ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

మూడేండ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న బాధితుడు

ఆత్మకూరు, వెలుగు : ప్రమాదంలో కాలు విరిగిన ఓ బాధితుడు... పింఛన్ కోసం మూడేళ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలకేంద్రానికి చెందిన కోల ప్రదీప్.. గతంలో జరిగిన ఓ యాక్సిడెంట్​లో కాలు కోల్పోయాడు. మూడేండ్ల కింద సదరం సర్టిఫికేట్ రాగా వికలాంగుల పింఛన్ ​కోసం అప్లై చేసుకున్నాడు. నాటి నుంచి నేటి వరకు ఆయనకు పింఛన్ రాలేదు. ఆఫీసర్లను అడిగితే.. కొత్తగా మళ్లీ సదరం సర్టిఫికేట్ తీసుకురావాలని చెబుతున్నారు. ఒంటి కాలుతో తిరగలేక అవస్థలు పడుతున్నానని ప్రదీప్ వాపోతున్నాడు.

పింఛన్ కార్డులపై సర్పంచ్ పేరు!
నల్లబెల్లి, వెలుగు: ఆసరా పింఛన్ కార్డులపై తన పేరు ముద్రించుకోవడమే కాక.. దానికి అయ్యే ఖర్చును లబ్ధిదారుల నుంచే వసూలు చేశాడు ఓ సర్పంచ్. స్థానికుల వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామానికి చెందిన సర్పంచ్​ వక్కల మల్లక్క తన పేరుతో  సపరేట్​గా ఆసరా ఫించన్ కార్డు ముద్రించారు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ.100 వసూలు చేశారు. సర్పంచ్ తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.

టీఆర్ఎస్ ​లీడర్లు చెప్పిలోళ్లకే పింఛన్లా?
నర్సింహులపేట, వెలుగు: టీఆర్ఎస్ లీడర్లు సిఫారసు చేసినవారికే పింఛన్లు వచ్చాయని, అసలైన లబ్ధిదారులను తొలగించారని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలకాంగ్రెస్ లీడర్లు ఆరోపించారు. మంగళవారం మండలకేంద్రంలో వారు ధర్నా చేశారు. అధికార పార్టీ లీడర్లు, అనుచరులకే పింఛన్లు వస్తున్నారని మండిపడ్డారు. ఈ తతంగంపై ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డిని నిలదీశారు. ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం, ఎకరాల కొద్దీ భూములు ఉన్నవారికి కూడా పింఛన్లు మంజూరు చేశారన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

ప్రయాణికుడిని కాపాడిన 108 సిబ్బంది

కమలాపూర్, వెలుగు : రైలు నుంచి జారిపడ్డ వ్యక్తికి.. ప్రథమ చికిత్స అందించడమే కాకుండా స్ట్రెచర్ పైనే కిలోమీటర్ మేర మోసుకెళ్లి వైద్యం అందించారు 108 సిబ్బంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ కు చెందిన బబ్లూ(37) మంగళవారం ఉదయం యశ్వంత్ పూర్ టు గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్నాడు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం భీంపల్లి సమీపంలో ట్రైన్ నుంచి జారి కిందపడ్డాడు. కాలుకు తీవ్ర గాయాలు కావడంతో 108కి సమాచారం ఇచ్చారు. వెంటనే సిబ్బంది వచ్చి ప్రథమ చికిత్స అందించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో స్ట్రెక్చర్ పైనే కిలోమీటర్ మేర మోసుకెళ్లి 108 వాహనంలో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సిబ్బంది వక్కల సంజీవ్, బుర్ర సందీప్, సతీశ్ ​కృషిని అభినందించారు.

