కామారెడ్డి మున్సిపల్​ పాలిటిక్స్​లో ట్విస్ట్

కామారెడ్డి మున్సిపల్​ పాలిటిక్స్​లో ట్విస్ట్
  • క్యాంప్​కు తరలిన 8 మంది బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు
  • అవిశ్వాసానికి పరోక్షంగా మద్దతిచ్చేందుకేనంటూ చర్చ
  • ఇప్పటికే సపరేట్ ​క్యాంప్​లో ఉన్న 27 మంది కాంగ్రెస్​ కౌన్సిలర్లు

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి మున్సిపల్​ పాలిటిక్స్​ రోజుకో మలుపు తిరుగుతోంది. చైర్​పర్సన్​ నిట్టు జాహ్నవిపై అవిశ్వాస నోటీసు ఇచ్చిన కాంగ్రెస్​ కౌన్సిలర్లు క్యాంప్​కు వెళ్లగా, తాజాగా బీఆర్​ఎస్​కు చెందిన ఎనిమిది మంది కౌన్సిలర్లు సపరేట్​గా క్యాంప్​కు తరలివెళ్లారు. 27 మంది కాంగ్రెస్​ కౌన్సిలర్లు ఈ నెల 11న అవిశ్వాసం కోరుతూ కలెక్టర్​కు నోటీసు ఇచ్చారు. అదే రోజు క్యాంప్​కు వెళ్లారు.

అవిశ్వాస మీటింగ్​ జరగాలంటే 35 మంది కౌన్సిలర్లు సమావేశానికి అటెండ్​ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్​ఎస్​కు చెందిన ఎనిమిది మంది కౌన్సిలర్లు సపరేట్​గా క్యాంప్ కు వెళ్లడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్​ పార్టీలో చేరకుండానే అవిశ్వాస మీటింగ్​కు హాజరయ్యేందుకు వీరు క్యాంప్​కు వెళ్లారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. 

పరోక్షంగా మద్దతిచ్చేందుకు!

27 మంది కౌన్సిలర్ల మద్దతు ఉన్న కాంగ్రెస్​ పార్టీ నేతలు కోరం కోసం ప్రయత్నిస్తున్నారు. బీఆర్​ఎస్​కు చెందిన కొందరు కౌన్సిలర్లు పార్టీ మారకుండానే పరోక్షంగా అవిశ్వాసానికి మద్దతు తెలిపేందుకే క్యాంప్​కు వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

మంగళవారం స్థానికంగా సమావేశమైన 8 మంది కౌన్సిలర్లు అవిశ్వాసంపై చర్చించారు. ఆ తర్వాత హైదరాబాద్​కు వెళ్లి అక్కడి నుంచి గోవాకు తరలారు. చైర్​పర్సన్​తో పాటు 8 మంది బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు స్థానికంగానే ఉన్నారు. అవిశ్వాసం వీగిపోయేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.