అంబేద్కర్​ స్ఫూర్తితో దేశంలో గణతంత్ర రాజ్యం : డా. లక్ష్మణ్

అంబేద్కర్​ స్ఫూర్తితో దేశంలో గణతంత్ర రాజ్యం : డా. లక్ష్మణ్

గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత  రాజ్యాంగాన్ని తయారు చేయడం కోసం డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్ ను ఏర్పాటు చేశారు.1947 ఆగస్టు 29న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చైర్​పర్సన్​గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటైంది. అనేక సవరణల తర్వాత1949 నవంబర్ 26న భారత రాజ్యాంగంను రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో పూర్తి చేసిన రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందింది. రాజ్యాంగం1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఆనాటి నుంచి మన దేశం సర్వసత్తాక, స్వామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. రాజ్యాంగబద్ధత ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. ప్రస్తుతం దేశ పాలకులు రాజ్యాంగ మౌలిక సూత్రాలను అనుసరిస్తూ పాలిస్తున్నారు. 

రాజ్యాంగ పీఠిక 

భారత పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని సమకూర్చాలని మన రాజ్యాంగ పీఠిక నిర్దేశించింది. అదే స్ఫూర్తితో మోడీ ప్రభుత్వం దేశంలో పాలన సాగిస్తున్నది. భారతదేశ ప్రజలమైన మేము.. అనే వాక్యంతో మన రాజ్యాంగం ప్రారంభమవుతుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలను పాలనలో భాగస్వామ్యం చేయడం, ప్రజా ప్రతినిధులు, అధికారులు, న్యాయ వ్యవస్థ ప్రజానీకానికి జవాబుదారీ వహించడం కీలకం. వీటికి చట్టబద్ధత కల్పించిందే రాజ్యాంగం. రాజ్యాంగం సమాజంలో అన్ని వర్గాల హక్కులకు,స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు భరోసా ఇచ్చే ముఖ్యమైన సాధనం. కుల, మత, లింగ, ప్రాంతీయ, భాషా విచక్షణలకు ఆస్కారం ఇవ్వకుండా పౌరులందరికీ సమానత్వం ప్రసాదిస్తోంది. తద్వారా మన దేశం ప్రగతి పథంలో దూసుకెళ్లడానికి పునాది పడింది. దార్శనికులైన మన రాజ్యాంగ నిర్మాతలకు జాతీయవాదం పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంది. గడిచిన ఏడు దశాబ్దాల్లో మనం ఎన్నో మైలురాళ్లు దాటాం. రాజ్యాంగం ఆరు ప్రాథమిక హక్కులకు భరోసా ఇస్తోంది. ఈ హక్కుల రక్షణ మన ప్రభుత్వాల బాధ్యత.

అభివృద్ధి ఫలాలు అందరికీ..

డాక్టర్ బీఆర్​అంబేద్కర్ గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, స్వాతంత్య్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి. ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు తత్వాలు ఈరోజు మన జాతికి, దేశానికి బలమైన పునాది వేశాయి. సమానత్వం, మానవ హక్కులు, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ తన జీవితమంతా అంకితం చేశారు. తొలి న్యాయశాఖ మంత్రిగా అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందాలని, వివక్షకు తావులేని సమాజాన్ని నిర్మించాలని ఆయన ఆకాంక్షించారు. అయితే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాల ప్రయత్నాలు ఆయన ఆలోచనలను సాకారం చేయలేదు. కానీ 2014లో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం ఈ లక్ష్యాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నది. ప్రధాని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ.. తాను దళితులు, అట్టడుగు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంకితమవుతానని ప్రకటించారు. అప్పటి నుంచి ప్రభుత్వ చర్యలు, విధానాలు ‘అంత్యోదయ గళానికి’ అనుగుణంగా నడిచాయి. ప్రధాని మోడీ అభివృద్ధి నమూనాలో అంబేద్కర్ జీవిత మంత్రం ‘బహుజన హితాయ, బహుజన సుఖాయ’ ఎల్లప్పుడూ కీలకంగా ఉంది.

