Xi Jinping: నెలరోజులుగా కనిపించని జి జిన్ పింగ్.. చైనాలో నిశ్శబ్ద తిరుగుబాటు?

Xi Jinping: నెలరోజులుగా కనిపించని జి జిన్ పింగ్.. చైనాలో నిశ్శబ్ద తిరుగుబాటు?

చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్పై ఇటీవల నిశ్శబ్ద తిరుగుబాటు జరుగుతోందనే పుకార్లు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మే చివరి నుంచి జిన్‌పింగ్ ప్రజా సమక్షంలో కనిపించకపోవడం ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోస్తుంది. 

చైనా వంటి కమ్యూనిస్ట్ దేశాలలో రాజకీయాలు అత్యంత రహస్యంగా ఉంటాయన్నది తెలిసిందే కాబట్టి ఈ పుకార్లను ధృవీకరించడం లేదా తోసిపుచ్చడం కష్టం. ఈ విషయంలో కొన్ని అంశాలు ఈ నిశ్శబ్ద తిరుగుబాటుకు సంబంధించిన వాదనలకు బలం చేకూర్చుతున్నాయి.

నిశ్శబ్ద తిరుగుబాటుకు సంకేతాలు ,ఊహాగానాలు:

జి జిన్‌పింగ్ అదృశ్యం.. మే 21 నుంచి జిన్‌పింగ్ ప్రజా సమక్షంలో కనిపించడం లేదు. సాధారణంగా చైనా అధికారిక మీడియాలో నిత్యం కనిపించే జిన్‌పింగ్ ఆకస్మికంగా అదృశ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో కూడా జిన్‌పింగ్ ఇలా అదృశ్యమైనప్పటికీ ఈసారి అది అంతర్గత రాజకీయ మార్పులతో ముడిపడి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

హు జింటావో వర్గం ప్రభావం: జిన్‌పింగ్ ప్రత్యర్థిగా భావించే మాజీ అధ్యక్షుడు హు జింటావో వర్గానికి చెందిన సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ నేతలు ఇప్పుడు తెరవెనుక నిజమైన అధికారాన్ని కలిగి ఉన్నారని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. సెంట్రల్ మిలిటరీ కమిషన్ (CMC) మొదటి వైస్ ఛైర్మన్ జనరల్ జాంగ్ యూక్జియా హు జింటావో వర్గం మద్దతుతో తెరవెనక అధికారాన్ని చలాయిస్తున్నారని ప్రచారం సాగుతోంది. 

సైనిక అధికారుల తొలగింపులు: జిన్‌పింగ్‌కు విధేయులైన డజన్లకొద్ది జనరల్స్ ను పదవుల నుంచి తొలగించారని ఇది పార్టీలో అంతర్గత ప్రక్షాళనలు సూచిస్తోంది. 

ప్రజా మీడియాలో జిన్‌పింగ్ ప్రస్తావన తగ్గడం: సాధారణంగా జిన్‌పింగ్ ప్రస్తావనతో నిండి ఉండే చైనా ప్రభుత్వ మీడియా జిన్‌పింగ్‌పై ఇంటర్వ్యూలను గణనీయంగా తగ్గించింది. చైనాకు వచ్చే విదేశీ ప్రముఖుల తక్కువ ర్యాంక్ పార్టీ అధికారులు రిసీవ్ చేసుకోవడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది.

BRICS సదస్సుకు గైర్హాజరు: బ్రెజిల్‌లో జరగనున్న BRICS సదస్సుకు జిన్‌పింగ్ హాజరుకావడం లేదు. ఇది గత 12 యేళ్లలో చైనా నాయకుడు ఈ సదస్సుకు గైర్హాజరు కావడం ఇదే మొదటిసారి. చైనాకు ఇందులో కీలక పాత్ర ఉన్నప్పటికీ జిన్‌పింగ్ రాకపోవడం అతని ప్రభావం తగ్గుతోందని సంకేతంగా భావించవచ్చు. 

వాంగ్ యాంగ్ తదుపరి నాయకుడిగా ప్రస్తావన: వాంగ్ యాంగ్ తదుపరి నాయకుడిగా వస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వాంగ్ యాంగ్ ఉదారవాద, సంస్కరణల వైపు మొగ్గుచూపే నేతగా పేరుపొందారు.

ఆర్థిక సమస్యలు ,అసంతృప్తి: చైనా ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. నిరుద్యోగం పెరుగుతోంది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతోంది. ఇలాంటి సంక్షోభాల క్రమంలో జిన్‌పింగ్ నాయకత్వంపై ప్రజలు, వ్యాపారవర్గాలలో అసంతృప్తి పెరుగుతోంది. ఇది చైనాలో జిన్‌పింగ్ ప్రభావాన్ని క్రమంగా తగ్గిస్తుందని భావిస్తున్నారు. 

►ALSO READ | జనాన్ని ఇంకా చంపాలనుకుంటున్నడు..పుతిన్పై ట్రంప్ ఫైర్

షాంఘై సహకార సంస్థ సదస్సు (2022) పుకార్లు: గతంలో  2022లో షాంఘై సహకార సంస్థ సదస్సు నుంచి తిరిగి వచ్చిన తర్వాత జిన్‌పింగ్ కొంతకాలం కనిపించలేదు. అప్పుడు కూడా తిరుగుబాటు పుకార్లు వ్యాపించాయి. అయితే అప్పట్లో అది కోవిడ్-19 నిబంధనల ప్రకారం తప్పనిసరి క్వారంటైన్ వల్ల అని కొందరు విశ్లేషకులు తోసిపుచ్చారు.

చైనా రాజకీయాల్లో అస్పష్టత(పికాలజీ ):

చైనా రాజకీయాలు అత్యంత అస్పష్టంగా ఉంటాయి. పారదర్శకత లేకపోవడం వల్ల, నాయకుల అదృశ్యాలు లేదా అధికారిక ప్రకటనలలో సూక్ష్మమైన మార్పులు తీవ్రమైన ఊహాగానాలకు దారితీస్తాయి. కోల్డ్ వార్ సమయంలో పాశ్చాత్య విశ్లేషకులు చైనా రాజకీయాలను అర్థం చేసుకోవడానికి "పికాలజీ" అనే పద్ధతిని ఉపయోగించేవారు. 

దీనిలో పీపుల్స్ డైలీలో ప్రచురించిన ప్రకటనలు, అధికారిక ఫోటోలు, సమావేశాలలో సీటింగ్ అమరికలు వంటి చిన్నపాటి సంకేతాలను విశ్లేషించి అంతర్గత మార్పులను అంచనా వేసేవారు. జిన్‌పింగ్ పాలనలో అస్పష్టత మరింత పెరిగినందున ఈ "పికాలజీ" పద్ధతి మళ్లీ ప్రాముఖ్యత సంతరించుకుంది.

జిన్‌పింగ్‌పై నిశ్శబ్ద తిరుగుబాటు జరిగిందా లేదా అనేది అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ ఆయన ఆకస్మిక అదృశ్యం, సైనిక అధికారుల తొలగింపులు, రాష్ట్ర మీడియాలో ప్రస్తావన తగ్గడం, మాజీ నాయకుల వర్గం క్రీయశీలకం వంటి పరిణామాలు చైనాలో అంతర్గత రాజకీయ ప్రకంపనలు జరుగుతున్నాయనే అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. 

చైనా రాజకీయాలు రహస్యంగా ఉండటం వల్ల, భవిష్యత్తులో ఏం జరుగుతుందో స్పష్టమైన సమాచారం తెలిసేందుకు కొంతసమయం పట్టవచ్చు.