సినిమా స్టైల్లో దోపిడీ.. బెంగళూర్లో గన్స్తో బెదిరించి జువెలరీ షాప్ లూటీ..

సినిమా స్టైల్లో దోపిడీ.. బెంగళూర్లో గన్స్తో బెదిరించి జువెలరీ షాప్ లూటీ..

సినిమాల ప్రభావం ప్రజలపైన ఉందో లేదో కానీ.. దొంగలపైన మాత్రం బానే ఉన్నట్లుంది. ఏదైనా దోపిడీ చేయాలంటే ఫటాఫట్ గా వెళ్లామా.. గన్ చూపించామా.. ఎత్తుకొచ్చామా.. అన్నట్లుగా చాలా వేగంగా దోపిడీ పూర్తి చేస్తున్నారు. అప్పట్లో అమెరికాలో ఇలాంటి దోపిడీలు చూసేవాళ్లం. గన్నుతో వెళ్లి బెదిరించి.. వినకుంటే కాల్చి దొంగతనం చేసేవాళ్లు. అలాంటి సీన్.. సినిమాలో చూసినట్లుగానే బెంగళూర్ లో దొంగలు దోచుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

బెంగళూర్ జువెలరీ షాప్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముగ్గురు దొంగలు.. డోంట్ మూవ్.. హ్యాండ్స్ అప్.. అంటూ గన్స్ చూపించి జస్ట్ కొన్ని సెకండ్లలోనే ఆభరణాలు ఎత్తుకెళ్లటం చూసి షాప్ ఓనర్ నోరెళ్లబెట్టాడు. మగది రోడ్ భైరవేశ్వర కాంప్లెక్స్ లోని రామ్ జువెలరీ షాప్ లో జరిగింది ఈ సినిమా స్టైల్ రాబరీ. 

ఆరోజు లెక్కలు చూసుకుని, అన్నీ ఎక్కడివక్కడ సర్ది.. షాపు మూసేందుకు ముందు సడెన్ గా ఎంటరయ్యారు దొంగలు. గన్స్ చూపించి డిస్ప్లే టేబుల్ పైన ఉంచిన ఆర్నమెంట్స్ అన్నింటిని తీసుకుని పరారయ్యారు. ఓనర్ కన్హయ్య లాల్ అడ్డుకోవాలని చూసినా.. స్టాఫ్ తో పాటు ఆయనను కూడా తోసేసి, బెదిరించి కొన్ని సెకండ్లలోనే ఆభరణాలతో ఎస్కేప్ అయ్యారు. జస్ట్ 18 సెకన్లలో గోల్డ్ షాప్ లూటీ చేసి పరారయ్యారు దుండగులు.

షాప్ లో నుంచి వస్తున్న శబ్దాలు విని పక్కన ఉన్న షాపు ఓనర్లు వచ్చేసరికే గోల్డ్ తో పారిపోయారు. మొత్తం 184 గ్రాముల గోల్డ్ తీసుకెళ్లినట్లు యజమాని కన్హయ్య లాల్ పోలీసులకు తెలిపాడు. ఎత్తుకెళ్లిన ఆభరణాల విలువ 10 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపాడు. మండనాయకనహల్లి స్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. రాబరీ సందర్భంగా వాడిన గన్ ఫేక్ అయ్యుంటుందని విజువల్స్ ఆధారంగా పోలీసులు భావిస్తున్నారు.