విద్య, వైద్యానికి పెద్దపీట

ప్రధాని మోడీ అధికారం చేపట్టిన తర్వాత విద్యారంగంలో దేశంలో ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఐటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల సంఖ్య పెరిగింది. అంబేద్కర్ దార్శనికత, తన సొంత నమ్మకాలతో ప్రేరణ పొందిన ప్రధాని మోడీ ప్రాథమిక, ఉన్నత విద్యపై దృష్టి సారించి విద్యా రంగం బలోపేతానికి కృషి చేస్తున్నారు. గత ఎనిమిదేండ్లలో 208 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. మెడికల్ సీట్ల సంఖ్య 78 వేల నుంచి లక్షకు పెరిగింది. దేశంలో డాక్టర్ల కొరత తీర్చడానికి, నిరుపేద ప్రజలకు మంచి వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలు అందిస్తున్నది. వీటిల్లో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఒకటి. ఈ పథకం కింద అర్హులైన వారికి ఉచితంగానే రూ.5 లక్షల వరకు మేలు జరుగుతున్నది. ఈ పథకం ద్వారా 10 కోట్ల కుటుంబాల వరకు లబ్ధిపొందే అవకాశం ఉంది. ప్రభుత్వం చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఇదే.

మౌలిక సదుపాయాలు
 

గత ఎనిమిదేళ్లలో దేశంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. మారుమూల ప్రాంతాలకూ విద్యుత్​వచ్చింది. 45 కోట్ల బ్యాంకు ఖాతాలు ద్వారా, సంక్షోభ సమయంలో మహిళలకు రూ.31 వేల కోట్లకు పైగా బదిలీ అయ్యాయి. భీమ్ యాప్ ఒక బలమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థకు ఉదాహరణగా నిలుస్తోంది. మహిళా కేంద్రిత, మహిళా నేతృత్వంలోని అభివృద్ధి ఈ ప్రభుత్వ మూల స్తంభం. -ఉజ్వల యోజన పథకం కింద12 కోట్ల మంది మహిళలకు గ్యాస్ సిలిండర్లు అందించింది. ప్రసూతీ సెలవును12 వారాల నుంచి 26 వారాలకు పెంచింది. 34 కోట్ల మంది ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాలకు పూచీకత్తు లేకుండా రూ.18 లక్షల కోట్ల రుణాలు అందించేందుకు ముద్రా యోజన దోహదపడుతున్నది. ఎస్సీ యువతను ఉద్ధరించాలన్న డాక్టర్ అంబేద్కర్ దార్శనికతకు అనుగుణంగా అంబేద్కర్ సోషల్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ మిషన్ ను మోడీ ప్రభుత్వం 2020లో ప్రారంభించింది. 2.27 లక్షల మంది యువతను నైపుణ్యం కలిగిన మానవ వనరుల్లో చేర్చడానికి శిక్షణ ఇచ్చింది. 2014కు ముందు కేవలం రూ.15 వేలు ఉన్న ఉద్యోగుల స్టేట్ ఇన్స్యూరెన్స్ వేతన పరిమితిని రూ.21 వేలకు పెంచింది. అంబేద్కర్ కు గౌరవ సూచకంగా మోడీ ప్రభుత్వం పంచ్ తీర్థ్ ను, పార్లమెంట్ లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాని మోడీ నూతన విద్యా విధానంతో, మాతృభాష లో విద్యను అందించాలన్న అంబేద్కర్ భావాలకు కృషి చేస్తున్నారు. అనేక సంక్లిష్ట చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లు, కార్మికులకు సార్వత్రిక ఖాతా సంఖ్య మోడీ దార్శనికత ఫలం. అంబేద్కర్ ఊహించిన భారతదేశం అనే భావన సారాన్ని ప్రస్తుత ప్రభుత్వ విధానాలు ప్రతిఫలిస్తున్నాయి.

-డా. లక్ష్మణ్, రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు