ఇందిర హత్యను గుర్తు చేస్తూ కెనడాలో పరేడ్..

ఇందిర హత్యను గుర్తు చేస్తూ కెనడాలో పరేడ్..
  • ఇండియా ఆగ్రహం
  • తీవ్రవాదులకు ఆశ్రయమివ్వడం సరికాదన్న  జైశంకర్
  • కెనడా ‑ భారత్​ బంధంపై ప్రభావం పడుతుందని హెచ్చరిక
  • ఘటనను ఖండించిన కెనడియన్ హైకమిషనర్

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను గుర్తు చేస్తూ.. ఆ సీన్​ను కెనడాలోని బ్రాంప్టన్ సిటీలో పరేడ్‌‌లా నిర్వహించడం తీవ్ర వివాదాస్పదమైంది. దాన్ని ‘వీరోచిత ఘటన’గా ప్రచారం చేస్తూ కొందరు ఖలిస్థాన్ మద్దతుదారులు ఈ ర్యాలీ చేపట్టడంపై ఇండియా తీవ్రంగా స్పందించింది. ఇటువంటి చర్యలు ఎంతమాత్రం ఆమోదించదగినవి కాదని.. కెనడా ప్రభుత్వానికి తన అసంతృప్తిని తెలిపింది. ఒట్టావాలోని ఇండియన్ హై కమిషన్ బుధవారం గ్లోబల్ అఫైర్స్ కెనడాకు దీనిపై నోటీసులు ఇచ్చింది. ఇలాంటి తీవ్రవాదులు, వేర్పాటువాదులకు కెనడా ఆశ్రయమివ్వడం సరికాదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ బుధవారం అన్నారు. ఇలాంటి ఘటనలు కెనడా, భారత్ బంధంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని హెచ్చరించారు. ‘‘ఈ ర్యాలీ వెనక భారీ కుట్ర ఉన్నట్టు కనిపిస్తున్నది. ఇది ఓటు బ్యాంకు రాజకీయమే. ఇలాంటి వేర్పాటువాదులకు ఆశ్రయమివ్వడం మంచిది కాదు. రెండు దేశాల మధ్య రిలేషన్స్ తగ్గిపోతాయి. దీనిపై కెనడా అత్యున్నత స్థాయి అధికారులు స్పందించాలి. కావాలనే హింసను ప్రేరేపిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి’’ అని అన్నారు. ఇందిర హత్యను వేడుకలా జరుపుకోవడాన్ని ఇండియాలోని కెనడా హైకమిషనర్ కామెరాన్ మాకే ఖండించారు. ఈ వార్తలు చూసి దిగ్ర్భాంతికి గురయ్యానని చెప్పారు.

స్టూడెంట్లపై చర్యలా..: జైశంకర్

తప్పుడు పత్రాలతో అక్రమంగా దేశంలోకి వచ్చారంటూ 700 మంది భారతీయ విద్యార్థులకు కెనడా అధికారులు డిపోర్టేషన్ నోటీసులు జారీ చేశారు. వీటిని అందుకున్న స్టూడెంట్లు ఆందోళన చేస్తున్నారు. ఈ విషయంపై కెనడా అధికారులతో భారత విదేశాంగశాఖ చర్చలు జరుపుతోందని జైశంకర్​ తెలిపారు. ‘ స్టూడెంట్లు చిత్తశుద్ధితో వ్యవహరించారు. మోసంతో వారిని తప్పుదోవ పట్టించిన వ్యక్తులు, పార్టీలపై చర్యలు తీసుకోవాలి. ఉద్దేశపూర్వకంగా ఏ తప్పు చేయని స్టూడెంట్లను శిక్షించడం అన్యాయమని కెనడియన్లు కూడా అంగీకరిస్తారని భావిస్తున్న” అని ఆయన అన్నారు.