ఖమ్మం జిల్లాలో కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్

ఖమ్మం జిల్లాలో  కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్
  • అశ్వాపురంలో కాలేజీ బస్సు బోల్తా 
  • వేర్వేరు ప్రమాదాల్లో 52 మంది విద్యార్థులకు గాయాలు

పెనుబల్లి/మణుగూరు, వెలుగు: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేశ్ పాడు గ్రామ శివారులోని సత్తెమ్మ గుడి సమీపంలోని ఎన్ఎస్పీ కెనాల్​లో స్కూల్​ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20  మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వేంసూరు మండలం మొద్దులగూడెం గ్రామంలోని వివేకానంద స్కూల్  నుంచి విద్యార్థులను పెనుబల్లి మండలంలోని వివిధ గ్రామాలకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

బస్సులో వంద మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లు పేరెంట్స్​ చెబుతున్నారు. డ్రైవర్  ఆళ్ల నవీన్  మద్యం మత్తులో బస్సు నడుపుతున్నాడని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్  పరారయ్యాడు. ఓవర్​ లోడ్​, డ్రైవర్ మద్యం మత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని పేరెంట్స్​ చెప్పారు. స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పేరెంట్స్​ ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన పిల్లలను సత్తుపల్లి, పెనుబల్లి, తిరువూరు ఆసుపత్రులకు తరలించారు. 

మణుగూరు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట అటవీ ప్రాంతంలో కాలేజీ బస్సు బోల్తా పడగా, ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. మరో 29 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మణుగూరు నుంచి 40 మంది విద్యార్థులతో పాల్వంచ వెళ్తున్న కేఎల్ఆర్  ఇంజనీరింగ్  కాలేజీ బస్సు మొండికుంట అటవీ ప్రాంతం పాలవాగు సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 32 మంది విద్యార్థులకు గాయాలు కాగా, వారిని భద్రాచలం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. 

ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలవగా, ప్రైవేట్  హాస్పిటల్​కు తీసుకెళ్లారు. అంబిక అనే విద్యార్థిని బస్సులో ఇరుక్కుపోవడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పొగ మంచు ఎక్కువగా ఉండగా, ఎదురుగా వచ్చిన వెహికల్ ను తప్పించే ప్రయత్నంలో బస్సు అదుపు తప్పి బ్రిడ్జిని ఢీకొట్టి బోల్తా పడింది. అటుగా వెళ్తున్న పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు బాధితులను హాస్పిటల్ కు తరలించేందుకు సహకరించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.