నదీ లోయలో పడ్డ బస్సు

నదీ లోయలో పడ్డ బస్సు
  • ఏడుగురు జవాన్లు మృతి
  • మరో 32 మందికి గాయాలు, 9 మంది పరిస్థితి విషమం
  • అమర్‌‌‌‌‌‌‌‌నాథ్ యాత్ర డ్యూటీ ముగించుకుని వస్తుండగా ఘటన
  • మృతుల్లో ఏపీ వాసి రాజశేఖర్

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లోని పహల్గామ్‌‌‌‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఐటీబీపీ (ఇంటో టిబెటన్ బోర్డర్ పోలీస్) జవాన్లతో వస్తున్న బస్సు నదీ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు చనిపోగా, 32 మంది గాయపడ్డారు. ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఐదుగురు తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతూ మరణించారు. 9 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆఫీసర్లు చెప్పారు. వారిని మెరుగైన చికిత్స కోసం శ్రీనగర్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. మిగతా వారికి అనంత్‌‌‌‌నాగ్ జిల్లా ఆస్పత్రిలో ట్రీట్‌‌‌‌మెంట్ అందిస్తున్నారు. మృతుల్లో ఏపీలోని కడప జిల్లాకు చెందిన జవాన్ ఒకరు ఉన్నారు.

బ్రేకులు ఫెయిల్ కావడం వల్లేనా?
అమర్‌‌‌‌‌‌‌‌నాథ్ యాత్ర డ్యూటీ ముగించుకుని చందన్‌‌‌‌వారీ నుంచి 37 మంది ఐటీబీపీ సిబ్బంది, ఇద్దరు పోలీసులు, ఇద్దరు బస్ స్టాఫ్ శ్రీనగర్‌‌‌‌‌‌‌‌కు బయల్దేరారని ఆఫీసర్లు చెప్పారు. జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌ పోలీస్ శాఖకు చెందిన ఈ బస్సు మంగళవారం ఉదయం 9.40 సమయంలో పహల్గామ్‌‌‌‌కు 6 కిలోమీటర్ల దూరంలోని జిగ్ మోరా ఫ్రిస్లాన్ వద్ద అదుపు తప్పి నదీ లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో బస్సు టాప్ మొత్తం నామరూపాల్లేకుండా పోయింది. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న ఐటీబీపీ సిబ్బంది, స్థానిక అధికారులు, పోలీసులు, ఎస్‌‌‌‌డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గాయపడ్డ వారిని అంబులెన్సుల్లో తరలించారు. బ్రేకులు ఫెయిల్ కావడంతో బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు భావిస్తున్నారు. మృతుల్లో ఆరుగురు ఐటీబీపీ సిబ్బంది, ఒక పోలీస్ ఉన్నట్లు ఆఫీసర్లు తొలుత తెలిపారు. కానీ చనిపోయిన వారంతా ఐటీబీపీ జవాన్లేనని, ఇద్దరు పోలీసులు చికిత్స పొందుతున్నారని తర్వాత ప్రకటించారు. ప్రమాదంలో జవాన్లు చనిపోవడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్‌‌‌‌దీప్ ధన్‌‌‌‌కర్ సంతాపం ప్రకటించారు. గాయపడ్డ సెక్యూరిటీ సిబ్బందికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చెప్పారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తదితరులు ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో సంతాపం తెలిపారు. 

మృతులు వీరే
ప్రమాదంలో చనిపోయిన జవాన్ల వివరాలను ఐటీబీపీ రిలీజ్ చేసింది. హెడ్ కానిస్టేబుల్ దులా సింగ్ (పంజాబ్‌‌‌‌లోని తర్న్ తరన్ సాహిబ్), కానిస్టేబుల్ అభిరాజ్ (బీహార్‌‌‌‌‌‌‌‌లోని లఖిసరయ్), కానిస్టేబుల్ అమిత్ కే (యూపీలోని ఎటా), కానిస్టేబుల్ డి. రాజశేఖర్ (ఏపీలోని కడప), కానిస్టేబుల్ సుభాష్ సి.బైర్వాల్ (రాజస్థాన్‌‌‌‌లోని సిఖర్), కానిస్టేబుల్ దినేశ్ బోహ్రా (ఉత్తరాఖండ్‌‌‌‌లోని పిత్తోర్‌‌‌‌‌‌‌‌గఢ్), కానిస్టేబుల్ సందీప్ కుమార్ (జమ్మూ) చనిపోయినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.