బైక్ పై వెళ్తుంటే పులి దాడి

బైక్ పై వెళ్తుంటే పులి  దాడి

కాగజ్ నగర్, వెలుగు : కుమ్రం భీం ఆసిఫాబాద్​జిల్లా కాగ జ్ నగర్ నుంచి వాంఖిడి వెళ్లే మార్గంలోని అంకుసాపుర్ సమీపంలో ఆదివారం మోటార్ సైకిల్ మీద వెళ్తున్న ఓ యువకుడిపై పులి దాడి చేసింది. శరీరానికి పంజా కొస తాకడంతో బండి స్కిడ్ అయి రోడ్డు మీద జారుకుంటూ వెళ్లి గాయపడ్డాడు. అతడి అరుపులతో పులి అడవిలోకి పారిపోయింది. బాధితుడి కథనం ప్రకారం...


కాగజ్ నగర్ లోని ఇర్ఫాన్ కాలనీకి చెందిన మహ్మద్​తాహెర్ ఎలక్ట్రీషియన్. పనికోసం వాంకిడి మండలానికి వెళ్లి అక్కడి నుంచి కాగ జ్ నగర్ కు అంకుశాపూర్ రూట్ లో వస్తున్నాడు. మధ్యాహ్నం ఒకటిన్నరకు అంకుశాపూర్ దాటి వచ్చిన తర్వాత రోడ్డు మీద మూల మలుపు దగ్గరకు చేరుకున్న టైంలో ఒక్కసారిగా పెద్దపులి బైక్ కు అడ్డు వచ్చి దాడి చేసింది.  పంజాతో కొట్టగా అది తాహెర్​కాలికి తాకింది. దీంతో టూవీలర్​స్కిడ్​అయి పెద్దపులిని ఈడ్చుకుంటూ కొద్దిదూరం వరకు వెళ్లింది. ఈ క్రమంలో పెద్దపెట్టున అరవగా వేరే వైపుకు దూకి వెళ్లిపోయింది.

పులి దాడిలో కాలికి గాయం కాగా, బైక్ మీద నుంచి కింద పడడంతో  భుజానికి, వీపుపై, కాలికి, చేతులకు గాయాలయ్యాయని తాహెర్​చెప్పాడు. వెనుక వచ్చిన బైక్ మీద లిఫ్ట్ అడిగి కాగ జ్ నగర్ కు వచ్చి హాస్పిటల్ లో చేరినట్టు చెప్పాడు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా సిబ్బంది స్పాట్ కు వెళ్లి పరిశీలించారు. కాగ జ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శివ కుమార్ మాట్లాడుతూ పులి అడ్డువచ్చింది నిజమేనని, అది పులి తిరిగే ప్రాంతమేనని అటువైపు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.