ఫేక్ సర్టిఫికెట్లతో లెక్చరర్ జాబ్స్!

ఫేక్ సర్టిఫికెట్లతో లెక్చరర్ జాబ్స్!
  • రెగ్యులర్ చేసిన కాంట్రాక్ట్ లెక్చరర్ల సర్టిఫికెట్లు మళ్లీ వెరిఫై
  • ప్రొబేషన్ పీరియడ్ పూర్తికావడంతో కొనసాగుతున్న ప్రక్రియ
  • 12 జిల్లాల్లో వెరిఫికేషన్ కంప్లీట్.. ఫేక్ సర్టిఫికెట్ల గుర్తింపు!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండేండ్ల కింద రెగ్యులర్ చేసిన కాంట్రాక్ట్ లెక్చరర్ల సర్టిఫికెట్లపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. ప్రొబేషన్ పీరియడ్ పూర్తికావడంతో ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు మరోసారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టారు. దీంట్లో కొందరు ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగులు చేస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిసింది. దీంతో ఇతర రాష్ట్రాల్లో చదివిన వారిలో ఆందోళన మొదలైంది. సర్కారు జూనియర్ కాలేజీల్లో జూన్ 2, 2014 వరకు పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను 2023, మేలో రెగ్యులరైజ్ చేస్తున్నట్టు అప్పటి సర్కారు ప్రకటించింది. 

మొత్తం 3,125 మంది ఈ జాబితాలో ఉండగా, దాంట్లో ఒకేషనల్ లెక్చరర్లు 189 మంది ఉన్నారు. నామమాత్రంగా వెరిఫికేషన్​ చేస్తేనే ఇలా పలువురివి బోగస్, ఫేక్ సర్టిఫికెట్లు అని తేలింది. దీంతో అప్పట్లో కొందరిని ఉద్యోగాల్లోంచి కూడా తొలగించారు. అయితే, ప్రస్తుతం రెండేండ్ల ప్రొబేషన్ పీరియడ్ పూర్తికావడంతో వారిని పూర్తి స్థాయిలో రెగ్యులరైజ్ చేయాల్సి ఉంది. ఫేక్ సర్టిఫికెట్లతో చాలామంది ఉద్యోగాలు చేస్తున్నట్టు నిరుద్యోగులు, వివిధ సంఘాల నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. దీంతో మరోసారి అందరి సర్టిఫికెట్లు రీ చెక్ చేయాలని ఇంటర్ బోర్డును సర్కార్ ఆదేశించింది. దీంతో తాజాగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో జరిగిన వెరిఫికేషన్ లో సుమారు 20 మంది వరకు బోగస్, ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నట్టు గుర్తించినట్టు తెలిసింది.

ఇతర రాష్ట్రాల్లో చదివినోళ్ల సర్టిఫికెట్లపై ఫోకస్

రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్టు లెక్చరర్లకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లను ఇంటర్ బోర్డు అధికారులు పరిశీలిస్తున్నారు. ఇంటర్ బోర్డు కమిషనరేట్ అధికారులతో పాటు ఓయూ ప్రొఫెసర్, సంబంధిత డీఐఈవోలు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లతో పాటు బోనఫైడ్ పత్రాలనూ చెక్ చేస్తున్నారు. ఇప్పటికే మేడ్చల్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, వికారాబాద్, నాగర్ కర్నూల్, హన్మకొండ, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, గద్వాల తదితర సుమారు 12 జిల్లాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయింది. దీంట్లో ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో చదివిన వారి సర్టిఫికెట్లను ప్రధానంగా చెక్ చేస్తున్నారు. 

ఆ వర్సిటీకీ యూజీసీ గుర్తింపు ఉందా? ఆ కోర్సుకు ఉందా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో డిస్టెన్స్ వర్సిటీల్లో చదివిన వారి డేటాను, పీజీ పర్సంటేజీ తక్కువగా ఉన్న వారి డేటాను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. దీంతో పాటు ఆ రాష్ట్రం పరిధి కాకుండా వేరే రాష్ట్రాల్లోని స్టడీ సెంటర్లలో చదివిన వారి జాబితానూ వేరుగా పెడుతున్నారు. వాటిపై వర్సిటీలు, యూజీసీ అధికారులు, ఉన్నత విద్యామండలి అధికారులతో సంప్రదించి, మరోసారి కమిటీ ప్రత్యేకంగా పరిశీలించనున్నది. కాగా, మరోపక్క పీజీలో పర్సంటేజీ ఉందా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరో నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.