స్నాతకోత్సవ స్టేజీపై స్టూడెంట్ డ్యాన్స్.. పట్టా ఇవ్వడానికి నిరాకరించిన అధ్యాపకులు

స్నాతకోత్సవ స్టేజీపై స్టూడెంట్ డ్యాన్స్.. పట్టా ఇవ్వడానికి నిరాకరించిన అధ్యాపకులు

వేలాది మంది ఎదుట గ్రాడుయేషన్‌ పట్టా తీసుకోబోతున్నాననే సంతోషంలో ఓ స్టూడెంట్ స్టేజిపైనే డ్యాన్స్ చేశాడు. దీంతో కళాశాల అధ్యాపకులు అతడికి పట్టా ఇవ్వడానికి నిరాకరించారు. ఆ తర్వాత ఏం జరిగింది..? 

ముంబయిలోని నార్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో ఆర్య కొఠారి అనే స్టూడెంట్ చదువు పూర్తి చేసుకున్నాడు. కొన్ని రోజుల క్రితం ఆ కాలేజీలో పట్టా ప్రదానోత్సవం కార్యక్రమం జరిగింది. దీనికి హాజరైన ఆర్య కొఠారి తన పేరు రాగానే వేదికపైకి వెళ్లాడు. డ్యాన్స్ చేస్తూనే పట్టా తీసుకోవడానికి ముందుకు వెళ్లాడు. దీంతో స్టేజీపైనే ఉన్న అధ్యాపకులు  వారించడంతో డ్యాన్స్ ను ఆపేశాడు. డ్యాన్స్ చేయడానికి ఇది సరైన స్టేజ్ కాదని, పట్టా ఇవ్వడం కుదరదని చెప్పారు. దాంతో ఆ విద్యార్థి క్షమాపణలు చెప్పడంతో చివరికి పట్టా ఇచ్చి పంపించారు. 

మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆర్య కొఠారి తన ఇన్‌స్టాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. దాదాపు కోటి మందికిపైగా ఈ వీడియోను చూసి, తమకు నచ్చిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

స్టేజీపై డ్యాన్స్ చేస్తే అధ్యాపకులను అగౌరవ పరిచినట్లు ఎలా అవుతుందని ఒక నెటిజన్ ప్రశ్నించగా.. హ్యాపీనెస్ సమయాల్లో ఎలా ముడుచుకుని కూర్చుంటారని మరో నెటిజన్ ప్రశ్నించాడు. ఇతరులతో సంతోషంగా ఉండటం ఎలాగో కొందరు నేర్చుకోవాలంటూ మరో నెటిజన్‌ చురకలంటించాడు. ఒక లెక్చరర్‌గా విద్యార్థులతో కలిసి డ్యాన్స్‌ చేయలేను గానీ.. విద్యార్థిని తప్పకుండా ప్రోత్సహిస్తానని మరో నెటిజన్‌ అభినందించాడు. చిన్న స్టెప్పు వేసినందుకు పట్టా ఇవ్వమంటున్నారు.. అయితే అతడు నాకు సర్టిఫికెట్‌ అవసరం లేదు. కట్టిన ఫీజు వెనక్కు ఇవ్వండి అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అని మరో నెటిజన్‌ కామెంట్ చేశాడు.