మల్లన్న గుడిలో డామినేషన్ వార్ 

మల్లన్న గుడిలో డామినేషన్ వార్ 

సిద్దిపేట, వెలుగు : కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఆధిపత్య పోరు నడుస్తోంది.  స్థానికుడైన  ఒక ఆఫీసర్​కు   పాలక మండలి ముఖ్యనేతకు మధ్య ఏర్పడిన విభేదాలు ముదిరాయి. అంతర్గత పోరులో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని వాడుకుంటున్నారు. ఈమధ్య ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి  ఆర్థిక అవకతవకలు చేశాడని ఆరోపిస్తూ  వెంటనే అతన్ని తొలగించాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేయడం, మరో ఉద్యోగిపై బోర్డు సభ్యుడు ఫిర్యాదు చేయడంతో  లుకలుకలు బయటపడ్డాయి. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ముందుంచి  అక్రమాలకు  తెరలేపుతున్నారని ఆరోపణలు వున్నాయి..  ఇదిలా వుంటే రూల్స్​కు విరుద్ధంగా ఆలయానికి సంబంధించిన అభివృద్ధి పనుల  ఫైళ్లను పాలక మండలి ముఖ్య నేత పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో  గతంలో జరిగిన కొన్ని ఘటనలు, ఆర్థిక అవకతవకలను గుర్తించి తనకు అనుకూలంగా లేని సదరు ఆఫీసర్​ను అడ్డుతొలగించుకోవాలనే ఉద్దేశంతో పావులు కదుపుతున్నట్టు  సమాచారం. 

ఔట్​ సోర్సింగ్ ఉద్యోగులే  బలిపశువులు..

ఆలయ ఆధిపత్య పోరులో  ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు బలిపశువులుగా మారుతున్నారు.  ఐదేండ్ల కాలంలో పలు అవినీతి ఆరోపణలు వచ్చిన పది మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై  వేటు పడటం గమనార్హం.  ఆలయ విధుల్లో  కీలకంగా వ్యవహరించే ఆఫీసర్లు తమ చేతికి మట్టి అంటకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ముందు పెట్టి తమ అక్రమాలను సాగిస్తున్నట్టు తెలుస్తోంది.  ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను  రిక్రూట్​మెంట్​  చేసుకునేటప్పుడు  తమ అనుచరులతోపాటు భారీగా డబ్బులు వసూలు చేసి డ్యూటీలోకి  తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  తమకు అనుకూలంగా వున్న సిబ్బందికి ఎక్కువ సాలరీ చెల్లించడం తోపాటు ఇష్టం లేని వారిని ఏదో ఒక అవినీతి ఆరోపణల్లో ఇరికించి ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారనే వాదనలకు పలు ఘటనలు బలం చేకూరుస్తున్నాయి. 

మనోడైతే అన్నీ మాఫ్..

మల్లన్న ఆలయంలో పనిచేసే ఉద్యోగులతో పాటు ఇతర అంశాల్లో  మనోడైతే చాలు  అన్నీ మాఫ్ అన్నట్టుగా ఆఫీసర్లు వ్యవహరిస్తున్నారు.  ఈమధ్య కొన్ని సంఘటనలను పెద్దగా పట్టించుకోని ఆఫీసర్లు  ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి విషయాన్ని సీరియస్ గా తీసుకుని తొలగించాలని సిఫార్సు చేయడం, ఒక ఉద్యోగి పాలక మండలి సభ్యుడిపై అమర్యాదగా ప్రవర్తించడం  ఇందుకు నిదర్శనమని పలువురు చెబుతున్నారు.  పాలక మండలిలోని ప్రముఖుడి బంధువు ఆలయ స్థలాన్ని ఆక్రమించి  అమ్ముకోగా అదే స్థలంలో ఓ ప్రైవేటు వ్యక్తి ఇంటి నిర్మాణాన్ని చేపట్టగా తూతూ మంత్రంగా పనులను నిలిపివేశారు.  మరోచోట తమకు వ్యతిరేకంగా వున్న వ్యక్తి ఇంటినిర్మాణం చేపట్టగా రూల్స్​ పాటించలేదని  కూల్చివేశారు. 

