ఇథనాల్ చిచ్చు

ఇథనాల్ చిచ్చు
  • ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా మూడు ఊర్ల ప్రజల ఆందోళన
  • పోలీసుల లాఠీచార్జ్, ఉద్రిక్తత
  • కంపెనీ ట్యాంకర్​ను అడ్డుకున్న గ్రామస్తులు.. 
  • ప్రజలపై పోలీసుల ప్రతాపం.. నలుగురికి గాయాలు
  • తిరగబడిన జనం.. పోలీసు వాహనాలకు నిప్పు
  • సీఐ, ఎస్ఐ సహా నలుగురు కానిస్టేబుళ్లపై దాడి.. 
  • నారాయణపేట జిల్లా చిత్తనూరులో ఉద్రిక్త పరిస్థితి

మహబూబ్​నగర్​/మరికల్, వెలుగు: నారాయణపేట జిల్లా మరికల్​ మండలం చిత్తనూరులో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా మూడు గ్రామాల ప్రజలు చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారేయడంతో రోగాల పాలవుతున్నామంటూ ఆందోళనకు దిగిన జనంపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులపై ప్రజలు తిరగబడ్డారు. సీఐ, ఎస్ఐ సహా నలుగురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. పోలీసులకు చెందిన రెండు బైక్​లు, వజ్ర వెహికల్​కు నిరసనకారులు నిప్పు పెట్టారు. 

మరికల్ మండలం చిత్తనూరు వద్ద ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యర్థాలు చెరువుల్లో పారేయడంతో చేపలు, నీళ్లు తాగిన జంతువులు చనిపోతున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని నిరసన తెలియజేస్తుంటే పోలీసులు లాఠీచార్జ్ చేశారని మండిపడ్డారు.

ఏడాదిన్నరగా నిరసన కార్యక్రమాలు

ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఏడాదిన్నర నుంచి చిత్తనూరు, ఎక్లాస్​పూర్, జిన్నారం గ్రామస్తులు నిరసన తెలియజేస్తున్నారు. అధికారులు, పోలీసుల అండతో యాజమాన్యం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో కొద్ది రోజుల కింద కంపెనీలో ట్రయల్ రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బయటకు వస్తున్న వ్యర్థాలను పది రోజులుగా గ్రామాలకు దగ్గర్లోని వాగులు, చెరువులు, గుంతల్లో, రోడ్ల పక్కనే పడేస్తున్నారు. దీని కోసం స్పెషల్​గా పది ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే చెరువులు, వాగుల్లో వ్యర్థాలు డంప్ చేయడంతో చేపలు చనిపోయాయి. ఆ నీళ్లు తాగిన జింకలు, పశువులు మృత్యువాతపడ్డాయి. ఇటీవల పిల్లాడు చిత్తనూరు సమీపంలోని వాగులో ఈత కొట్టి ఇంటికి రాగా.. అతని బాడీపై బొబ్బలు వచ్చాయి. 

శనివారం నుంచి రోడ్డుపై బైఠాయింపు

వ్యర్థాలు ఇక్కడ డంప్ చేయొద్దని శనివారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఎక్లాస్​పూర్ స్టేజీ వద్ద ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాల లోడ్​తో వస్తున్న ట్యాంకర్​ను గ్రామస్తులు అడ్డుకున్నారు. రాత్రంతా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆదివారం ఉదయం విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్​కు చేరుకున్నారు. ట్యాంకర్​ను వదిలి పెట్టాలని గ్రామస్తులను కోరగా.. ఒప్పుకోలేదు. ఉన్నతాధికారులు వస్తే తమ సమస్య చెప్పుకుంటామని వివరించారు. తహసీల్దార్ సునీత వచ్చి ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని, త్వరలో సమస్య పరిష్కరిస్తామని చెప్పినా వినలేదు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఉన్నతాధికారులు రావడానికి వీలుపడదని చెప్పారు.

