రంగు తాళ్లు (కథ)

రంగు తాళ్లు (కథ)

రామారావుకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు వినయ్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. చిన్నవాడు వివేక్ ఆరో తరగతి చదువుతున్నాడు. పిల్లలిద్దరూ బాగానే చదువుతారు. కానీ ఇంటికి దగ్గర్లో ఉన్న కిరాణా కొట్టు లేదా కూరల దుకాణానికి వెళ్లిం ఏవైనా కొనుక్కు రమ్మంటే మాత్రం - పెద్దవాడు వినయ్ అసలు కదలడు. చిన్నవాడు వెళ్తాడు. కానీ, ఒకదానికి బదులు మరొకటి తెస్తాడు. దాంతో ఏ చిన్న అవసరం వచ్చినా రామారావే బయటకు వెళ్లాల్సి వస్తోంది. చదువుతో పాటు పిల్లలకు చిన్న చిన్న ఇంటి పనులు చేయటం కూడా నేర్పాలనేది రామారావు అభిప్రాయం. 

ఒక రోజు ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి ‘‘వినయ్, కొట్టు దగ్గరికి వెళ్లి ఏదైనా తెమ్మంటే నువ్వు ఎందుకు కదలవు?’’ అని అడిగాడు రామారావు. 

‘‘కొట్టు దగ్గరికి వెళ్లాలంటే భయం నాన్నా’’ చెప్పాడు వినయ్. 

‘‘వివేక్, నువ్వు కొట్టు దగ్గరికి వెళ్తావు. కానీ, ఒకటి చెప్తే మరొకటి తెస్తావు ఎందుకని?’’ అడిగాడు రామారావు. 

‘‘కొట్టుకు వెళ్ళాలంటే కంగారు పుడుతుంది నాన్నా. అందుకే ఇంటి దగ్గర మీరు ఒకటి చెప్తే.. కొట్టు దగ్గరకు వెళ్లాక అది మర్చిపోయి. వేరేది కొనుక్కొస్తా’’ చెప్పాడు వివేక్.
ఒక రోజు సాయంత్రం రామారావు ఇంటికి వస్తూనే పిల్లలిద్దర్ని పిలిచాడు. ‘‘పిల్లలూ, ఇవి భయం, కంగారు పోగొట్టే తాయెత్తులు. గుళ్లో పూజారి వీటిని మంత్రించి ఇచ్చారు. వీటిని మీ చేతులకు కట్టుకుంటే భయం, కంగారు పోతాయి. ఏ పనైనా మీరు సరిగ్గా చేయగలుగుతారు’’ అని చెప్పి వాటిని పిల్లల చేతులకు కట్టాడు.

తరువాత రోజు నుండి కొట్టు నుండి ఏది తెమ్మంటే సరిగ్గా అదే తేసాగాడు వివేక్. అతనిలోని కంగారు పూర్తిగా పోయింది. అది గమనించిన వినయ్ తను కూడా కొట్టుకెళ్తానని, ఇంట్లో వాళ్ళు తెమ్మన్న సరుకులు సరిగ్గా తీసుకురాసాగాడు. అతనిలోని భయం పూర్తిగా పోయింది. వారం పది రోజులయ్యేసరికి పిల్లలిద్దరూ కిరాణా కొట్టు, కూరల దుకాణానికి వెళ్లాలంటే... నేనంటే నేనని పోటీపడసాగారు. 

నెల రోజులు గడిచాయి. ఒకరోజు పిల్లలిద్దరూ రామారావు దగ్గరికి వచ్చి ‘‘నాన్నా, స్నానం చేసేటప్పుడు నీళ్ళకు నాని తాయెత్తులు తెగిపోయాయి. మరో రెండు తీసుకురా ’’ అని చెప్పారు. ‘సరే’ అన్నాడు రామారావు. ఆ రోజు సాయంత్రం ఇంటికి రాగానే ‘‘పిల్లలూ, పూజారి ఊరెళ్ళారట. వారం రోజుల్లో వస్తారట. ఆయన వచ్చాక తాయెత్తులు తెస్తా’’ అన్నాడు రామారావు.

అంతలో రామారావు భార్య ‘‘ఇంట్లో ఎండు మిర్చి అయిపోయాయి. కొట్టుకు వెళ్ళి 50  గ్రాముల ఎండుమిర్చి తీసుకురండి పిల్లలు’’ అంది. 

వెంటనే రామారావు ‘‘ఇప్పుడు మీ చేతులకు ఆ తాయెత్తులు లేవు కదా. కొట్టు దగ్గరికి వెళ్లిరాగలరా?’’ అని అడిగాడు. 

‘‘ఇద్దరం కలిసి వెళ్తాం నాన్నా’’ అని, ఇద్దరూ వెళ్లి మిర్చి తెచ్చారు.

వారం రోజులు గడిచాయి. ఒక రోజు సాయంత్రం రామారావు బజారు నుండి ఇంటికి రాగానే ‘‘పిల్లలూ, భయం, కంగారు పోగొట్టే తాయెత్తులు...’’ అని ఏదో చెప్పబోయాడు. ‘‘నాన్నా... ఇప్పుడు మాకు ఆ తాయెత్తులతో పనిలేదు. వారం రోజులుగా అవి మా దగ్గర లేకపోయినా... మాకు కంగారు అనిపించలేదు. భయం వేయలేదు. ధైర్యంగా ఏ పనైనా చేయగలుగుతున్నాం’’ అని చెప్పారు ఇద్దరు పిల్లలు.

రామారావు రెండు తాయెత్తులు చేత్తో పట్టుకుని అటూ ఇటూ తిప్పుతుంటే... ‘‘నాన్నా, ఇక మాకు ఈ తాయెత్తుల అవసరంలేదు” అన్నారు పిల్లలు. 

‘‘ఇవి తాయెత్తులు కావు. బజార్లో దొరికే రంగు తాళ్ళు. నిజానికి మంత్రాలు, మంత్రించిన తాయెత్తులు అనేవి ఉండనే ఉండవు. ఏ పని చేయటంలోనైనా భయం, కంగారు పోవాలంటే ఆ పని మీద దృష్టి పెట్టాలి. ఆ పనిని పదేపదే చెయ్యాలి. ‘‘వినయ్, నువ్వు పని చేసేవాడివే కాదు. వివేక్, నువ్వేమో పని చేసేవాడివి. కానీ, దానిమీద దృష్టి పెట్టేవాడివి కాదు. మీ మీద మీకు నమ్మకం కలిగించడం కోసం ఈ రంగు తాళ్లను తాయెత్తులు అని చెప్పి, మీ చేతికి కట్టా. నా ప్రయత్నం ఫలించింది. మీ ఇద్దరిలో పనంటే భయం, కంగారు పోయాయి’’ అన్నాడు రామారావు. 

వినయ్, వివేక్​లు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వాళ్ల జీవితంలో ఎప్పుడూ ఏ పని చేయడానికీ కంగారుపడలేదు. భయపడలేదు.

- కళ్లేపల్లి తిరుమలరావు