.. తన 25 ఏళ్ల కూతురును జోగినిగా మార్చాలనుకుంది. అయితే సామాజిక కార్యకర్తల ఫిర్యాదుతో జిల్లా యంత్రాంగం ఆ యువతిని కాపాడారు. ఈ ఘటన 10 రోజుల క్రితం బోధన్‌లో జరిగింది. అప్పట్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో జోగిని వ్యవస్థ అమలులో ఉండేది. ఈ వ్యవస్థను 1988లో చట్టవిరుద్ధమైన చర్యగా భావించి నిషేధించారు.

బోధన్‌కు చెందిన మహిళ గతంలో జోగిని. ఆమెకు ఒక కూతురు, కొడుకు. కొడుకు అవిటివాడు కావడంతో.. కూతురు, కొడుకును ఆమె పోషించేది. అయితే తన సంపాదన చాలకపోవడంతో కూతురుని జోగినిగా మార్చి డబ్బు సంపాదించాలనుకుంది. విషయం తెలిసిన అధికారులు ఆ యువతిని కాపాడారు. యువతిని తీసుకువచ్చి హోం లో ఆశ్రయం ఇచ్చామని.. ఆ తర్వాత తల్లీకూతుళ్లిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చామని బోధన్ తహశీల్దార్ మొహమ్మద్ గఫార్ తెలిపారు. ‘కుమార్తెను జోగినిగా మార్చాలనే ఆలోచనను వదిలివేసే వరకు మీ కూతురును మీకు అప్పగించబోమని తల్లికి చెప్పాం. సామాజిక కార్యకర్తలు మరియు వారి కులానికి చెందిన వారితో ఆమెకు కౌన్సెలింగ్ ఇప్పించాం. ఆమె అనుమతితో వారి సామాజిక వర్గానికి చెందిన యువకుడితో శుక్రవారం పెళ్లి జరిపించాం. తల్లే యువతిని జోగినిగా మార్చాలనుకోవడం వెనుక ఎవరి ప్రమేయం లేదని తేలింది’ అని గఫార్ తెలిపారు.

యువతి ఓ రిటైల్ దుకాణంలో పనిచేస్తూ నెలకు రూ .5 వేలు సంపాదించేది. యువతి తల్లికి ఒంటరి మహిళ కింద నెలకు రూ .2,000 పెన్షన్ వచ్చేది. వీరిద్దరి సంపాదనతో ఇల్లు గడవడం కష్టంగా మారడంతో.. యువతి తల్లి ఈ నిర్ణయం తీసుకుంది.

తక్కువ కులానికి చెందిన మహిళను ‘జోగిని’ గా మారుస్తారు. ఆ మహిళ జోగినిగా మారినప్పటి నుంచి.. అందరికీ అందుబాటులో ఉండే లైంగిక వస్తువు లాంటిదన్నమాట. ఉన్నత వర్గానికి చెందినవారు మూఢనమ్మకాల ద్వారా బలహీన వర్గాలకు చెందిన మహిళలను జోగినిలుగా మార్చడానికి ప్రయత్నిస్తారు. గ్రామంలో మంచి వర్షపాతం, అంటువ్యాధుల నివారించడం లేదా దేవతలను పూజించటం వంటివి సాకుగా చూపుతూ దళిత యువతిని జోగినిగా మారుస్తారు. జోగినిగా మారిన వాళ్లు గ్రామంలో భిక్ష కోరుతూ తమ జీవితాలను గడపవలసి వస్తుంది. వారు “దేవునికి అంకితం” అయినందున వారు మరొక వ్యక్తిని వివాహం చేసుకోలేరు. జోగినిగా మార్చబడిన తరువాత ఆ యువతులు తమ శరీరాలపై హక్కును కోల్పోతారు. గ్రామంలోని పురుషుల ద్వారా వీరు లైంగిక దోపిడీకి గురవుతారు.

మహాబుబ్‌నగర్, ఆదిలాబాద్, మేదక్, వరంగల్ మరియు నిజామాబాద్‌ జిల్లాల్లో వీరిని జోగినిగా అని పిలుస్తారు. రంగారెడ్డి జిల్లాలో మాతమ్మగా పిలుస్తారు. కరీంనగర్ జిల్లాలో అమాబాబాయిగా పిలుస్తారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2010లో ఏర్పడిన వన్ మ్యాన్ కమిషన్ ఈ జోగిని వ్యవస్థను అధ్యయనం చేసింది. రెండు రాష్ట్రాల్లో 80,000 మంది జోగినిలు ఉన్నారని అంచనా వేశారు. వారిలో 50,000 మంది తెలంగాణకు చెందినవారు కావడం గమనార్హం. మాజీ జోగినిలకు పునరావాసం కల్పించడం కోసం వారికి ప్రోత్సాహకాలు మరియు భూమిని ప్రభుత్వం అందిస్తోంది.

For More News..

కరోనాతో తమిళనాడు అగ్రికల్చర్ మినిష్టర్ మృతి

కేసీఆర్​కు దుబ్బాకలో మీటింగ్​ పెట్టే దమ్ము లేదు

వారంలో 353 మిస్సింగ్ కేసులు

ధరణిలో ఎకరా మ్యుటేషన్‌‌‌కు రూ.2500.. పాస్​ బుక్ డెలివరీకి రూ.300