108లో మహిళ ప్రసవం..
ములుగు, వెలుగు: పురటి నొప్పులు ఎక్కువకావడంతో 108 వెహికల్​లోనే మహిళకు ప్రసవం చేసి శభాష్ అనిపించుకున్నారు సిబ్బంది.ములుగు మండలం పెగడపల్లికి చెందిన గంగారపు నిహారికకు మంగళవారం పురటినొప్పులు రాగా 108కి ఫోన్ చేశారు. వెంకటాపూర్ అంబులెన్స్ సిబ్బంది గ్రామానికి చేరుకుని, ఆసుపత్రికి తరలిస్తుండగా.. నొప్పులు ఎక్కువ కావడంతో వాహనంలోనే ప్రసవం చేశారు. ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. సిబ్బంది అనిల్, రణధీర్ ను ఆఫీసర్లు అభినందించారు.

‘1500 లోన్ ఇచ్చి 1.70లక్షలు గుంజిన్రు’

కాజీపేట, వెలుగు : ఆన్ లైన్ లోన్ యాప్ వేధింపులకు హద్దు లేకుండా పోయింది. ఓ యువకుడికి రూ.1500లోన్ ఇచ్చి రూ.1.70లక్షలు గుంజడమే కాకుండా ఇంకా లోన్ పూర్తి కాలేదని వేధింపులకు గురి చేశారు. విసిగివేసారిన ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాజీపేట సీఐ మహేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. కాజీపేటలోని విష్ణుపురికి చెందిన బోడ రాకేశ్.. ఆగస్టు 25న ‘ఎస్ క్యాష్’ అనే ఆన్​లైన్​ లోన్ యాప్ నుంచి రూ.1500 లోన్ తీసుకున్నాడు. కొద్దిరోజులకు తీసుకున్న రుణం కట్టేశాడు. వెంటనే వేరే యాప్ లు డౌన్ లోడ్ అయ్యాయి. మరికొన్ని రోజులకు యాప్​నిర్వాహకులు రాకేశ్​కు ఫోన్ చేసి, లోన్ పెండింగ్ లో ఉందని వేధింపులకు గురి చేశారు. కట్టకుంటే ఫొటోలు మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించారు. ఇలా రూ.1.70లక్షల వరకు గుంజారు. మళ్లీ ఫోన్లు చేసి వేధిస్తుండడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా.. సోమిడికి చెందిన సాలిబిండ్ల శ్రీకాంత్ రెడ్డికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి ఎస్బీఐ ఈకేవైసీ చేసుకోవాలని చెప్పారు. ఇది నమ్మిన శ్రీకాంత్ రెడ్డి వారు చెప్పినట్టుగా చేశాడు. దీంతో రూ.25వేలు అకౌంట్ నుంచి కట్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆటోనగర్ లో గుర్తు తెలియని డెడ్ బాడీ..
వరంగల్​సిటీ, వెలుగు:
వరంగల్ ఆటోనగర్ వద్ద కెనాల్ లో ఓ గుర్తు తెలియని మృతదేహం మంగళవారం బయటపడింది. స్థానికులు చూసి మట్టేవాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. మర్డర్ చేసి కెనాల్ లో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

అర్హులందరికీ పట్టాలు
భూపాలపల్లి అర్బన్, వెలుగు :
అర్హులైన పోడు రైతులందరికీ తప్పనిసరిగా పట్టాలు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ భవేశ్​మిశ్రా సూచించారు. మంగళవారం మల్హర్ రావు మండలం రుద్రారం గ్రామ రైతులు జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్​లో కలెక్టర్ ను కలిశారు. గ్రామంలో సాగు చేసుకుంటున్న  రైతుల పేర్లు కాకుండా ఇతర పేర్లతో ఆన్ లైన్ లో దరఖాస్తు చేశారని, దీనివల్ల తమకు అన్యాయం జరుగుతోందని కలెక్టర్ కు వివరించారు. స్పందించిన కలెక్టర్.. విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.

