తల్లికి భారం కావొద్దని యువతి ఆత్మహత్య

తల్లికి భారం కావొద్దని యువతి ఆత్మహత్య

కూతురు మృతి తట్టుకోలేక కొద్దిసేపటికే తల్లి సూసైడ్

అల్వాల్, వెలుగు : తల్లికి భారం కావొద్దని ఓ యువతి సూసైడ్ చేసుకోగా.. కూతురు మృతిని తట్టుకోలేక కొద్దిసేపటికే తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లా అల్వాల్ పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన ఎం.శారద (51) భర్త సంజయ్ నాలుగేండ్ల కింద చనిపోయాడు. కూతురు మౌనిక(26)తో కలిసి శారద సిటీకి వచ్చి బొల్లారంలోని రాగి కన్వెన్షన్ సెంటర్ లో సూపర్ వైజర్ గా పని చేస్తున్నది. ఎంబీఏ చదివిన మౌనిక, కొన్ని రోజులు ఓ కంపెనీలో జాబ్ చేసింది.

పని ఎక్కువగా ఉండటంతో మానేసింది. తండ్రి చనిపోవడం, కుటుంబ భారం అంతా తల్లిపైనే పడటంతో మౌనిక మనస్తాపానికి గురైంది. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు డ్యూటీ నుంచి శారద ఇంటికొచ్చి చూసేసరికి మౌనిక ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించింది. కూతురు మృతిని తట్టుకోలేని శారద కూడా ఆత్మహత్య చేసుకుంది. శారద బంధువు సబిత ఆమెకు ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ తీయకపోవడంతో అనుమానంతో ఇంటికి వచ్చి చూసింది. అప్పటికే శారద, మౌనిక చనిపోయి ఉన్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీలను నిజామాబాద్ లోని సొంతూరికి తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పరుశురాం తెలిపారు.