
కామాంధుల క్రూరత్వానికి ఇంతకు మించిన పరాకాష్ట ఉండదేమో. పుట్టుకతోనే హెచ్ఐవీ మహమ్మారి బారిన పడి ఆశ్రయం పొందుతున్న చిన్నారులను.. కంటికి రెప్పలా కాపాడాలని బాధ్యతలు అప్పగిస్తే.. తల్లీ, తండ్రీ, గురువు అంతా మీరై చూసుకోవాలని.. ఆ పిల్లకు ఆత్మస్థైర్యాన్నిస్తూ అండగా నిలవాలని నియమించిన ఉద్యోగులు.. వాళ్ల పాలిట కాల సర్పాలై కాటేస్తున్నారు. HIV సోకిన మైనర్ పై రెండేళ్లుగా అత్యాచారం చేస్తూ పైశాచికానందం పొందిన దుర్మార్గుడు చివరికి దొరికిపోయాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది.
మహారాష్ట్రలోని లాతూర్ లో HIV బాధితుల ఆశ్రమంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హెచ్ఐవీ సోకిన 16 ఏళ్ల మైనర్ పై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు ఓ కీచకుడు. వాళ్ల ఆలనా పాలనా చూసుకోవాల్సిన ఉద్యోగి.. ఆ మైనర్ మహమ్మారి బారిన పడిందని తెలిసి కూడా అత్యాచారినికి ఒడిగట్టాడు. అత్యాచారం చేస్తూ ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరిస్తుండటంతో.. భయంతో బాధను గుండెల్లోనే దాచుకుంది ఆ చిన్నారి. 2023 జులై 13 నుంచి 2025 జులై 23 వరకు తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని బాధితురాలు పోలీసుకు లెటర్ రాయడంతో ఈ దుర్మార్గం బయటపడింది.
ALSO READ : హోంగార్డు పరీక్షకు వెళ్లిన మహిళపై పాశవిక దాడి..కదిలే అంబులెన్స్‌లో గ్యాంగ్‌రేప్
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. లాతూర్ లోని హెచ్ఐవీ బాధితుల ఆశ్రమ పాఠశాల సేవాలరీలో ఒక ఉద్యోగి మైనర్ పై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. అయితే ఇటీవల అమ్మాయి అనారోగ్యానికి గురవ్వడంతో ఆస్పత్రిలో చేరగా 4 నెలల ప్రగ్నెంట్ అని డాక్టర్లు కన్ఫమ్ చేశారు. దీంతో విషయం తెలుసుకున్న సదరు ఉద్యోగి.. మైనర్ ను వేరే డాక్టర్ తో సెటిల్మెంట్ చేసుకుని అబార్షన్ చేయించాడు. అమ్మాయి అంగీకారం లేకుండానే అబార్షన్ చేయించి.. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు ఆ దుర్మార్గుడు.
ఎవరికి చెప్పుకుందామన్నా ధైర్యం చాలక.. పోలీసులకు లెటర్ రాసింది బాధితురాలు. తనకు జరిగిన అన్యాయం గురించి వివరిస్తూ రెండు పేజీల ఉత్తరం రాసి.. కంప్లైంట్ బాక్స్ లో వేయడంతో సేవాలరీ ఆశ్రమ నిర్వాహకులకు తెలిసిపోయింది. ఈ విషయంలో బాధితురాలికి సహాయం చేయకపోగా.. ఆశ్రమ నిర్వాహకులు ఆ దుర్మార్గునికే సపోర్ట్ చేశారు. దొరికిన కంప్లైంట్ ను చించేసి.. ఎవరికీ చెప్పొద్దని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సేవాలరీ ఆశ్రమ పాఠశాల ఫౌండర్ రవి బాపట్లే, సూపరిటెండెంట్ రచన బాపట్లే, ఉద్యోగులు అమిత్ మహాముని, పూజా వాఘ్మారే తో పాటు మరి కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
హ్యాపీ హోమ్ ఫర్ చిల్డ్రన్.. అనే ట్యాగ్ లైన్ తో ఉండే సేవాలరీ సంస్థలో 23 మంది అబ్బాయిలు, ఏడుగురు బాలికలు ఉన్నారు. అందరూ హెచ్ఐవీ సోకిన వాళ్లే. హెచ్ఐవీ మహమ్మారి తమ శరీరంలోకి, రక్తంలోకి ఎలా వచ్చి చేరిందో కూడా తెలియని చిన్నారులను.. బాగా చూసుకుని.. వారికి ఆత్మస్థైర్యాన్ని కల్పించాల్సిన ఉద్యోగులు వారిపై అఘాయిత్యానికి పాల్పడటంపై మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తు్న్నాయి.