కాలనీ పార్కుల మెయింటెనెన్స్ చార్జీలు పెరిగినయ్

కాలనీ పార్కుల మెయింటెనెన్స్ చార్జీలు పెరిగినయ్
  • బల్దియా స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యుల ఆమోదం
  • మరో 11 అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరగగా.. 13 అంశాలకు గాను పన్నెండింటిని సభ్యులు ఆమోదించారు.  కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా నిర్వహిస్తున్న పార్కుల మెయింటెనెన్స్ కోసం నిధులు 75 శాతం నుంచి 80 శాతానికి పెంపు, చందానగర్ వద్ద ఆర్వోబీ నిర్మాణానికి నార్ని రోడ్ నుంచి జీఎస్ఎం మాల్ వయా ఆర్టీసీ కాలనీ వరకు 28 ఆస్తుల సేకరణ,  నానక్ రాంగూడ జంక్షన్ నుంచి గచ్చిబౌలి ఐటీ హైట్స్ రోడ్ వరకు రూ.5 కోట్ల 50 లక్షలతో అభివృద్ధి పనులతో పాటు మరో తొమ్మిది అంశాలకు స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన సమావేశం జరగగా.. కమిటీ సభ్యులు దేవేందర్ రెడ్డి, అబ్దుల్ సలామ్ షాహిద్,  మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, సామల హేమ, కమిషనర్  లోకేశ్ కుమార్, సీఈ ప్రాజెక్ట్ దేవానంద్, అడిషనల్ కమిషనర్లు పాల్గొన్నారు. 

స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం గురువారం ఒక నామినేషన్ దాఖలైంది. టీఆర్ఎస్​ కార్పొరేటర్ ఆర్. సునీత నామినేషన్ వేశారు. ఈ నెల 2న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ  10వ తేదీ  మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. 11న స్క్రూట్నీ,  19న బల్దియా హెడ్డాఫీసులో పోలింగ్​, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు కౌంటింగ్​ నిర్వహించనున్నారు.