లాఠీచార్జ్​తో సీరియస్​

గ్రామస్తులకు పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. వినకపోవడంతో నారాయణపేట డీఎస్పీ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే ఆందోళన విరమించాలని హెచ్చరించారు. అయినా, గ్రామస్తులు మాట వినలేదు. మీరేం చేస్తున్నారంటూ అక్కడే ఉన్న సీఐ, ఎస్ఐలపై డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో చంద్రమ్మ, మనూష, హనుమమ్మ, కతలయ్యకు గాయాలయ్యాయి. వ్యర్థాల ట్యాంకర్​ను అక్కడి నుంచి పోలీసులు తరలిస్తుండగా గ్రామస్తులు తిరగబడ్డారు. దీంతో మక్తల్ సీఐ రాంలాల్, ఎస్ఐ విజయ్ భాస్కర్, కానిస్టేబుళ్లు అరుణ, అనిత, వెంకటేశ్వరమ్మ, నవ్​సీన, చెనరాయుడుకు గాయాలయ్యాయి. 

మరికల్ పోలీస్​స్టేషన్​కు చెందిన రెండు బైక్​లు, టియర్ గ్యాస్ ప్రయోగించే వజ్ర వెహికల్​కు నిరసనకారులు నిప్పు పెట్టారు. పోలీసు వాహనాల అద్దాలు పగులగొట్టారు. ఇథనాల్ కంపెనీ లారీ అద్దాలు ధ్వంసం చేశారు. గాయపడిన వారిని అంబులెన్స్​లో మహబూబ్​నగర్ జనరల్ హాస్పిటల్​కు తరలించారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో రాంచందర్ ఘటనపై ఆరా తీశారు. అయితే, ఎంత మందిపై కేసులు పెట్టారు? ఎంత మందిని అదుపులోకి తీసుకున్నారనే విషయాన్ని పోలీసులు చెప్పేందుకు నిరాకరించారు.

రాళ్లతో కొట్టిన్రు..

కంపెనీ నుంచి వస్తున్న వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. మా ఊరు చుట్టు పక్క ఏరియా అంతా కంపు కొడ్తున్నది. వ్యాన్​ను అడ్డుకున్నా రని తెలిసి నేను కూడా పోయిన. అక్కడే రాత్రంతా ఉన్న. ఆకలైతుంటే అందరం కలిసి అక్కడే రాత్రి రెండు గంటలకు ఉగ్గాని చేసుకొని తిన్నం. పొద్దున్నే పోలీసులు వచ్చి అక్కడి నుంచి మమ్మ ల్ని తరిమికొట్టారు. లాఠీలు, రాళ్లతో దాడి చేశారు. ఓ పోలీస్ రాయి ఇసిరితే నా కాలుకు దెబ్బ తగిలి విరిగిపోయింది.

- చంద్రమ్మ, ఎక్లాస్​పూర్​సద్ది ఇవ్వడానికి వస్తే లాఠీతో కొట్టిన్రు

మా అమ్మ శనివారం సాయంత్రం నుంచి ఇంటికి రాలేదు. ఊళ్లో వాళ్లను అడిగితే వ్యాన్​ను పట్టుకున్న దగ్గర ఉందని చెప్పిన్రు. రాత్రి కూడా అక్కడే పడుకున్నది. ఉదయం సద్ది తీసుకొని వాళ్లున్న దగ్గరికి వెళ్లిన. అప్పటికే పోలీసులు అందరినీ చెదరగొడుతున్న రు. అక్కడ ఉన్న నన్ను కూడా లాఠీతో కొట్టిన్రు. నా తల పగిలి కుట్లు పడ్డయ్..

- మనూషా, ఎక్లాస్​పూర్​మా పాణాలకువిలువే లేదా?

కంపెనీ వ్యర్థాలతో మూగ జీవాలు చస్తున్నయి. రేపు మా పరిస్థితి అంతే కదా? మా పాణాలంటే విలువ లేదా? శాంతియుతంగా నిరసన తెలుపు తుంటే మాపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన్రు. మేమేం తప్పు చేసినం. లాఠీతో కొడితే నా ముఖం వాచింది.
- హనుమమ్మ, ఎక్లాస్​పూర్​