
మార్కెట్ లో టమాటా ధరలు భారీగా ఉండటంతో దొంగల చూపు వాటిపైన పడింది. టమాటాలు ఎక్కడ కనబడినా ఎత్తుకెళ్లి పోతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో టమాటా ట్రేలను దొంగ ఎత్తుకెళ్లాడు. తన ముఖం కనిపించకుండా ఉండెందుకు హెల్మెట్,జాకెట్ ధరించి దొంగతనం చేశాడు. సుమారుగా రూ. 8 వేల 500 విలువైన మూడు టమాటా ట్రైలను ఎత్తుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డు అయింది.
మిషన్ ఏజెంట్ దుకాణం నుంచి రైతు తీసుకొచ్చి నిల్వ ఉంచిన మూడు టమాటా ట్రేలను ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనపై ఏజెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టమాటా ధరలు పెరగడం, దొంగతనాలు వరుసగా జరుగుతుండటంతో వ్యాపారులు కూడా అలర్ట్ గా ఉంటున్నారు. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ కూరగాయలు అమ్మే వ్యాపారి తన వద్ద ఉన్న టమాటాలకు ఇద్దరు బౌన్సర్లను నియమించుకున్నాడు.
కర్ణాటకకు చెందిన ఓ రైతు దాదాపు రూ.3 లక్షల విలువైన టమాటాలను ఓ ట్రక్కులో నింపుకుని స్థానికంగా ఉన్న ఆర్‌ఎంసీ యార్డుకు చేరుకున్నాడు. అయితే ట్రక్కును ఆపి.. అక్కడ డ్రైవర్‌తోపాటు ఆ రైతు ఛాయ్ తాగడానికి వెళ్లాడు. అది గమనించిన దుండగులు టమాటాలతో సహా ట్రక్కును దొంగలించారు. దీంతో ఖంగుతున్న రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.