
హైదరాబాద్ నగరంలో మరో భారీ మోసం బయటపడింది. దీపం వత్తులు తయారీ పేరుతో ఓ వ్యక్తి సుమారు రూ.250 కోట్ల వరకూ మోసం చేశాడు. ఈ వ్యవహారంలో సుమారు 1500 మంది వరకు మోసపోయినట్లు తెలుస్తోంది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఎస్ రావునగర్ లో ఈ ఘరానా మోసం బయటపడింది. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
ఏఎస్ రావునగర్ లో రమేష్ రావు అనే వ్యక్తి.. ఆర్ఆర్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేశాడు. దీపం వత్తుల తయారీకి యంత్రాలు ఇప్పిస్తానంటూ చాలామందికి మాయమాటలు చెప్పాడు. ఇది నిజమేనని నమ్మిన కొంతమంది దీపం వత్తులు తయారు చేసే యంత్రాలను రమేష్ రావు వద్ద నుంచి కొనుగోలు చేశారు. ఒక్కొక్కరి వద్ద నుండి దాదాపు రూ.5 నుండి 10 లక్షల వరకూ వసూలు చేశాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లోని కొంతమందికి మిషిన్లు అమ్మాడు.
అయితే.. దీపం వత్తుల మెషీన్లతో దూది వత్తులు తయారు చేసి ఇచ్చిన ఏ ఒక్కరికి కూడా రమేష్ రావు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. డబ్బులు అడిగితే ఇవాళ, రేపు ఇస్తానంటూ గత ఆరు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒకసారి బాధితులందరూ రమేష్ రావును నిలదీయడంతో కొద్దిసేపు ఆగండని చెప్పి.. కంపెనీ వెనుక దారి నుంచి తప్పించుకుని పారిపోయాడని చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కుషాయిగూడ పోలీసులను బాధితులు ఆశ్రయించారు. ఇప్పటివరకు సుమారు 1500 మంది వరకు వత్తుల మెషీన్లు కొనుగోలు చేశారని, సుమారు రూ.250 కోట్ల వరకు స్కాం జరిగిందని బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.