
- రూ. 6 లక్షల పెట్టుబడితో సొంత యూనిట్ ఏర్పాటు
- తాను నిలదొక్కుకోవడంతో పాటు మరో నలుగురికి ఉపాధి
మంచిర్యాల, వెలుగు : మహిళల కోసం కొత్తగా ఏదైనా చేయాలన్న సంకల్పం, తాను ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు మరో నలుగురుకి ఉపాధి కల్పించాలన్న లక్ష్యం.. ఆ మహిళను చిన్నపాటి వ్యాపారవేత్తగా నిలిపాయి. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన జ్యోతి.. హ్యాండ్ మేడ్ సానిటరీ ప్యాడ్స్ తయారీని ఎంచుకొని ‘అబిత.. ఫరెవర్’అనే సొంత బ్రాండ్‌తో మార్కెటింగ్ చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో యూనిట్‌ను ఏర్పాటు చేసిన జ్యోతి బిజినెస్‌ను విజయవంతంగా నడుపుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
సొంతంగా ఎదగాలన్న ఆలోచనతో...
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అశోక్‌రోడ్‌కు చెందిన జ్యోతి డిగ్రీ వరకు చదువుకున్నారు. మరో వైపు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నారు. ఆ తర్వాత ఓ ఎన్‌జీవోలో జిల్లా కో ఆర్డినేటర్‌గా పనిచేశారు. ఈ క్రమంలో తాను ఐకేపీలో చేరి సంఘ సభ్యులతో కలిసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే మహిళలకు అవసరమైన సానిటరీ ప్యాడ్స్‌ను హ్యాండ్ మేడ్‌గా తయారు చేయాలని ఆలోచన చేశారు.
ఈ ఆలోచన మరో నలుగురు సభ్యులకు సైతం నచ్చడం, వారు కూడా ముందుకు రావడంతో ప్యాడ్స్ తయారీపై విజయవాడలో ట్రైనింగ్ తీసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల మిగతా వారు డ్రాప్ కావడంతో తానే సొంతంగా యూనిట్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. దీంతో మంచిర్యాలలోనే ‘అబిత.. ఫరెవర్’ బ్రాండ్‌తో రూ. 6 లక్షల పెట్టుబడితో హ్యాండ్ మేడ్ సానిటరీ ప్యాడ్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేశారు.
సమస్యగా మారిన మార్కెటింగ్
సానిటరీ ప్యాడ్స్ తయారీకి కావాల్సిన మెషీన్లు, రా మెటీరియల్‌ను ముంబై నుంచి కొనుగోలు చేశారు. మంచిర్యాల మార్కెట్ ఏరియాలో ఓ షాప్‌ను రెంట్‌కు తీసుకొని ప్యాడ్స్ తయారీ ప్రారంభించారు. నలుగురు మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి తన వద్దే పనిలో పెట్టుకున్నారు. ఇలా రోజుకు 200 చొప్పున నెలకు సుమారు ఐదు వేల ప్యాడ్స్ వరకు తయారు చేస్తున్నారు. కానీ మార్కెటింగ్ సమస్యగా మారింది. తన బ్రాండ్‌ను మార్కెట్‌లోకి తీసుకెళ్లడం, సేల్స్‌మెన్లను పెట్టుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో తానే సొంతంగా రంగంలోకి దిగారు. కిరాణ, మెడికల్ షాపుల వారిని స్వయంగా కలిసి తన బ్రాండ్ గురించి చెప్పినా వారి వైపు నుంచి పెద్దగా ఆసక్తి కనబడలేదు. దీంతో మహిళా సంఘాల సభ్యులు, స్కూల్, కాలేజీ స్టూడెంట్లను కలిసి, వారికి తాను తయారు చేస్తున్న ప్యాడ్స్ గురించి వివరించి సప్లై చేస్తున్నారు. త్వరలోనే ఐఎస్‌ఐ గుర్తింపు పొంది తన బిజినెస్‌ను విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు జ్యోతి తెలిపారు.
టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాకల్టీగానూ...
జ్యోతి ఓ వైపు సొంత బిజినెస్ నడపడమే కాకుండా.. మరో వైపు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాకల్టీగానూ వివిధ ఎన్‌జీవోలకు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు వందల మందికి ట్రైనింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూల్ యూనిఫామ్స్ తయారీని మహిళా సంఘాలకు అప్పగించడం తెలిసిందే.
జ్యోతి గత రెండేండ్లుగా యూనిఫామ్స్ ఆర్డర్స్ తీసుకొని మహిళలతో కుట్టించి స్కూళ్లకు సప్లై చేస్తున్నారు.
మార్కెట్‌లో ఉన్న వాటి కంటే క్వాలిటీగా ఇస్తున్నాం
మార్కెట్‌లో చాలా కంపెనీలకు చెందిన సానిటరీ ప్యాడ్స్ అందుబాటులో ఉన్నాయి. కంపెనీలు పెద్ద ఎత్తున అడ్వర్టైజింగ్ చేయడం వల్ల అందరూ వాటికే ఇంట్రస్ట్ చూపుతున్నారు. మా వద్ద తయారు చేసిన హ్యాండ్‌మేడ్ ప్యాడ్స్‌ను వాటి కంటే తక్కువ రేటుకే, ఎక్కువ క్వాలిటీతో అందిస్తున్నాం. ఇప్పుడిప్పుడే పబ్లిసిటీ పెరుగుతోంది. మా బ్రాండ్‌కు ఐఎస్‌ఐ గుర్తింపు కోసం ట్రై చేస్తున్నాం. ఆ తర్వాత బిజినెస్‌ను విస్తరించాలనే ప్లాన్ ఉంది. బి.జ్యోతి