ఇంజనీరింగ్ సీటు మిస్ అవుతుందన్న ఆవేదనతో

ఇంజనీరింగ్ సీటు మిస్ అవుతుందన్న ఆవేదనతో
  • సర్టిఫికెట్లు ఇయ్యలేదని స్టూడెంట్ సూసైడ్
  • రూ.40 వేలు చెల్లిస్తేనే ఇస్తామన్న కాలేజీ ప్రిన్సిపల్  
  • ఇంజనీరింగ్ సీటు మిస్ అవుతుందన్న ఆవేదనతో గడ్డి మందు తాగిన ఇంటర్ విద్యార్థి 

జన్నారం, వెలుగు: ఫీజులు పెండింగ్​లో ఉన్నాయని జూనియర్ కాలేజీ వాళ్లు సర్టిఫికెట్లు ఇయ్యకపోవడంతో ఓ స్టూడెంట్ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగుకు చెందిన జక్కుల శ్రీనివాస్ కొడుకు అంజిత్(20) హైదరాబాద్ ఆదిభట్లలోని ఎస్ఆర్ గాయత్రి కాలేజీలో ఇంటర్ చదివాడు. 

స్టూడెంట్ సూసైడ్

అదే కాలేజీ తరఫున శ్రీ చైతన్యలో ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాడు. ఇంజనీరింగ్ లో సీటు రావడంతో జాయినింగ్ కు ఇంటర్ సర్టిఫికెట్లు అవసరమయ్యాయి. ఈ నెల 24న అంజిత్ తన తండ్రి శ్రీనివాస్​ను తీసుకుని వెళ్లి కాలేజీ ప్రిన్సిపాల్ ప్రసాద్​ను, వేణు అనే వ్యక్తిని కలిశారు. పెండింగ్​లో ఉన్న రూ.40 వేలిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని వారు చెప్పారు. ఈ నెల 27న ఫస్ట్ ఫేజ్​ కౌన్సెలింగ్ ఉందని, కొడుకు భవిష్యత్ పాడవుతుందని శ్రీనివాస్ వేడుకున్నా కనికరించలేదు. డబ్బులు చెల్లించినా సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వడం కుదరదన్నారు.

దీంతో తండ్రీ కొడుకులు నిరాశతో ఇంటికి వచ్చారు. మనస్తాపం చెందిన అంజిత్ శనివారం ఇంట్లోనే గడ్డి మందు తాగాడు. అతడిని గమనించిన అన్న మంచిర్యాల హాస్పిటల్​కు తీసుకెళ్లాడు. కండిషన్ సీరియస్​గా ఉండటంతో కరీంనగర్​లోని ప్రైవేట్ హాస్పిటల్​కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అంజిత్ సోమవారం మధ్యాహ్నం చనిపోయాడు. తన కొడుకు చావుకు కారణమైన ప్రిన్సిపాల్ ప్రసాద్, వేణుపై చర్యలు తీసుకోవాలని జక్కుల శ్రీనివాస్ జన్నారం పోలీసులకు కంప్లైంట్ చేశాడు.