కిమ్ బిడ్డ పేరిట స్టాంప్

కిమ్ బిడ్డ పేరిట స్టాంప్

ప్యోంగ్యాంగ్: నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ ఉన్ కుతురు కిమ్ జు యే(10) పేరిట కొత్త తపాలా స్టాంప్ విడుదలైంది. నవంబర్ 18న జరిగిన క్షిపణి ప్రయోగానికి గుర్తుగా కొరియా స్టాంప్ కార్పొరేషన్ మంగళవారం కొత్త స్టాంపులను ఆవిష్కరించింది. వాటిలో కిమ్, అతని కుమార్తెకు సంబంధించిన స్టాంపులు ఉన్నాయి. అయితే, ఈ స్టాంపుల్లో ఓ బాలికను కిమ్ "ప్రియమైన కుమార్తె" అనే క్యాప్షన్‌‌‌‌తో  కొరియా స్టాంప్ కార్పొరేషన్ అభివర్ణించింది. ఆ బాలిక కిమ్ రెండవ కూతురు కిమ్ జు యే అని సౌత్ కొరియా స్పై ఏజెన్సీ వెల్లడించింది. కార్పొరేషన్ తన వెబ్‌‌సైట్‌‌లోనూ ఆ అమ్మాయిని కిమ్ కూతురిగానే పేర్కొంది. గత కొన్ని నెలలుగా కిమ్ తన కూతురు  కిమ్ జు యేను ప్రపంచానికి పరిచయం చేస్తున్న విధానం చూస్తుంటే ఆమెనే అతని తరువాత నార్త్ కొరియా నాయకురాలు కాబోతున్నట్లు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే దేశంలో కిమ్ జు యే పేరు గల వారందరూ వెంటనే తమ పేరును మార్చుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారని చెబుతున్నారు. కానీ, కిమ్ జు  యే వయసు దృష్ట్యా ఆమెకు వారసత్వంగా పగ్గాలు అప్పగించడానికి చాలా సమయం ఉందని నార్త్ కొరియా వ్యవహారాలను గమనించే వారు విశ్లేషిస్తున్నారు.