వీఆర్ఏల ముందస్తు అరెస్ట్
వీఆర్ఏల నిరసనల్లో భాగంగా హైదరాబాద్ లో బతుకమ్మ ఆడి నిరసన తెలపడానికి వెళ్తున్న వీఆర్ఏలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. రాజధానికి వెళ్లకుండా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని వీఆర్ఏలు అన్నారు. సమస్యలు పరిష్కారించేంత వరకు పోరాడుతామని హెచ్చరించారు.
- మహాముత్తారం, వెలుగు

మోడీ పాలనలో పుణ్యక్షేత్రాల అభివృద్ధి
హనుమకొండ సిటీ, వెలుగు :
ప్రధాని నరేంద్ర మోడీ పాలనలోనే పుణ్యక్షేత్రాలు సర్వాంగ సుందరంగా మారుతున్నాయని  బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయినిలో కొత్తగా పునర్​నిర్మించిన మహాకాళ్ కారిడార్ ను ప్రధానమంత్రి మోడీ జాతికి అంకితమిచ్చిన సందర్భంగా మంగళవారం సాయంత్రం హనుమకొండ పెగడపల్లి డబ్బాల ప్రాంతంలో ఉన్న దాసాంజనేయ స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. మహాకాళ్ లోకను జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఆమె వెంట బీజేపీ నాయకులు గురుమూర్తి శివకుమార్, దేశిని సదానందం గౌడ్, అర్పీ జయంత్ లాల్, రావుల కిషన్, బైరీ శ్రావణ్, గురిజాల శ్రీరాంరెడ్డి తదితరులున్నారు.

పుష్ప తరహాలో గంజాయి స్మగ్లింగ్!

లారీలో సెపరేట్ క్యాబిన్ తయారీ
క్వింటాల్ గంజాయి సీజ్

మరిపెడ, వెలుగు : లారీలో ఎవరికీ కనిపించకుండా సెపరేట్ క్యాబిన్ తయారు చేసి గంజాయి తరలిస్తున్న ముఠాను మరిపెడ పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ శరత్ చంద్ర వివరాల ప్రకారం.. సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు మరిపెడ కాకతీయ కళాతోరణం వద్ద వాహనాలు చెక్ చేస్తున్నారు. ఖమ్మం నుంచి వస్తున్న ఓ లారీ.. వీరికి దూరంగా ఆగి, అందులోని దుండగులు పారిపోతుండడం గమనించారు. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి చూడగా.. ఖాళీగా ఉన్న లారీ కనిపించింది. వెనుకభాగం తేడాగా కనిపించడంతో వెల్డింగ్ కట్టర్ సాయంతో సెపరేట్ క్యాబిన్ ను గుర్తించారు. అందులో క్వింటాల్ గంజాయి లభ్యమైంది. లారీ ఓనర్ తో పాటు మరో ముగ్గురు నిందితులు పరారయ్యారని, త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు. లారీ రాజస్థాన్ రాష్ట్ర జోద్ పూర్ ప్రాంతానికి చెందిందిగా గుర్తించామన్నారు.

గంజాయి నివారణకు స్పెషల్ ప్రోగ్రాం..
మరిపెడ మండలంలో ఎటుచూసినా గంజాయి ఆనవాళ్లు కనిపిస్తుండడంతో.. దీని నివారణకు స్పెషల్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర తెలిపారు. ‘మరిపెడ–మనలో మార్పు’ పేరుతో విస్తృతంగా యువతకు అవగాహన కల్పిస్తామన్నారు. కళాజాత కార్యక్రమాల ద్వారా యువతలో మార్పు తీసుకొస్తామన్నారు. గంజాయిని పట్టుకున్న సీఐ సాగర్, ఎస్సైలు పవన్, సంతోష్, కానిస్టేబుల్స్ క్రాంతికుమార్, రమేశ్​లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో తొర్రూరు డీఎస్పీ రఘు, సీఐ సాగర్, తహసీల్దార్ రాంప్రసాద్ తదితరులున్నారు.

