
- చిన్నపాటి వానకే చెరువును తలపిస్తున్న కోట పరిసరాలు
- రోజుల తరబడి నీరు నిలిచిపోతుండడంతో దెబ్బతింటున్న కట్టడాలు
- పలు చోట్ల ధ్వంసమైన రాతికోట.. రోజురోజుకు కరిగిపోతున్న మట్టి కోట
వరంగల్, వెలుగు : కాకతీయుల రాజధానిగా వెలుగొందిన ఓరుగల్లు ఖిలా వరద నీటిలో మునిగిపోతోంది. వానాకాలంలో భారీ ఎత్తున వచ్చే వరదను బయటకు పంపేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో కోటలో పర్యాటకులు తిరిగే ప్రాంతాలన్నీ చెరువును తలపిస్తున్నాయి.
ప్రధానంగా రాతి, మట్టి కోట ప్రాంతాల్లో వాన నీరు భారీగా నిలుస్తుండడంతో పిల్లర్లు కుంగిపోతున్నాయి. 800 ఏండ్లనాటి శిల్పసంపదను కాపాడుతామని హామీ ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు పదేండ్ల పాటు మాటలకే పరిమితం అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా స్పందించి వరద నివారణ చర్యలు తీసుకొని వారసత్వ సంపదను కాపాడాలని పలువురు కోరుతున్నారు.
చిన్నపాటి వానకే చెరువును తలపిస్తున్న కోట
కాకతీయ రాజైన గణపతి దేవుడు 13వ శతాబ్దంలో సుమారు 19 కిలోమీటర్ల విస్తీర్ణంలో వరంగల్ కోట నిర్మాణం చేపట్టగా ఆ తర్వాత రాణి రుద్రమదేవి పనులను చూసుకుంది. 800 ఏండ్ల కింద కట్టిన వారసత్వ సంపద పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో చిన్నపాటి వానలకే వరంగల్ కోట చెరువును తలపిస్తోంది.
భారీ స్థాయిలో వరద నిలిచిపోతుండడంతో అరుదైన శిల్పాలు, ఏనుగు విగ్రహాలు, నాట్యమందిరాలు, కట్టడాలతో పాటు కాకతీయ తోరణాల మధ్యన ఏర్పాటు చేసిన సౌండ్ అండ్ లైటింగ్ ఏరియా, లేజర్ షో నిర్వహించే ప్రాంతమంతా నీటితో నిండిపోతోంది. కాకతీయులు పూజలు నిర్వహించిన శంభుని ఆలయ పరిసరాలు, సినిమా షూటింగ్ నిర్వహించే ప్రదేశాలన్నీ చిత్తడిగా మారుతున్నాయి.
ఆర్భాటం చేసి ఆసక్తి చూపని బీఆర్‌ఎస్
ఖిలా వరంగల్ అభివృద్ధి విషయంపై ఎన్నో హమీలు ఇచ్చిన బీఆర్‌ఎస్.. పదేండ్ల పాటు వాటిని పట్టించుకోలేదు. ‘కాకతీయ వైభవ సప్తాహం’ వేడుకల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. కాకతీయుల వారసుడు మహరాజు కమల్ చంద్ర భంజ్‍దేవ్‌ను ఖిలా వరంగల్‌కు తీసుకొచ్చారు. రథాలు, డప్పులు, నృత్యాలు, కోలాటాలు, పేరిణి నృత్యాల నడుమ ఆయనను గుర్రపు బగ్గీపై ఊరేగిస్తూ అడుగడుగునా పూలవర్షం కురిపించారు.
కానీ.. కాకతీయుల వారసత్వ సంపదను కాపాడే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చిన అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.. ఆ తర్వాత ఆ హామీలన్నీ విస్మరించారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా ‘కాకతీయుల రాజధాని’ని పరిరక్షించి భావితరాలకు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
ఊడిపోతున్న కోట రాళ్లు
కాకతీయుల రాజధానిగా చెప్పుకునే ప్రస్తుత నాలుగు తోరణాల ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో చుట్టూరా ఉండే మట్టికోట ఇప్పటికే చాలాచోట్ల దెబ్బతింది. భారీ వర్షాల కారణంగా రాళ్లు ధ్వంసమై ఊడిపోతున్నాయి. రాతి గోడ వద్ద షూటింగులు జరిపే ప్రదేశాల్లో వరదనీరు పెద్దఎత్తున చేరింది. నీరు బయటకుపోయే మార్గం లేకపోవడంతో కట్టడాలన్నీ రోజుల తరబడి నీటిలోనే ఉంటున్నాయి.