డాక్యుమెంట్ లేని బైక్ లు కొని .. సెకండ్ హ్యాండ్ లో అమ్ముతుండు

డాక్యుమెంట్ లేని బైక్ లు కొని .. సెకండ్ హ్యాండ్ లో అమ్ముతుండు
  • బైక్ ల ఇంజన్, చాసిస్ నంబర్లు టాంపరింగ్ చేసే అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

బషీర్ బాగ్,వెలుగు :  ఎలాంటి పత్రాలు లేని బైకులను స్క్రాప్ కింద కొనుగోలు చేసి, ఇంజన్, చాసిస్ నెంబర్లు టాంపరింగ్ చేసి సెకండ్ హ్యాండ్ బైకులకు అమ్మే ఓ వ్యక్తిని ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ , అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం... కింగ్ కోఠి షేర్ గేట్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అక్బరుద్దీన్ (34), స్థానికంగా నియమత్ ఇంజనీరింగ్ వర్క్స్ పేరిట లేత్ మెషిన్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నాడు. వచ్చే డబ్బులు సరిపోవడంలేదు. నకిలీ ఇంజన్ , చాసిస్ నంబర్లను తయారు చేసి సెకండ్ హ్యాండ్ లో బైకులను విక్రయించాలని ప్లాన్ వేశాడు. అందుకు స్క్రాప్ కింద ఎలాంటి పత్రాలు లేని బైకులను తక్కువ ధరలకు కొనుగోలు చేసేవాడు. అనంతరం ఆయా బైకుల ఇంజన్, చాసిస్ నంబర్లతో పాటు పనికి వచ్చే పార్ట్స్ లను వేరు చేసి , వాటితో కొత్తగా బైకులను తయారు చేసేవాడు. ఇంజన్ , చాసిస్ నంబర్లను టాంపరింగ్ చేసి వాటికి నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్ ,  పేపర్లను తయారు చేసి  సెకండ్ హ్యాండ్ బైకులుగా అమ్ముతున్నాడు. సమాచారంతో ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, అబిడ్స్ పోలీసులు శుక్రవారం మహమ్మద్ అక్బరుద్దీన్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద టాంపరింగ్ చేసిన ఏడు బైకులు , కటింగ్ మిషన్ , 40 ఆల్ఫాబెటిక్ ఐరన్ డైస్ , 9 న్యూమరిక్ డైస్ లను సీజ్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఎవరైనా సెకండ్ హ్యాండ్ లో బైకులను కొనుగోలు చేసేప్పుడు , బైక్ ఎవరి పేరుపై ఉందో చెక్ చేసుకోవాలని  వెంటనే కొనుగోలు చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు.