పులి పిల్ల మీదుగా వెళ్లిన కారు.. వైరల్ గా మారిన వీడియో

పులి పిల్ల మీదుగా వెళ్లిన కారు.. వైరల్ గా మారిన వీడియో

వేగంగా వెళ్తున్న ఓ కారు పులిని ఢీకొంది. ఈ ఘటనలో ఆ పులికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో గురువారం రాత్రి (ఆగస్టు 10వ తేదీన) జరిగింది.

గురువారం రాత్రి 10 గంటల30 నిమిషాల సమయంలో గోండియా జిల్లా నవేగావ్‌ -నాగ్జీరా కారిడార్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో హైవేను దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఆడ పులిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన పులి కాసేపు రోడ్డుపైనే కూర్చుండిపోయింది. అక్కడే ఉంటే మళ్లీ ప్రమాదం ముంచుకొస్తుందోనని... శరీరం సహకరించపోయినా కాళ్లను ఈడ్చుకుంటూ చెట్ల పొదల్లోకి వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ ను కొందరు వాహనదారులు తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఆ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. 

ప్రమాదం తరువాత.. శుక్రవారం (ఆగస్టు 11న) తెల్లవారుజామున గోండియా డివిజన్ అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటర్ ప్రమోద్ పంచ్ భాయ్ ఆధ్వర్యంలో అటవీ బృందం పులి కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఉదయం 7 గంటల 30 నిమిషాల సమయంలో పులిని గుర్తించారు. గాయపడిన ఆడపులిని చికిత్స కోసం నాగ్‌పూర్‌కు తీసుకెళుతుండగా అది మరణించింది. ఆ తర్వాత పోస్టుమార్టం కోసం.. నాగ్‌పూర్‌లోని వన్యప్రాణుల రెస్క్యూ సెంటర్‌కు తరలించారు. చనిపోయిన పులి మహారాష్ట్రలోని నాగ్జిరా నేషనల్ పార్క్‌కు చెందిన రెండేళ్ల ఆడపులి పిల్లగా గుర్తించారు. ఈ వీడియోను అటవీ అధికారి ప్రవీణ్‌ కశ్వాన్‌ తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్టు చేశారు. 

గోండియా నుండి కొహ్మారాకు కలిపే ప్రమాద స్థలం.. మహారాష్ట్రలోని నవేగావ్ -నాగ్జిరా కారిడార్ పరిధిలోకి వస్తుంది. పులి మృతిపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.