అవసరం లేకున్నా ఆపరేషన్లు.. డాక్టర్‌‌కు 465 ఏళ్ల జైలు

అవసరం లేకున్నా ఆపరేషన్లు.. డాక్టర్‌‌కు 465 ఏళ్ల జైలు

వర్జీనియా: పేషెంట్లకు అవసరం లేకున్నా ఆపరేషన్లు చేసిన ఓ డాక్టర్‌‌కు యూఎస్‌‌లోని వర్జీనియా కోర్టు  465 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సదరు నిందితుడి పేరు డాక్టర్ జావేద్ పెర్వయిజ్. డబ్బుకు ఆశపడ్డ జావేద్.. ప్రైవేటుతోపాటు ప్రభుత్వ ఇన్యూరెన్స్ కంపెనీలను మోసం చేశాడు. అనవసరమైన సర్జరీలతో ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి లక్షలాది డబ్బులను కొట్టేశాడు. మందులతో తగ్గే అవకాశం ఉన్నా కూడా సర్జరీలు చేసి పేషెంట్స్‌‌ను బాధకు గురి చేశాడు. గత పదేళ్లలో తన దగ్గరకు వచ్చిన పేషెంట్స్‌‌లో 52 మందికి అనవసర సర్జరీలు చేశాడు. వీటిలో ఎక్కువగా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు ఉండటం గమనార్హం.

గర్భిణి మహిళలకు నిర్ణీత సమయం కంటే ముందుగానే పిల్లలు పుట్టే ఆపరేషన్ చేయించుకోవాలని జావేద్ ప్రేరేపించేవాడని తెలుస్తోంది. తద్వారా సర్జరీలు అవసరమని తన పేషెంట్లకు జావేద్ సూచించేవాడని సమాచారం. తమకు అవసరం లేకున్నా ఆపరేషన్లు చేయించుకోవాలని జావేద్ చెప్పేవాడని కోర్టు డాక్యుమెంట్లలో 29 మంది మహిళా పేషెంట్లు పేర్కొన్నారు. పదేళ్ల కాలంలో పర్వేజ్ 41.26 శాతం ఆపరేషన్లు చేయగా.. మామూలుగా ఇంత వ్యవధిలో డాక్టర్లు 7.63 శాతం మంది పేషెంట్లకు మాత్రమే సర్జరీలు చేస్తారు.