కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలకు ఓ ప్యాకేజీ

కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలకు ఓ ప్యాకేజీ

రూ.30 వేలు చెల్లిస్తే కరోనా రూల్స్ ప్రకారం అంత్యక్రియలు
హైదరాబాద్‌‌లో కొత్తగా పుట్టు కొచ్చిన ఏజెన్సీలు

హైదరాబాద్‌లోని మల్లెపల్లికి చెందిన తానం రఘురాజ్.. సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో కరోనాతో చనిపోయారు. వెంటనే ఓ ఏజెన్సీ వారు రఘురాజ్ భార్యకు ఫోన్ చేశారు. సంప్రదాయం ప్రకారం అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. రూ.30 వేలు ఫీజు చెల్లిస్తే చాలన్నారు. రఘురాజ్ కుటుంబ సభ్యులు దీనికి అంగీకరించారు. దీంతో ఏజెన్సీ వారే రఘురాం బాడీని హాస్పిటల్ నుంచి శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేసి చితాభస్మం అందజేశారు.

హైదరాబాద్, వెలుగు: కరోనా… మనిషిని మార్చింది..బతుకును మార్చింది.. కట్టుబాట్లను మార్చింది.. సంప్రదాయాలను మార్చింది.. మొత్తంగా సమాజపు రూపురేఖలనే మార్చింది.. ఆఖరికి అంత్యక్రియల తీరునూ మార్చింది. ఇప్పుడు అంత్యక్రియల్లో ఆచారాలు లేవు.. పాడి మోసేందుకు ’ఆ నలుగురు‘ కూడా లేరు. అందుకే ఇప్పుడు ’వ్యాపారం‘ పుట్టింది. అంత్యక్రియలు మేం చేస్తామంటూ ఏజెన్సీలు పుట్టుకొచ్చాయి.’మీరు ఫీజు చెల్లించండి చాలు.. మిగతావి మేం చూసుకుంటాం‘ అంటున్నాయి.

సొంతవాళ్లే దూరం జరుగుతుంటే..

కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించాలంటే బంధువులకు పెద్ద ప్రయాస. వైరస్ తమకు ఎక్కడ సోకుతుందోననే భయంతో సొంత వాళ్లు కూడా దగ్గరికి రావడంలేదు. దీంతో అంత్యక్రియలు ఇతరులు చేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో మున్సి పల్ సిబ్బంది అంతా చూసుకుంటున్నారు. అయితే తమ వాళ్ల అంత్యక్రియలు ఎలా చేస్తారోననే ఆందోళన, ఇన్నాళ్లూ తమతో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎవరూ లేని అనాథగా వెళ్లిపోతున్నారనే బాధ చాలా మందిలో ఉంది. ప్రైవేటు హాస్పిటల్స్‌‌‌‌లో చనిపోయిన వారి అంత్యక్రియలను సొంతకుటుంబీకులే కొంచెం దూరం ఉండి చేయించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కొత్తగా ప్రైవేటు ఏజెన్సీలు ప్రారంభమయ్యాయి. హాస్పిటల్ నుంచి శ్మశాన వాటికకు మృతదేహాన్ని తరలించి , సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారు. కరోనా రూల్స్ పాటిస్తున్నారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది కుటుంబసభ్యులను రానివ్వడంలేదు. దహనంచేస్తే.. కుటుంబంలో ఒకరితో దూరంనుంచి చితికి నిప్పు పెట్టిస్తున్నారు. చితాభస్మం ఇస్తున్నారు.

పేషెంట్ చనిపోగానే కుటుంబ సభ్యులకు ఫోన్

హాస్పిటల్లో పేషెంట్ చనిపోగానే వారి కుటుంబ సభ్యులకు ఏజెన్సీ నిర్వాహకులే ఫోన్ చేస్తున్నారు. ’‘మీ ఫ్యామిలీ మెంబర్ కరోనాతో చనిపోయారు. హైదరాబాద్‌లోమా ఏజెన్సీ ఉంది. మీరు హాస్పిటల్‌కు వచ్చే టైం చెబితే అన్నిఏర్పాట్లు చేస్తాం. ఫీజు రూ.30 వేలు. అంతా కరోనా రూల్స్ ప్రకారమే చేస్తాం. శ్మశాన వాటిక లోపలికి రావాలనుకునే వారు కచ్చితంగా పీపీపీ కిట్లు తొడుక్కోవాలి. ఒక్కో కిట్ రూ.1,200 అదనంగా చెల్లించాలి’ అని వివరిస్తున్నారు.

’‘గతంలో అంబులెన్స్ సర్వీసులు నిర్వహించేవాళ్లం. చనిపోయిన వారి మృతదేహాన్ని ఇంటి వరకు తరలించేందుకు రూ.5 వేలు తీసుకునే వాళ్లం. ఇప్పుడు కరోనా వల్ల చనిపోయిన డెడ్ బాడీలకు అంత్యక్రియలు చేసే వర్క్ మొదలుపెట్టాం. ప్రైవేటు హాస్పిటల్స్‌లో చనిపోయే వారి అంత్యక్రియలు ఎక్కువ శాతం మేమే చేస్తున్నాం‘‘ – హైదరాబాద్‌‌లోని స్టాండ్‌ప్లస్ ఏజెన్సీ నిర్వాహకుడు.

మ‌రిన్ని వార్తల కోసం..