మంచి కథల్ని ఎంచుకుంటే వెబ్‌‌ సిరీసులకు లాభాలొస్తాయి

మంచి కథల్ని ఎంచుకుంటే వెబ్‌‌ సిరీసులకు లాభాలొస్తాయి

గ్యాంగ్‌‌ లీడర్, బన్నీ లాంటి సినిమాల్లో కీలక పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందిన తమిళ నటుడు శరత్ కుమార్, ఇటీవల ‘పరంపర’ వెబ్‌‌ సిరీస్‌‌లో నటించారు. ఈ సిరీస్‌‌ రెండో సీజన్‌‌ డిస్నీ ప్లస్‌‌ హాట్‌‌స్టార్‌‌‌‌లో నిన్న స్ట్రీమింగ్‌‌కి వచ్చిన సందర్భంగా ఆయన ఇలా ముచ్చటించారు. ‘‘కెరీర్ ప్రారంభంలో విలన్ రోల్స్ చేసిన నేను, చాలా గ్యాప్‌‌ తర్వాత గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్‌‌‌‌ని ఇందులో పోషించాను. అలాగని నాయుడు పాత్ర పూర్తిగా నెగిటివ్ కాదు. మరొకరి వల్లే ఎదిగాడనే పేరును తట్టుకోలేకపోవడమే అతని సమస్య. ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రం కోసం నాలుగేళ్లుగా పెంచిన గడ్డంతోనే ఇందులోనూ నటించాను. జగపతిబాబు, ఆమని, ఆకాంక్ష, నవీన్ చంద్ర చాలా బాగా యాక్ట్ చేశారు. అన్ని పాత్రలకీ సమానమైన ఇంపార్టెన్స్ ఉన్న వెబ్ సిరీస్ ఇది. ఒక్కో  సందర్భంలో ఒక్కో పాత్ర హైలైట్ అవుతుంది. కథ, మా క్యారెక్టరైజేషన్స్ ముందే క్లియర్‌‌‌‌గా డిజైన్ చేశారు కాబట్టి.. ముగ్గురు (విజయ్, విశ్వనాథ్, హరి) దర్శకులైనా మాకెలాంటి కన్ఫ్యూజన్ లేదు. ప్రేక్షకుల్ని థియేటర్‌‌కి  రప్పించాలంటే కష్టం కానీ ఓటీటీకి అలా కాదు. ఇంట్లోనే ఉండి చూడొచ్చు కనుక కొంత ప్రమోట్ చేసి మంచి కంటెంట్ చూపిస్తే చాలు. ఈ వెబ్‌‌ సిరీస్‌‌ విజయమే అందుకు ఉదాహరణ. తక్కువ బడ్జెట్‌‌లోనూ మంచి కథల్ని ఎంచుకుంటే వెబ్‌‌ సిరీసులకు కూడా మంచి లాభాలొస్తాయి. ప్రస్తుతం విజయ్ హీరోగా రూపొందుతున్న ‘వారసుడు’లో నటిస్తున్నాను. లారెన్స్ సినిమాలో విలన్‌‌గా చేస్తున్నాను. ‘పొన్నియిన్ సెల్వన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. మా ఇంట్లో ఎక్కువమంది నటీనటులు ఉన్నప్పటికీ ఎవరి కథలు, సినిమాల సెలెక్షన్ వారిదే. అటు రాజకీయాల్లోనూ ఉన్నాను. దాన్ని నేనొక బాధ్యతగా భావిస్తాను. అందుకే పొలిటీషియన్‌‌గా కొనసాగుతున్నాను.’’