దర్జాగా గ్రామంలోకి రాయల్ బెంగాల్ టైగర్.. గోడపై నిద్రించిన పులి

దర్జాగా గ్రామంలోకి రాయల్ బెంగాల్ టైగర్.. గోడపై నిద్రించిన పులి

అడవుల్లో ఉండాల్సిన జంతువులు ఇండ్ల మధ్యకు వస్తే పరిస్థితి ఏంటి..? వేటాడి తిని కడుపు నింపుకొనే మాంసాహార జంతువులు.. మనుషులు స్వేచ్చగా తిరిగే ప్రాంతంలోకి వస్తే పరిస్థితి ఏంటి..? వింటేనే భయంగా ఉంది..కదా.. మరీ ఊహించుకుంటే ఇంకాస్త ఒల్లు జలదరిస్తుంది..! అవును మీరు విన్నది నిజమే.. నిత్యం అడవిలో వేటాడే పులి.. ఉన్నట్టుండి పల్లెబాట పట్టింది. అంతేకాదు.. సర్కస్ లో విన్యాసాలు చూస్తున్నట్లు జనం వీక్షిస్తున్నా.. ఆ పులి మాత్రం వారిని ఏమీ అనలేదు.. భయపెట్టడం కూడా చేయలేదు.. నిజంగా ఆశ్చర్యంగా, భయంగా అనిపించే ఈ ఘటన గురించి తెలుసుకోవాలంటే ఉత్తరప్రదేశ్ కు వెళ్లాల్సిందే.. !

పులులు అంటేనే చాలామంది భయం.. మరీ అలాంటి పులి జ‌న‌వాసాల్లోకి వ‌స్తే గుండెలు ఆగిపోవాల్సిందే. కానీ.. రాయల్ బెంగాల్ పులి మాత్రం ఏకంగా ఓ గ్రామంలోకి వచ్చింది. ఉత్తర‌ప్రదేశ్‌లోని ఫిలిబిత్ టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్టుకు స‌మీపంలో అత్‌కోనా అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలోకి సోమ‌వారం (డిసెంబర్ 25న) రాత్రి ఓ పులి వచ్చింది. అర్ధరాత్రి దాటాక గ్రామంలోకి ప్రవేశించిన పులి.. షిందు సింగ్ అనే రైతు ఇంటి గోడపై దాదాపు ఆరు గంట‌ల పాటు హాయిగా నిద్రించింది.

ఇది చూసిన కుక్కలు గట్టిగా అరవడం మొదలుపెట్టాయి. వెంటనే నిద్ర నుంచి లేచిన షిందు సింగ్.. గోడపై నిద్రిస్తున్న పులిని చూసి షాక్ అయ్యాడు. వెంటనే తన ఇంటి సమీపంలో ఉండే వారికి విషయం చెప్పాడు. ఇక ఈ విషయం ఊరంతా తెలిసింది. పులి నుంచి రక్షణ కోసం కొందరు తమ ఇంటి బయట మంటలు వెలిగించారు. మరికొందరు బిల్డింగ్ పైకి ఎక్కారు. మరికొందరు షిందు సింగ్ ఇంటి వద్దకు చేరుకున్నారు. నిద్రిస్తున్న పులిని చూశారు. కొందరు తమ సెల్ ఫోన్లలో ఆ దృశ్యాలను బంధించారు. మరికొందరు పులికి దూరంగా ఉండి సెల్పీలు తీసుకున్నారు. ఇంతలో జనం అలికిడి విని.. పులి నిద్ర లేచింది. అందరూ చూస్తున్నా ఆ పులి ఏ మాత్రం వారిని పట్టించుకోలేదు. వారిపై దాడి కూడా చేయలేదు. 

గ్రామస్తులే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు.. గోడ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అనంత‌రం ఆ పులికి మ‌త్తు మందు ఇచ్చి బంధించారు. ఆ త‌ర్వాత పులిని అక్కడి నుంచి త‌ర‌లించారు. ఈ పులికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.