స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటుతో విద్యార్థుల ఇక్కట్లు

స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటుతో విద్యార్థుల ఇక్కట్లు
  • టాయిలెట్​ సౌకర్యం కల్పించాలని వేడుకోలు 

బెల్లంపల్లి, వెలుగు: స్కూల్​లో స్ట్రాంగ్​ రూం ఏర్పాటు చేసి అటువైపు ఎవరికీ వెళ్లనీయకపోవడంతో టాయిలెట్ ​వెళ్లేందుకు విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లాలోనే అతి పెద్ద పాఠశాలగా పేరుగాంచిన బజార్ ఏరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 527 మంది విద్యార్థులు చదువుతుండగా, 20 మంది టీచర్లు పనిచేస్తున్నారు.

ఈ నెల 21న జిల్లా అడిషనల్ కలెక్టర్(స్థానిక సంస్థలు) బి.రాహుల్ ఆధ్వర్యంలో  బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్లు భద్రపరిచేందుకు ఈ స్కూల్​లోని పలు గదుల్లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. దసరా సెలవులు ముగియడంలో గురువారం స్టూడెంట్లు, టీచర్లు స్కూల్​కు వచ్చారు.

అయితే బాలుర టాయిలెట్ల వైపు స్ట్రాంగ్​రూమ్ ఏర్పాటు చేసి, పరదాలు కట్టి అటువైపు ఎవరికీ అనుమతించకపోవడంతో బాలురు టాయిలెట్​వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది మధ్యలోనే ఇండ్లకు వెళ్లిపోయారు.  ఎన్నికలు జరిగే వరకు పరిస్థితి ఇలాగే ఉంటే చదువుపై దృష్టి పెట్టలేమని.. స్కూల్​లో టాయిలెట్ ​వెళ్లేందుకు అనుమతించాలని టీచర్లు, స్టూడెంట్లు కోరుతున్నారు.