
బ్రాండెడ్ జీన్స్ కోసం వేలకు వేలు డబ్బులు పోసి కొంటారు చాలామంది. అయితే, నార్త్ కరోలినాలోని ఒక వ్యక్తి మాత్రం 94 లక్షలు పెట్టి ఒక ప్యాంట్ కొన్నాడు. అది కూడా పాతది. పాత ప్యాంట్ అన్ని లక్షలేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇది చదవండి.
నార్త్ కరోలినా తీరంలో ప్రమాదవశాత్తు 1857లో మునిగిపోయిన ఒక నౌకని గుర్తించారు. ఆ నౌకలోని ట్రంక్ పెట్టెలో పాడైపోయిన ఒక తెల్లని జీన్స్ ప్యాంట్ దొరికింది. అంటే ఆ ప్యాంట్ కి 165 ఏండ్లు అన్నమాట. ఆ ప్యాంట్ ని వేలంలో 94 లక్షలకు (114,000 డాలర్లు) దక్కించుకున్నాడు ఓ వ్యక్తి. ఆ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే, ఈ ప్యాంట్ ని ఏ కంపెనీ తయారుచేసింది అన్నదానిపై చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచంలో మొదట జీన్స్ తయారుచేసింది లెవి కంపెనీ. ఈ కంపెనీని 1873వ సంవత్సరంలో ప్రారంభించారు. లెవి జీన్స్ కంటే ఈ ఓడలో దొరికిన ప్యాంట్ 16 ఏండ్లు పెద్దది. అయితే, లెవి కంపెనీకంటే ముందు ఇంకొక జీన్స్ కంపెనీ ఉండేదా? లేక ఈ జీన్స్ ని అక్కడ ఎవరైనా వదిలారా అనేది ఇక్కడ చర్చ.