పాలనలో రేవంత్ కొత్త మార్క్​.. నెల రోజుల్లోనే కీలక మార్పులు

పాలనలో రేవంత్ కొత్త మార్క్​.. నెల రోజుల్లోనే కీలక మార్పులు
  • అందరినీ కలుపుకుపోతున్న ముఖ్యమంత్రి
  • బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బిజీబిజీ
  • స్వేచ్ఛగా మంత్రుల రివ్యూలు, ప్రెస్​మీట్లు
  • జనం సమస్యలను తెలుసుకుంటున్న ఆఫీసర్లు
  • ప్రజాభవన్​గా మారిన ప్రగతిభవన్​.. సామాన్యులకు ఎంట్రీ
  • ధర్నాచౌక్​లో అందరికీ నిరసన తెలిపే హక్కు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం కొలువుదీరి ఆదివారానికి నెలరోజులు అవుతున్నది. ఈ నెల రోజుల్లోనే పాలనలో కొత్త మార్క్​ కనిపిస్తున్నది. పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు అన్నిట్లోనూ గత ప్రభుత్వానికి భిన్నంగా మార్పులు వచ్చాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే రేవంత్​రెడ్డి విధుల్లో చేరి.. రోజూ బిజీగా గడుపుతున్నారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు వరుస రివ్యూలు జరుపుతున్నారు. ప్రజా సమస్యలపై ఆరా తీస్తూ.. ప్రజాభవన్​లో నిర్వహించే ప్రజావాణిలో ప్రజల నుంచి సీఎం, మంత్రులు, అధికారులు వినతులు స్వీకరిస్తున్నారు. గత ప్రభుత్వంలో మాదిరి కాకుండా ఇప్పుడు మంత్రులు, అధికారులు స్వేచ్ఛగా పనులు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదా అంటే పేరుకే తప్ప.. ఇంకేం ఉండదన్న మార్క్ కూడా చెదిరిపోయింది. గత బీఆర్​ఎస్​ హయాంలో.. ఏం చేసినా అంతా తానే చేయాలన్నట్లుగా అప్పటి సీఎం వైఖరి ఉండేదన్న విమర్శలున్నాయి. మంత్రులు కనీసం సీఎంను కూడా కలవలేకపోయేవారన్న వాదనలూ ఉన్నాయి. అప్పట్లో ఏ రివ్యూ అయినా కేసీఆర్​ లేదా  కేటీఆరో చేసేవారని టాక్​. కానీ, ఇప్పుడు వాటన్నింటికీ సీఎం రేవంత్​ ఆదిలోనే ఫుల్​స్టాప్​ పెట్టారు. ప్రతిరోజూ కనీసం ఏదో ఒక శాఖ మంత్రి అయినా సెక్రటేరియెట్​లో అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. శాఖల్లోని లోటుపాట్లను తెలుసుకుంటున్నారు. స్వేచ్ఛగా ప్రెస్​ కాన్ఫరెన్సులూ పెడ్తున్నారు.

కీలక రివ్యూల్లో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం

బీఆర్​ఎస్​ తొలి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంలున్నా వారికి ప్రాధాన్యం తక్కువే ఉండేది. కానీ, కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక డిప్యూటీ సీఎం ప్రొటోకాల్​ను విధిగా అమలు చేస్తున్నారు. అన్ని కీలక రివ్యూల్లోనూ సీఎం రేవంత్​తోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భాగస్వామ్యమవుతున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్​ వెళ్లారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై ఇద్దరూ కలిసి ప్రధాని మోదీతో చర్చించారు. మీడియాతో మాట్లాడేటప్పుడు భట్టితోనూ సీఎం మాట్లాడించారు. రెండు వారాల కింద ఆర్బీఐ మాజీ గవర్నర్​ రఘురామ్​ రాజన్​తో భేటీ అయిన సందర్భంలోనూ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసే ఆయనతో చర్చలు జరిపారు. రాష్ట్రాన్ని అప్పుల గండం నుంచి గట్టెక్కించి ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఇద్దరూ కలిసే నిర్ణయాలు తీసుకుంటున్నారు.

మంత్రులు మాట్లాడగలుగుతున్నరు

మునుపటి ప్రభుత్వంలోలాగా కాకుండా మంత్రులు మాట్లాడేందుకు పూర్తి స్వేచ్ఛ లభించింది. వారి శాఖలకు ఏం కావాలన్నా సీఎంతో మాట్లాడగలుగుతున్నారు. శాఖలపై రివ్యూలు చేస్తూ.. మీడియాకు స్వేచ్ఛగా వివరాలు వెల్లడిస్తున్నారు. ఇటీవల వివిధ శాఖల్లో అప్పులు, అక్రమాలపై ఆయా శాఖల మంత్రులే స్వయంగా రివ్యూ చేసి మీడియాకు వివరాలు ప్రక టించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కు సంబంధించి ఇటీవల మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డితో కలిసి సీఎం కేంద్ర మంత్రులతో భేటీ అయ్యా రు. ఆ భేటీ వివరాలు సీఎం కాకుండా మంత్రి ఉత్తమే మీడియాకు వెల్లడించారు. మామూలుగా అయితే సీఎం, మంత్రి ఇద్దరు వెళ్లినప్పుడు హోదా పరంగా మీడియాకు సీఎం వివరాలు వెల్లడిస్తుంటారు. కానీ, ఇక్కడ సంబంధిత శాఖ మంత్రే వివరాలు వెల్లడించారు. అదేకాదు.. రెవెన్యూ, ఆర్​ అండ్​ బీ, రవాణా శాఖ, సివిల్​ సప్లైస్​, పంచాయతీరాజ్​ సహా అన్ని శాఖల మంత్రులు అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

