
తండ్రి, ఆడపడుచు సహకారంతో భర్తను చంపించిన భార్య
వీడిన శ్రీను హత్యకేసు మిస్టరీ
హాలియా, వెలుగు : అనుమానంతో నిత్యం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న భర్తను ఓ భార్య.. తండ్రి, ఆడపడుచు సాయంతో కడతేర్చింది. ఈ నెల 24న నల్గొండ జిల్లా అల్వాలలోని సాగర్ ఎడమ కాల్వ వద్ద లభ్యమైన శ్రీను మృతదేహంతో విచారణ ప్రారంభించిన పోలీసులు కేసును ఛేదించారు. నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. హత్య కేసు వివరాలను నాగార్జునసాగర్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ వేణుగోపాల్ వెల్లడించారు. వివరాలు.. త్రిపురారం మండలం గంటారావు క్యాంపునకు చెందిన చిట్టికి 18 ఏళ్ల క్రితం కాపువారిగూడేనికి చెందిన పానుగోడు శ్రీనుతో పెండ్లయింది. వీరికి ఇద్దరు కుమారులు. శ్రీను తరుచు భార్యపై అనుమానంతో కొడుతూ తిడుతూ హింసిస్తూ ఉండేవాడు.
దీంతో ఆమె ఆరు నెలల క్రితం పిల్లలను తీసుకొని తల్లిగారింటికి వచ్చింది. చిట్టి అన్న భార్య విజయమ్మ. ఈమెకు ఆడపడుచు(శ్రీను చెల్లెలు) కూడా. అన్న చనిపోవడంతో వదిన విజయమ్మ ఓ వ్యక్తితో కలిసి హైదరాబాద్ లోని హయత్‌నగర్‌లో ఉంటుంది. అయితే తన భార్య చిట్టికి చెడు అలవాట్లు నేర్పించేది విజయమ్మేనని భావించి హయత్‌నగర్‌కు వెళ్లి తరచు గొడవ పడుతుండేవాడు. వేధింపులు భరించలేక భార్య చిట్టి, అతని చెల్లెలు విజయమ్మ శ్రీను హత్యకు ప్లాన్ చేశారు. వీరికి చిట్టి తండ్రి పంతుల్యా కూడా సహకరించాడు.
శ్రీనును చంపేందుకు విజయమ్మ తన ప్రియుడు అయిన రసూల్‌తో రూ.3లక్షలకు ఒప్పందం కుదుర్చుకొంది. దీంతో రసూల్ తన పండ్ల వ్యాపారంలో కూలీలుగా పనిచేసే ఇమ్రాన్, రాహుల్ లతో కలిసి రూ.40 వేలు అడ్వాన్సుగా తీసుకున్నాడు. ఈ నెల 24న శ్రీను తన భార్య ఆచూకీ కోసం విజయమ్మ ఇంటికి వెళ్లగా, అదే సమయంలో విజయమ్మ ఇంట్లో ఉన్న రసూల్, విజయమ్మ కొడుకు సంతోష్, ఆమె అల్లుడు ఏ. శ్రీను, ఇమ్రాన్, రాహుల్‌లు శ్రీనును చంపేందుకు ఇదే అదనుగా భావించి అతడికి మద్యం తాగించారు. మత్తులో ఇంట్లో పడుకున్న శ్రీనును చున్నీతో ఉరిబిగించి చంపేశారు. అనంతరం అదే రోజు రాత్రి మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి కారులో తీసుకొచ్చి హాలియా సమీపంలోని అల్వాల గ్రామ శివారులో గల నాగార్జునసాగర్ ఎడమ కాల్వ వద్ద పడేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. త్రిపురారం మండలం కాపువారిగూడెంలో ఈ నెల 29న శ్రీను పెద్ద కర్మకు నిందితులు కూడా హాజరయ్యారనే సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారు నేరం ఒప్పుకున్నారు. వెంటనే నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. సమావేశంలో హాలియా సీఐ ధనుంజయ్య, తిరుమలగిరి ఎస్సై సత్యనారాయణ, సాగర్ ఎస్సై సీనయ్య , హాలియా ఎస్ఐ, రాఘవులు ఉన్నారు.