మైక్ అనౌన్స్​ మెంట్​  బంద్...?

‘‘భక్తులు స్వామి వారికి సమర్పించే కానుకలు హుండీలోనే వేయాలి... పూజారులకు,  ఒగ్గు పూజారులకు డబ్బులు ఇవ్వొద్దు” అని  కొమురవెల్లి మల్లన్న  జాతర ఆవరణలో మైక్ అనౌన్స్​ మెంట్​  కొంత కాలంగా వినిపించడం లేదు. మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులు పలు సందర్భాల్లో పూజారులకు, ఒగ్గు పూజారులకు భక్తితో కట్న కానుకలు సమర్పించుకుంటారు. దీనికి అడ్డుకట్ట వేయాలని ఆలయ ఆఫీసర్లు మైకుల్లో ప్రతీ రోజు పొద్దటి నుంచి రాత్రి వరకు అనౌన్స్​ మెంట్​ చేసే వారు కాని కొంత కాలంగా బంద్​ చేయడంపై  పెద్ద గూడుపుఠాణి ఉన్నట్టు తెలుస్తోంది. పాలక మండలిలోని ముఖ్యుడొకరికి  భారీగా మామూళ్లు అందడంతో ఈ అనౌన్స్​ మెంట్​ నిలిపివేసినట్టు తెలుస్తోంది.  తమకు వచ్చే ఆదాయాన్ని  కోల్పొతామనే ఉద్దేశంతో  మైక్ అనౌన్స్​ మెంట్​ లేకుండా చూడటం కోసం కొందరు తెరవెనుక ప్రయత్నాలు చేయడంతో  ఇది నిలిచిపోయినట్టు సమాచారం. 

ఆఫీసర్​ బదిలీకి ప్రయత్నాలు

ఆలయ విధుల్లో ఉన్న  ఒక కీలక  ద్వితీయ శ్రేణి ఆఫీసర్​ను మల్లన్న ఆలయం నుంచి బదిలీ చేయించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సదరు ఆఫీసర్​ అధికారాలను  కత్తిరించడానికి మరొక ఆఫీసర్ ను ​ ఆగమేఘాలపై కొమురవెల్లికి రప్పించడమే కాకుండా ఆ ఆఫీసర్​ను బదిలీ చేయించాలనే దిశగా పావులు కదుపుతున్నట్టు చెబుతున్నారు. ఆ ఆఫీసర్​ సైతం ఇలాంటి ప్రయత్నాలను పసిగట్టి తనదైన శైలిలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. పాలక మండలి ముఖ్యుడొకరు కొమురవెల్లిలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టగా దానికి కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసే ప్రయత్నాలు మొదలు పెట్టడంతో సదరు ఆఫీసర్​ చెక్ పెట్టినట్టు ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా లక్షలాది భక్తులు దర్శించుకునే కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాల్సిన సమయంలో ఒకరిపై ఒకరు అధిపత్య పోరు కొనసాగిస్తుండడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

పెద్దాఫీసర్లకు ఉత్తరాలు

ఆలయంలో జరుగుతున్న అవకతవకలపై  కొంత కాలంగా ఒకరిపై ఒకరు  ఆకాశ రామన్న, కోటయ్య పేరిట  పై ఆఫీసర్లకు ఉత్తరాల ద్వారా ఫిర్యాదులు పంపారు.  కొందరు ఆఫీసర్లు ఏండ్ల తరబడి ఆలయం విధుల్లో కొనసాగుతుండటం  అక్రమాలకు అవకాశం ఏర్పడటంతో పాటు పలు సందర్భాల్లో భేదాభిప్రాయాలు రావడంతో ఒకరిపై ఒకరు ఉత్తరాలతో   పై ఆఫీసర్లకు  ఫిర్యాదులు చేసుకుంటున్నట్టు  సమాచారం.  గతంలో పాలక మండలి ముఖ్యుడి అవినీతి అక్రమాలపై  కొమురవెల్లిలో పలు చోట్ల కరపత్రాలు వెదజల్లిన సంఘటన కూడా జరగడం గమనార్హం.