పార్టీలో అందరికీ విలువ

కాంగ్రెస్​ పార్టీ అంటేనే అంతర్గత కొట్లాటలకు పేరు అని ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటారు. ప్రభుత్వంలోకి వచ్చినా అవి అలాగే కొనసాగుతాయని  ఎద్దేవా చేసేవారు. అయితే, ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీనియర్​ లీడర్లందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. పార్టీలోని అందరికీ విలువ ఇస్తున్నారు. పార్టీలో సీనియర్​ లీడర్లు, మంత్రులైన భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, దామోదర రాజనర్సింహ సహా అందరినీ సీఎం రేవంత్​ కలుపుకుపోతున్నారు. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సోషల్​ మీడియాలో రేవంత్​, భట్టితో కూడిన రెండు వీడియోలను పోస్ట్​ చేశారు. తమ స్నేహం పటిష్ఠమైనదని, ప్రతిపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తున్నారు.

కంచెలు తెంచి..

కాంగ్రెస్​ ప్రభుత్వం కొలువు దీరగానే.. ప్రగతిభవన్​ కంచెలు తొలగిపోయాయి. ఆ భవన్​ను ప్రజాభవన్​గా మార్చారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి సీఎం, మంత్రులు  వినతులు స్వీకరిస్తున్నారు. బీఆర్​ఎస్​ హయాంలో ఆ భవన్​లోకి సామాన్యులు వెళ్లేందుకు అసలు అవకాశమే ఉండేది కాదు. మంత్రు లు వెళ్లాలన్నా పర్మిషన్​ తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ, ఇప్పుడు అంతా మారిపోయింది. ఇందిరాపార్క్​ వద్దనున్న ధర్నాచౌక్​లో ఎవరైనా నిరసనలు తెలపొచ్చని కాంగ్రెస్​ ప్రభుత్వం పేర్కొంది. గతంలో ధర్నాచౌక్​ను తొలగించాలని అప్పటి బీఆర్​ఎస్​ సర్కార్​ఆదేశాలు ఇచ్చింది. ఆందోళనలు, నిరసనలపై కత్తి కట్టింది. ఇక.. తన కాన్వాయ్​ కోసం ట్రాఫిక్​ను ఆపొద్దని, ప్రజలకు ఇబ్బందులు కల్పించొద్దని అధికారులకు సీఎం రేవంత్​ రెడ్డి సూచనలు చేశారు. కార్లను కూడా ఆరుకు తగ్గించుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్​కు తుంటి ఎముక విరిగి ఆపరేషన్​ జరిగితే.. హాస్పిటల్​కు సీఎం రేవంత్​రెడ్డి, మంత్రులు వెళ్లి పరామర్శించారు. రాజకీయ ప్రత్యర్థులుగా ఎన్ని పదునైన విమర్శలు చేసినా.. ఓ మాజీ సీఎంగా కేసీఆర్​కు ఇవ్వాల్సిన విలువను ఇస్తూ మెరుగైన ట్రీట్​మెంట్​ అందించేలా చర్యలు తీసుకోవాలంటూ వైద్య శాఖను వెనువెంటనే సీఎం రేవంత్​ ఆదేశించారు.

ఆఫీసర్లకు స్వేచ్ఛ

బీఆర్​ఎస్​కు అనుకూలంగా పనిచేశారన్న ముద్ర పడిన పలువురు కీలకమైన ఐఏఎస్​ అధికారులను కాంగ్రెస్​ ప్రభుత్వం బదిలీ చేసింది. వారి స్థానంలో బాగా పనిచేస్తారనుకున్న అధికారులను తీసుకొచ్చింది. ఏండ్లుగా ఒకే దగ్గర విధులు నిర్వహిస్తున్న వారిని కూడా ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నది. బీఆర్​ఎస్​ హయాంలో లూప్​లైన్​లో ఉన్న ఆఫీసర్లకు ఇప్పుడు న్యాయం చేస్తున్నది. అధికారులు స్వేచ్ఛగా ప్రజా సమస్యలపై రివ్యూలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వంలో కొందరు ఆఫీసర్లకు మాత్రమే ప్రయారిటీ ఉండేదని, వారు ఇతర శాఖల్లోనూ కలుగ చేసుకునే వారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని సెక్రటేరియెట్​ వర్గాలు అంటున్నాయి.