సూర్యాపేట జిల్లాలో స్పీడందుకున్న జనరల్ హాస్పిటల్ పనులు

సూర్యాపేట జిల్లాలో స్పీడందుకున్న జనరల్ హాస్పిటల్ పనులు

 

  • రూ.190 కోట్లతో సూర్యాపేటలో 650 పడకల హాస్పిటల్ పనులు 
  •     హాస్పిటల్ బిల్డింగ్ పూర్తి అయితే అందుబాటులోకి 1000  బెడ్స్ 
  •     సకల సౌకర్యాలతో హాస్పిటల్ నిర్మాణం
  •     ప్రస్తుతం ఉన్న హాస్పిటల్ తో అనుసంధానం

సూర్యాపేట, వెలుగు:  సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిర్మాణ పనులు స్పీడ్ అందుకున్నాయి. కాంగ్రెస్ సర్కార్ అన్ని రకాల వసతులతో చేపట్టిన నూతన భవన పనులను ప్రారంభించింది.  ప్రస్తుత జనరల్ ఆస్పత్రికి అనుసంధానంగా మరో 650 పడకలతో కూడిన ఆస్పత్రిని నిర్మించేందుకు చర్యలు చేపట్టారు.  ప్రస్తుతం పనులు వేగంగా సాగుతుండగా త్వరలో భవన నిర్మాణం పూర్తి కానుంది. దీంతో రోగులకు సరిపడా బెడ్లు అందుబాటులోకి వచ్చి మెరుగైన సేవలు అందనున్నాయి.  

రూ.190 కోట్లతో పనులు 

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పక్కన రూ.190 కోట్లతో 650  పడకల ఆస్పత్రిని నిర్మిస్తున్నారు.  ఇప్పటికే ఉన్న ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 350  బెడ్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం నిర్మిస్తున్న భవనంతో బెడ్ల సంఖ్య వెయ్యికి చేరుకోనుంది. నూతన భవనంతో పాటు ఇప్పటికే కొనసాగుతున్న మాతా శిశు సంరక్షణ కేంద్రం భవనం పైనా అదనంగా మరో మూడు అంతస్తులు నిర్మిస్తున్నారు. దీంతో పాటు నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని గ్రౌండ్ ఫ్లోర్ పాటు ఐదు అంతస్తుల్లో చేపట్టారు. 

రెండు భవనాలు కలిసి సుమారు 3.54 లక్షల చదరపు అడుగుల నిర్మాణాన్ని చేపట్టారు.  తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్టక్చర్  డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్  కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు సాగుతున్నాయి. మరో 9 నెలల్లో బిల్డింగ్ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న 350 పడకల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి నూతనంగా నిర్మిస్తున్న 650 పడకల ఆస్పత్రిని అనుసంధానం చేయనున్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి భవనంలోని అన్ని బ్లాక్ లకు నూతనంగా నిర్మిస్తున్న భవనానికి అనుసంధానం చేస్తున్నారు. దీని ద్వారా డాక్టర్లు, పేషెంట్లు  ఎవరైనా ప్రభుత్వ ఆస్పత్రిలోని ఏ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కైనా వెళ్లే సదుపాయం ఉండనుంది. 

అధునాతన సదుపాయాలతో

కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి బిల్డింగ్ లో  పేషెంట్లు, డాక్టర్లు, స్టాఫ్,  ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అధునాతన సదుపాయాలతో నిర్మాణాన్ని చేపట్టారు.  ఐదు అంతస్తుల్లో బిల్డింగ్ నిర్మిస్తుండటంతో  పేషెంట్లు, డాక్టర్లు,  ప్రజలు వెళ్లడానికి ఇబ్బందులు లేకుండా హాస్పిటల్ లోపల నాలుగు భారీ లిఫ్ట్ లను ఏర్పాటు చేయనున్నారు. అన్నిరకాల వ్యాధులకు రోగులకు చికిత్సలు అందించేందుకు సరిపడా 10 ఆపరేషన్ థియేటర్లు, అధునాతన వైద్య పరికరాలు, మిషన్లు అందుబాటులో ఉంచనున్నారు. ప్రాంగణంలో గార్డెన్ ఏర్పాటు చేయనున్నారు.

త్వరలో పనులు పూర్తి 

సూర్యాపేటలో నిర్మిస్తున్న ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ బిల్డింగ్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.  మరో తొమ్మిది నెలల్లో పనులు పూర్తి  చేసి అందుబాటులోకి తీసుకొస్తాం.  మొత్తం 3.74 లక్షల చదరపు అడుగుల్లో భవనాన్ని నిర్మిస్తున్నాం.  భవనంలో విశాలమైన గదులు, లిఫ్టులు, మిగిలిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. నూతనంగా నిర్మించే భవనంతో ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని భవనాలకు అనుసంధానం చేయనున్నాం.  భవనం పూర్తయితే  వెయ్యి పడకల ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. - రాజశేఖర్, ఈఈ, టీఎంఎస్ఐడీసీ