తన ఆపరేషన్‌కి తానే ఫండ్​ రైజ్ చేసుకున్న ఏడేళ్ల చిన్నారి

తన ఆపరేషన్‌కి తానే ఫండ్​ రైజ్ చేసుకున్న ఏడేళ్ల చిన్నారి

ఓ వందో, వెయ్యో  కావాల్సివస్తే ఫ్రెండ్స్​ని అప్పు అడుగుతాం. అమౌంట్​ పెద్దదయితే అయినోళ్ల దగ్గర చెయ్యి చాపుతాం.. మరీ పీకల్లోతు కష్టమొస్తే తెలిసినోళ్లందర్నీ వరసపెట్టి సాయం అడుగుతాం. కానీ, దారులన్నీ మూసుకుపోతే కుంగిపోతాం. ఏడేళ్ల లిజా మాత్రం ప్రాణం మీదకొచ్చినా ఏమాత్రం భయపడలేదు. పైగా తన సమస్యని తానే పరిష్కరించుకోవాలనుకుంది. కష్టకాలంలోనూ నవ్వుతూ  తన ఆపరేషన్​కి కావాల్సిన డబ్బుని తానే సమకూర్చుకుంది. ఏడేళ్ల వయసులో ఈ చిన్నారి ధైర్యాన్ని చూసి సోషల్​ మీడియా మురిసిపోయింది.

బర్మింగ్​హామ్​లో లిజా తల్లి బేకరీ నడుపుతుంది. పోయిన ఏడాది వేసవి సెలవుల్లో  తల్లి బేకరి ముందు నిమ్మరసం బండి పెట్టుకుంది లిజా. ఆ వచ్చే డబ్బుతో తనకిష్టమైన బొమ్మలు, హై హీల్ షూస్​ కొనుక్కోవాలనుకుంది. ఆ చిన్నారి బిజినెస్​ బాగానే సాగుతోంది. కానీ, ఆ డబ్బుతో తనకిష్టమైన బొమ్మల్ని కొనుక్కోలేకపోయింది. కారణం ఆమెకున్న  సెరిబ్రల్​  మాల్​ఫార్మేషన్స్​ వ్యాధి. తన సంపాదనంతా ఆమె ట్రీట్​మెంట్​కే సరిపోయింది. ఇంకా చేయాల్సిన బ్రెయిన్​  సర్జరీ మిగిలే ఉంది. కానీ, దానికి లిజా తల్లి చేతిలో డబ్బు లేదు. దాంతో లిటిల్​ లిజాకి ఒక ఐడియా వచ్చింది. తన నిమ్మరసం స్టాండ్​లో  ఆపరేషన్​ కోసం  ఓ బాక్స్ పెట్టి ఫండ్స్​ రైజ్​ చేసింది. రెగ్యులర్ కస్టమర్స్ అంతా  లిజా చేతి నిమ్మరసం తాగి తమకి చేతనైనంత సాయం చేశారు. ఆన్​లైన్​లోనూ ఫండ్స్​ రైజ్​ చేశారు. దాంతో ఈ చిన్నారి ఇప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడింది.