ఒత్తిడి లేని పరీక్షా విధానం రావాలి.. సామాజిక వ్యక్తిత్వ వికాసం పెంచే విద్య కావాలి

ఒత్తిడి లేని పరీక్షా విధానం రావాలి.. సామాజిక వ్యక్తిత్వ వికాసం పెంచే విద్య కావాలి

పరీక్షా ఫలితాలంటే ర్యాంకులు, మార్కులే జీవితాలకు కీలకం అనే భావన అసలు ఎందుకు కలుగుతుంది? విద్య బోధనలో అంతర్భాగం కావలసిన ఈ పరీక్షలు ఒత్తిడిగా ఎందుకు మారుతున్నాయి?   ఒత్తిడి తట్టుకోలేక ప్రాణత్యాగాలు ఎందుకు జరుగుతున్నాయి?  ఇలాంటి ప్రశ్నలకు జవాబు కోసం మూడు రకాలైన ఒత్తిళ్లు గురించి తెలుసుకోవాలి.

సామాజిక సవాళ్ళను అధిగమించడంలో అయోమయం! సామాజిక మార్పులు అర్థంచేసుకొని సమాజంతో కలిసి జీవించే అనుభవం  నేర్చుకునే పరిస్థితి నేడు లేదు.  పిల్లలు పుట్టినప్పటి నుంచి నాలుగు గోడల మధ్యనే బాల్యం గడుస్తోంది. అటు తర్వాత తల్లిదండ్రుల బిజీ జీవితం వలన తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని హాస్టళ్ళలో వేసి చదివిస్తున్నారు. చదువు తప్ప మరో ప్రపంచం లేనే లేదు అనేవిధంగా తల్లిదండ్రులు ఉండడం వలన విద్యార్థులు ఇంట్లో ఉన్న, బడిలో ఉన్నా నాలుగు గోడలమధ్య బాల్యం బందీ అవుతుంది.  

సమాజంతో కానీ, సమవయసు బృందాలతో గాని గడిపే అవకాశాలు క్రమంగా మృగ్యం అవుతున్నాయి. పిల్లలు బడిలో కాకుండా బయట అనుకరణ, అనుభవాలు ద్వారా నేర్చుకోవలసిన సామాజిక జ్ఞానం, నడవడిక సరైన మోతాదులో అందడంలేదు.  బందీగా బాల్యం మారి ‘ఫారం కోడిపిల్లలు’ మాదిరిగా పెరుగుతున్నారే తప్ప సామాజిక వ్యక్తిత్వ వికాసం జరగడంలేదు!  ఫలితంగా సున్నిత మనస్తత్వంతోపాటు ఎదురైన సవాళ్ళు, దుఃఖాన్ని అధిగమించలేని అర్బక మనుష్యులుగా రూపొందడం సమస్యగా మారుతోంది.  జీవితంలో తీసుకునే నిర్ణయాలన్నింటా అపరిపక్వత కనిపిస్తోంది.ఈరోజు సామాజిక అశాంతికి కూడా ఎదగని వ్యక్తిత్వాలే ప్రధాన కారణం.                          
 పరీక్ష ఫోబియా

1971లో డిటెన్షన్ విధానం ఎత్తివేసుకున్న తర్వాతవిద్యా వ్యవస్థకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు, ఇంటర్ పరీక్షలే ప్రామాణికంగా మారాయి. తల్లిదండ్రులు, ముఖ్యంగా ప్రైవేటు విద్యాసంస్థలు ఈ పరీక్ష లో మార్కులు, ర్యాంకులే తమపిల్లల భవిష్యత్తుకు మూలమలుపు అని భావించడం వలన మానసిక వేధింపులు,  భౌతికపరమైన హింసలు వెరసి విద్యార్థి ఒకరకమైన పరీక్ష ఫోబియాకు గురౌతున్నాడు. 

తమ పిల్లలకున్న భౌతిక, మానసిక సంసిద్ధతను అంచనా వేసుకొనకుండా తోటి ర్యాంకర్లు,  బంధువుల పిల్లలతో పోల్చి వేధించడం వలన విద్యార్థులు మరింత ఆందోళనకు గురౌతున్నారు. సమయం సందర్భం లేకుండా అధికకాలం పుస్తకాల పురుగులుగా  విద్యార్థులను మార్చడం అనేది  పరోక్షంగా,  ప్రత్యక్షంగా పిల్లలపై మానసిక, భౌతిక హింసలకు కారణమౌతుంది.                

