
- రష్యా అధ్యక్షుడు పుతిన్ పై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఫైర్
- యుద్ధం విరమించేందుకు ఒప్పించే ప్రయత్నం చేశానని వెల్లడి
వాషింగ్టన్: జనాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంకా చంపాలనుకుంటున్నారని, ఆయన తన ఇష్టమొచ్చినట్లు చేయాలనుకుంటున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఉక్రెయిన్ తో యుద్ధం విరమించేందుకు ప్రయత్నించానని, అయినా లాభం లేకుండా పోయిందని తెలిపారు. పుతిన్ తో జరిపిన టెలిఫోన్ సంభాషణపై తాను చాలా అసంతృప్తిగా ఉన్నానని చెప్పారు.
శనివారం ఎయిర్ ఫోర్స్ వన్ ఫ్లైట్ లో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. రష్యాపై ఆంక్షలను తాను మరింత కఠినం చేసే అవకాశం ఉందన్నారు. ‘‘ఉక్రెయిన్ తో యుద్ధం ముగించడానికి ఆరు నెలల పాటు పుతిన్ ను ఒప్పించే ప్రయత్నం చేశా. అంతవరకు ఆంక్షలు కఠినం చేయకుండా చూసుకున్నా. ఇక ఆంక్షలు కఠినం చేసే పరిస్థితి రావచ్చు” అని ట్రంప్ పేర్కొన్నారు.
అలాగే, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్ స్కీ తోనూ మాట్లాడానని ఆయన వెల్లడించారు. ఉక్రెయిన్ పై రష్యా ఇటీవల భారీఎత్తున మిసైళ్లతో దాడి చేసిన నేపథ్యంలో ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ ను బలపరచడంపై జెలెన్ స్కీతో చర్చించానని తెలిపారు.
బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై ట్రంప్ సంతకం
ట్రంప్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు (ట్యాక్స్, స్పెండింగ్ కట్ బిల్) పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. రిపబ్లికన్ ఎంపీలు, అధికారులు చప్పట్లు కొడుతుండగా బిల్లుపై ఆయన సంతకం పెట్టారు.
అనంతరం ట్రంప్ మాట్లాడుతూ అమెరికా ప్రజలు ఇంత సంతోషంగా ఉండడం గతంలో తానెప్పుడూ చూడలేదన్నారు. తాజాగా వచ్చిన చట్టంతో దేశ పౌరులందరికీ మంచి జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్, సెనేట్ మెజారిటీ లీడర్ జాన్ థునెకు ట్రంప్ థ్యాంక్స్ చెప్పారు.