
నాన్ టెక్ జాబ్‌లకు గిరాకీ
హెల్త్‌కేర్, కన్‌స్ట్రక్షన్, ఫుడ్ సర్వీస్‌లలో పెరిగిన జాబ్ పోస్టులు
ఎక్కువ జాబ్‌లు బెంగళూరు, ముంబై, పూణె, చెన్నై నుంచే..
వెల్లడించిన ఇండీడ్
న్యూఢిల్లీ : ఒకవైపు టెక్ కంపెనీలు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తీసేస్తుంటే నాన్ టెక్ కంపెనీలు ఈ ఏడాది నియామకాలు పెంచుతాయని రిపోర్ట్ ఒకటి వెల్లడించింది. దేశంలో హెల్త్‌కేర్, ఫుడ్ సర్వీసెస్, కన్‌స్ట్రక్షన్, ఎడ్యుకేషన్ వంటి సెక్టార్లలో డిమాండ్ పుంజుకుందని పేర్కొంది. గ్లోబల్ జాబ్ సైట్ ఇండీడ్ తన మంత్లీ రిపోర్ట్‌లో ఈ విషయాలు పేర్కొంది. ఈ రిపోర్ట్ ప్రకారం, కిందటేడాది డిసెంబర్‌లో హెల్త్‌కేర్, డెంటల్, నర్సింగ్ సెక్టార్లలో జాబ్స్‌కు డిమాండ్ పెరిగింది. డిసెంబర్‌లో తన ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ అయిన జాబ్‌లలో 30.8 శాతం వాటా ఈ సెక్టార్ల నుంచే ఉందని వెల్లడించింది. ఆ తర్వాత ఫుడ్ సర్వీసెస్ (8.8 శాతం), కన్‌స్ట్రక్షన్ (8.3 శాతం), ఆర్కిటెక్చర్ (7.2 శాతం), ఎడ్యుకేషన్ (7.1 శాతం), థెరపీ (6.3 శాతం), మార్కెటింగ్ (6.1 శాతం) సెక్టార్లలోని కంపెనీలు ఎక్కువ జాబ్స్ పోస్ట్ చేశాయని పేర్కొంది. కరోనా తర్వాత పరిస్థితులు తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయని ఇండీడ్ రిపోర్ట్ వెల్లడించింది. 2021 లోని డిసెంబర్‌లో పోస్ట్ అయిన జాబ్స్‌తో కిందటేడాది డిసెంబర్‌లోని జాబ్ పోస్టింగ్స్‌ను ఈ సంస్థ పోల్చి ఈ రిపోర్ట్ తయారు చేసింది. ఎక్కువ జాబ్ పోస్టింగ్‌లు బెంగళూరు నుంచే ఉన్నాయని, ఆ తర్వాత ముంబై, పూణె, చెన్నై సిటీల నుంచి ఉన్నాయని పేర్కొంది. టైర్ 2 సిటీలలో అహ్మదాబాద్, కొచ్చి, జైపూర్, మొహాలి నుంచి ఎక్కువ జాబ్స్ పోస్ట్ అయ్యాయి. ‘గ్లోబల్‌గా అనిశ్చితి నెలకొన్నా, వివిధ జాబ్ కేటగిరీలలో గ్రోత్ కనిపిస్తోంది. ఈ నెలలో వచ్చిన జాబ్ పోస్టింగ్‌లు కూడా 2020 లోని ఫిబ్రవరి నెలతో పోలిస్తే 203 శాతం ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ బడ్జెట్‌లో కొత్త ఉద్యోగాలను క్రియేట్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తే దేశ జాబ్ మార్కెట్ మరింత వృద్ధి చెందుతుంది. ఈ విషయంపై మొదటి రెండు క్వార్టర్లలో క్లారిటీ వస్తుంది’ అని ఇండీడ్ ఇండియా సేల్స్ హెడ్ శశి కుమార్ పేర్కొన్నారు. కరోనా రెస్ట్రిక్షన్లు తొలగిపోవడంతో విదేశాల్లో ఏయే జాబ్స్ ఉన్నాయో యూజర్లు వెతకడం పెరిగిందని అన్నారు.