ఘనంగా జిల్లా ఆవిర్భావ వేడుకలు
జనగామ అర్బన్, వెలుగు :
జనగామ జిల్లా ఏర్పడి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకల్ని నిర్వహించారు. జేఏసీ, పొలిటికల్ లీడర్లు పాల్గొని కేక్ లు కట్ చేశారు. జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు, ఉద్యమకారుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ఏర్పడి ఆరేండ్లు అవుతున్నా అభివృద్ధిలో వెనుకబడి ఉందన్నారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయనుకుంటే వలసలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్​ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా సాధన స్ఫూర్తితో.. జిల్లా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం మెడలు వంచి జిల్లా సాధించామని, ఇదే తరహాలో సమస్యలపై దశలవారీగా పోరాటాలు చేపడతామన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు బొట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే పెంబర్తి ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకురావాలన్నారు. జనగామను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు.

కొడుకు వేధింపులతో తండ్రి ఆత్మహత్య!
మొగుళ్లపల్లి, వెలుగు :
కొడుకు వేధింపులు తట్టుకోలేక ఓ తండ్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం అకినపల్లిలో జరిగింది. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దూడం రాజు స్థానికంగా డాక్టర్ గా పని చేస్తున్నాడు. మద్యానికి బానిసై తండ్రి లక్ష్మయ్యను తరచూ వేధిస్తున్నాడు. సోమవారం రాత్రి సైతం మద్యంమత్తులో వచ్చి తండ్రిని కొట్టాడు. దీంతో ఆయన మనస్తాపానికి గురైన లక్ష్మయ్య ఉరి వేసుకుని మృతి చెందాడు. కూతురి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

లైబ్రరీ చైర్మన్ గా గోవింద్
ములుగు, వెలుగు :
ములుగు డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ గా పోరిక గోవింద్ నాయక్ నియామకమయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన గోవింద్ నాయక్ ను మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు. ఇదిలా ఉండగా గతంలో ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ గా గోవింద్ నాయక్ పేరును ప్రభుత్వం ప్రకటించగా.. ఆదివాసీ నాయకుల ఫిర్యాదుతో అది పెండింగ్ లో పెట్టారు. తాజాగా అతన్ని గ్రంథాలయ కమిటీ చైర్మన్​ గా నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

‘మా ఊరి సమస్యలు పరిష్కరించండి’
మొగుళ్లపల్లి, వెలుగు :
తమ గ్రామంలో నెలకొన్న సమస్యలను కలెక్టర్, ఎమ్మెల్యే స్పందించి వెంటనే పరిష్కరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం బంగ్లాపల్లి సర్పంచ్ రజిత యువరాజ్ కోరారు. మంగళవారం సర్పంచ్ మీడియాతో మాట్లాడుతూ..  గ్రామ శివారు రేగడికుంట కట్టకు మరమ్మతులు చేపడితే.. ఇరిగేషన్ ఆఫీసర్లు నిధులు ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారని వాపోయారు. పనులు మధ్యలోనే ఆగిపోవడంతో రైతులు తిప్పలు పడుతున్నారని పేర్కొన్నారు. గ్రామంలో కరెంట్ సమస్యలు అధికంగా ఉన్నాయని, రిపేర్లు చేపట్టాలని కోరారు.

261 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ సీజ్
పర్వతగిరి, వెలుగు :
అక్రమంగా తరలిస్తున్న 261 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సీఐ అనుముల శ్రీనివాస్ వివరాల ప్రకారం.. డీసీఎంలలో పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు మంగళవారం పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పర్వతగిరి మండలం చింతనెక్కొండ క్రాస్ వద్ద పోలీసులు వెహికల్ చెకింగ్ నిర్వహించారు. రెండు డీసీఎంలలో తరలిస్తున్న రూ.6.52లక్షల బియ్యాన్ని సీజ్ చేశారు. డీసీఎం డ్రైవర్లు బోయ గిడ్డయ్య, సాయిబోయిన కుమార్ పారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకున్నారు. తనిఖీల్లో ఎస్సై దేవేందర్, రాజు, లింగమూర్తి, శ్రీనివాస్ తదితరులున్నారు.