నిరంతర మూల్యాంకనం

విద్యాహక్కు చట్టం -2009 అమలులోకి వచ్చిన నాటినుంచి 1 నుంచి 9వ తరగతుల వరకు దేశవ్యాప్త ఏకరూప పరీక్షా విధానం.. చట్టబద్ధంగా సంక్రమించిన ఒత్తిడి లేని ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం’ విధానం. అయితే, మన సాంప్రదాయక పరీక్ష జాడ్యం ఉన్న విద్యాశాఖ అధికారులు 10వ తరగతికి గూడా పాఠశాలలోనే ఈ విధానం అనుసరించడానికి బదులు, సులభతరం చేయాల్సిన పరీక్షను పబ్లిక్ పరీక్షగా మార్చి  రెండు ‘సమ్మెటీవ్ అసెస్మెంట్లు’ కలిపి ఏడాది కాలానికి నిర్వహించి, సబ్జెక్టు అంతా ఒకే ఎస్ఏగా 80శాతం మార్కులకు జరిపి, తరగతి గదిలో ఎఫ్ఏ-4 సగటుకు 20శాతం మార్కులు కలిపి విద్యార్థులకు ర్యాంకులు ఇస్తున్నారు. 2014 మార్చి నుంచి  ఎస్ ఎస్ సికి  ఇదే అమలు జరుగుతోంది.‘నిరంతర సమగ్ర మూల్యాంకనం’ కాన్సెప్ట్ మార్చి ఏడాది కాలానికి మూడు గంటల కాలం పరీక్షకు నానా హంగామా చేయడం, పరీక్షలు, లీకులు, కేకలు, స్పాట్ వాల్యుయేషన్, పదవతరగతి బోర్డు ఇత్యాది క్లిష్టతరమైన ప్రక్రియకు బదులు ఇతర తరగతులు మాదిరే ఆయా పాఠశాలలే పరీక్షలు జరిపి పదవతరగతి బోర్డు సర్టిఫికెట్ ఇస్తే తప్పేమిటి? 

ఒత్తిడిలేని పరీక్షలు అవసరం

ఇప్పటికైనా, ఎప్పటికైనా ఒత్తిడి లేని ‘నిరంతర, సమగ్ర మూల్యాంకనం’నే మార్గదర్శిని.  అదే విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకురాగల ఆధునిక పారామీటర్! కనుక  ఒత్తిడి లేని, సులభతరం అయిన పరీక్షావిధానం వైపు ఆలోచన చేయాలి. ఈవిధానం ద్వారా విద్యార్థులను పరీక్ష ఫోబియా, ఆత్మహత్యలు నుంచి దూరం చేయవచ్చును. 

ఇక విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పదవతరగతి పరీక్షలు ఉన్నత విద్యనభ్యసించడానికి, లేదా ఉద్యోగం పొందడానికి ప్రామాణికం కాదు. మళ్ళీ వాటికోసం ప్రవేశపరీక్ష అనే మధ్యస్థ తంతు ఒకటి ఉంది. కనుక ఈ సర్టిఫికెట్ వయస్సు నిర్థారణకు తప్ప ప్రభుత్వం దేనికి ప్రాతిపదికగా తీసుకోవడం లేదు. కనుక తల్లిదండ్రులు పరీక్షలను పిల్లల ఎదుగుదలకు ప్రామాణికంగా  తీసుకోకండి. 

పిల్లలు స్వేచ్ఛగా, సామాజిక సవాళ్ళు ఎదుర్కొనే శక్తిగా మనం తీర్చిదిద్దగలిగితే అదే మన పిల్లలకు ధైర్యం! ఏదైనా ఒక పరిజ్ఞానం, తమకిష్టమైన లక్ష్యాలను వారే ఎంపిక చేసుకొని ఎదగడానికి సహాయకారులుగా, సలహాదారులుగా ఉంటే చాలు. కనుక మార్కుల కోసం, ర్యాంకులు కోసం ప్రాణాలు తీసుకొనే అల్ప ఆలోచనలు విద్యార్థులు మానుకోవాలి. మార్కుల కన్నా, ర్యాంకుల కన్నా మన జీవితం చాలా పెద్దది. విశాలమైనది.

విద్యాహక్కు చట్టం ఏం చెపుతోంది? 

 విద్యాహక్కు చట్టం- 2009లో సెక్షన్ 19(1) హెచ్ అనే నిబంధన విద్యార్థులు తాము నేర్చుకున్న జ్ఞానం, అభ్యసనానుభవాలు, సామర్థ్యాలు ఎప్పటికప్పుడు సమీక్షించుకునేందుకుగాను నూతనపరీక్షా విధానం ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం’ విధానం అమలులోనికి వచ్చింది. వాస్తవంగా మూల్యాంకనం అనేది ఓ మూడుగంటల పరీక్ష కానేకాదు. 

అది తాను పొందే అభ్యసనానుభవాలలో అంతర్లీనంగా ఒత్తిడి లేకుండా తమ పాఠశాలలో తమ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో జరగాల్సిన సులభ  ప్రక్రియ. ఈ మూల్యాంకనం ఎప్పటికప్పుడు విద్యార్థులలో అభ్యసనానుభవాలలో ఉండే లోపాల్ని సరిదిద్దేదిగా ఉండడంతోపాటు, ఉపాధ్యాయులు కూడా వివిధ మనస్తత్వాలు గల విద్యార్థుల అభ్యసన స్థాయిలు అంచనా వేసుకొని ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులే బాధ్యత వహించి నిర్వహించుకునే మూల్యాంకనం. ఇదివిద్యార్థుల నిరంతర నైపుణ్యాల అభివృద్ధితోపాటు, అటు ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యం పెంచుకుంటూ,  సమీక్షించుకుంటూ ముందుకుపోయే పరీక్షా విధానం. 

- ఎన్.తిర్మల్​,
విద్యా విశ్లేషకుడు