అమెరికా గగనతలంపై గుర్తు తెలియని వాహనం

అమెరికా గగనతలంపై గుర్తు తెలియని వాహనం

వాషింగ్టన్ : వారం కిందట నిఘా బెలూన్​.. తాజాగా గుర్తుతెలియని అనుమానాస్పద వాహనాన్ని అమెరికా సైన్యం  కూల్చేసింది. అలస్కా ఉత్తర తీరంలో 40వేల ఫీట్ల ఎత్తులో ఎగురుతున్న వాహనాన్ని ఎఫ్​22 యుద్ధ విమానం నుంచి ‘ఏఐఎం-9ఎక్స్’ మిస్సైల్ ప్రయోగించి నేలకూల్చింది.​ విమానాలు కనిష్టంగా 31వేల ఎత్తులో.. గరిష్టంగా 45వేల ఎత్తులో ప్రయాణిస్తుంటాయి. ఈ వాహనం కూడా దాదాపు అదే ఎత్తులో కదులుతుండటాన్ని అమెరికా సైన్యం గుర్తించింది. అది అక్కడే ఉంటే.. ఆ రూట్​ లో రాకపోకలు సాగించే విమానాలకు ముప్పు కలుగుతుందని భావించింది. వెంటనే రెండు యుద్ధ విమానాలను దాని దగ్గరికి పంపి.. అందులో ఎవరూ లేరని నిర్ధారించుకుంది. అనంతరం ఈ సమాచారాన్ని ప్రెసిడెంట్​ జో బైడెన్​కు అందించగా.. దానిని కూల్చేయాలని ఆయన ఆర్డర్స్​ ఇచ్చారు. దీంతో దాన్ని కూల్చేశారు. దీని గురించి వైట్​ హౌస్​ లో విలేకరులు బైడెన్​ ను ప్రశ్నించగా.. ‘షూట్​ డౌన్​ సక్సెస్​ ఫుల్’ అని కామెంట్​ చేశారు. వైట్​ హౌస్​ జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్​ కిర్బీ, పెంటగాన్​ ప్రెస్​ సెక్రటరీ బ్రిగేడియర్​ జనరల్​ ప్యాట్​ రైడర్​ ఈ ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు. అనుమానాస్పద వాహనాన్ని కూల్చేయడానికి ముందు.. శకలాలను సేకరించేందుకు దానికి సమీపంలోనే హెలికాప్టర్లు, ట్రాన్స్​ పోర్ట్‌‌‌‌‌‌‌‌ విమానాల్లో  అమెరికా ఉత్తర కమాండ్​కు చెందిన సుశిక్షితులైన సైనికులను మోహరించామని తెలిపారు. అది కూలిన వెంటనే శకలాలను సేకరించే పనిని వారు మొదలుపెట్టారని చెప్పారు. అయితే ఈ వస్తువు ఎక్కడిది? ఎవరు ప్రయోగించారు? దాని లక్ష్యం ఏమిటి? అనేది ఇప్పటివరకు తెలియదు. ఈ పరిణామంపై చైనా ఘాటుగా స్పందించింది. ఇటువంటి ఘటనలను రాజకీయ మైలేజీ కోసం బైడెన్​ బాగా వాడుకుంటున్నారని చైనా ప్రభుత్వం కామెంట్​ చేసింది. 

40 దేశాలపై బెలూన్లతో చైనా నిఘా..

ఫిబ్రవరి 4న సాయంత్రం దక్షిణ కరోలినా గగనతలంలో ఎగురుతున్న నిఘా బెలూన్​ను అమెరికా సైన్యం కూల్చేసింది. దీంతో పాటు 40 దేశాలపై ఇలాంటి బెలూన్లతో చైనా నిఘా పెట్టిందని, ఆయా దేశాలను అలర్ట్​ చేశామని వెల్లడించింది.