ఆర్ఎస్ఎస్ నిక్కర్​కు నిప్పు రాజుకున్న ఫొటోను షేర్​ చేసిన కాంగ్రెస్

ఆర్ఎస్ఎస్ నిక్కర్​కు నిప్పు రాజుకున్న ఫొటోను షేర్​ చేసిన కాంగ్రెస్
  • విద్వేషం నుంచి దేశానికి స్వేచ్ఛ కల్పిస్తామని ప్రకటన
  • ఇంకా 145 రోజులే మిగిలి ఉన్నాయంటూ క్యాప్షన్
  • అది భారత్​ తోడో, ఆగ్​ లగావో యాత్ర: బీజేపీ

 

న్యూఢిల్లీ: కాంగ్రెస్​ పార్టీ ట్విటర్​లో పోస్ట్​ చేసిన ఓ ఫొటో తీవ్ర దూమారాన్ని రేపింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యకర్తలు వేసుకునే నిక్కర్​కు మంటలు అంటుకున్నట్టుగా ఉన్న ఫొటోను కాంగ్రెస్​ పార్టీ ట్వీట్​ చేసింది. దాని నుంచి పొగ వస్తున్నట్టుగా ఉంది. కాంగ్రెస్​ పార్టీ అధికారిక ట్విటర్​ అకౌంట్​లో ఈ ఫొటోను పోస్ట్​ చేసింది. విద్వేషం నింపుతున్న వాతావరణం నుంచి దేశానికి స్వేచ్ఛనిచ్చేందుకు ఒక్కో అడుగు మందుకు వేస్తూ సాగుతున్నామని, ఆర్ఎస్ఎస్, బీజేపీ దేశానికి చేసిన నష్టాన్ని పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కోట్​ చేసింది. ఇంకా 145 రోజులే మిగిలాయంటూ క్యాప్షన్​ పెట్టింది. భారత్​ జోడో యాత్రలో భాగంగా ఈ పోస్ట్​ చేసింది. 

అది ఆగ్​లగావో యాత్ర: బీజేపీ
కాంగ్రెస్ ​ఫొటోపై బీజేపీ మండిపడింది. అది భారత్​ జోడో యాత్ర కాదని, భారత్​ తోడో, ఆగ్​ లగావో యాత్ర అని, కాంగ్రెస్​ పార్టీకి ఇలాంటివి చేయడం కొత్త కాదని ఆరోపించింది. దేశంలో హింస చెలరేగాలని రాహుల్​గాంధీ కోరుకుంటున్నారా? అని, కాంగ్రెస్​ పార్టీ వెంటనే ఫొటోను తొలగించాలని బీజేపీ లీడర్​ సంబిత్​ పాత్రా డిమాండ్ చేశారు. బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య కూడా కాంగ్రెస్​ పార్టీపై విరుచుకుపడ్డారు. 1984లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి నిప్పు పెట్టిందని ఆరోపించారు. 2002లో కరసేవకుల్ని ఆ పార్టీ సానుభూతిపరులు గోద్రాలో నిప్పుపెట్టారని, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ హింసను ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు. రాహుల్​ గాంధీ దేశానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల వల్లే కాంగ్రెస్​ పార్టీగా కొనసాగుతోందని చెప్పారు. మరోవైపు బీజేపీ ఓ అబద్ధాల ఫ్యాక్టరీ.. అది ఇప్పుడు ఓవర్​టైం చేస్తోందని కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు జైరాం రమేశ్​ ఆరోపించారు. అధికార పార్టీ దూకుడు ప్రదర్శిస్తే.. తాము మరింత దూకుడు చూపిస్తామన్నారు.

రాహుల్​ యాత్రకు మంచి స్పందన
కేరళలో రెండో రోజు రాహుల్​ భారత్​ జోడో యాత్రకు జనం నుంచి మంచి స్పందన వచ్చింది. ‘‘దేశం, మన యువత మెరుగైన భవిష్యత్​ కోసం ఎదురుచూస్తోంది. అదే నాలో ప్రతి ఉదయం ఆశ, విశ్వాసాన్ని నింపుతోంది. దేశం కోసం ప్రతి ఒక్కరూ, దేశం కోసం ప్రతి అడుగు”అని రాహుల్​ ఫేస్​బుక్​లో ఒక పోస్ట్ పెట్టారు. రాహుల్​ను చూసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు చిన్నా పెద్దా అసక్తి చూపించారు. వేలాది మంది ఆయన కోసం ఎదురుచూశారు. సోమవారం వెల్లయాని జంక్షన్​ నుంచి రాహుల్​ పాదయాత్ర మొదలైంది.