గచ్చిబౌలి విప్రో సిగ్నల్ వద్ద..టిప్పర్ బీభత్సం

గచ్చిబౌలి విప్రో సిగ్నల్ వద్ద..టిప్పర్ బీభత్సం

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్ గచ్చిబౌలిలో ఆదివారం అర్ధరాత్రి ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. రాళ్ల లోడ్​తో వెళ్తున్న టిప్పర్.. విప్రో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న మూడు కార్లు, రెండు బైకులను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా వేరే రూట్​లో వెళ్తున్న మరో టిప్పర్​ను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో స్విగ్గీ డెలివరీ బాయ్ స్పాట్​లో నే చనిపోయాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 

ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగింది. షేక్ నజీర్​ హుస్సేన్ (30) భా ర్య, ఇద్దరు పిల్లలతో కలిసి నాంపల్లిలో ఉంటున్నా డు. 8నెలలుగా స్విగ్గీ, జొమాటోలో డెలివరీ బాయ్​గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి 11.50 గంటలకు పిజ్జా డెలివరీ చేసేందుకు హుస్సేన్, గచ్చిబౌలి ఐఐఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్ వైపు వచ్చాడు. విప్రో జంక్షన్ వద్ద రెడ్ సిగ్నల్ పడ డంతో ఆగాడు. 

మరికొన్ని బైకులు, మూడు కార్లు ఆగి ఉన్నాయి. అదే టైంలో ఖానామేట్ నుంచి వట్టినాగులపల్లి క్రషర్ పాయింట్​కు రాళ్ల లోడ్​ తీసుకువెళ్లే టిప్పర్.. ఐఐఐటీ నుండి విప్రో జంక్షన్ వైపు వేగంగా దూసుకొచ్చింది. రెడ్​ సిగ్నల్​ ఉన్నా.. మూడు కార్లు, బైక్​లను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా.. క్యూసిటీ నుంచి నానక్​రాంగూడ వైపు వెళ్తున్న మరో టిప్పిర్​ను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ యాక్సిడెంట్​లో తీవ్రంగా గాయపడ్డ హుస్సేన్ స్పాట్​లోనే చనిపోయాడు. 

పలువురికి గాయాలు

గచ్చిబౌలిలో సినిమా చూసి హాస్టల్​కు వెళ్తు న్న ఎంజీఐటీ కాలేజీలో బీటెక్ మూడో సంవత్స రం​ చదువుతున్న రజాక్ కుడి కాలు విరిగింది. నానాక్​రాంగూడలో ఫ్రెండ్​ను బైక్​పై డ్రాప్ చేసేందుకు వెళ్తున్న యూసఫ్​గూడకు చెందిన స్విగ్గీ ఎంప్లాయ్ సురేంద్ర దాస్​కు తీవ్ర గాయాలయ్యాయి.  ప్రమాదానికి కారణమైన టిప్పర్ సూపర్​వైజర్ కలీం కాలు విరిగింది. కార్లలో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. 

టిప్పర్ డ్రైవర్ షేక్ ఖాసీం (38) బీహార్​ నుంచి మూడు రోజుల కిందే హైదరాబాద్​ వచ్చాడు. రూట్ తెలియకపోవడంతో సూపర్​వైజర్ కలీంతో కలిసి ఖానామేట్ నుంచి వట్టినాగులపల్లికి ఓవర్​ స్పీడ్​తో వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. ఖాసీంను అరెస్ట్​ చేసినట్లు ఇన్​స్పెక్టర్ సురేశ్​ తెలిపారు. ఈ ప్రమాదంలో మూడు కార్లు, మూడు బైకులు ధ్వంసమయ్యాయి.