అరుదైన వ్యాధి: నీళ్లు తాగలేదు..కనీసం  కన్నీళ్లు పెట్టలేదు..!

అరుదైన వ్యాధి: నీళ్లు తాగలేదు..కనీసం  కన్నీళ్లు పెట్టలేదు..!

సరిపడా నీళ్లు తాగకపోయినా.. రెండు పూటలా స్నానం చేయకపోయినా..  అనారోగ్యాన్ని కొని  తెచ్చుకున్నట్టే. కానీ, ఇందుకు పదిహేనేండ్ల అబిగైల్​ బెక్​కి మినహాయింపు ఉంది. ఇంతకన్నా విచిత్రం ఏంటంటే ఈమె నీళ్లు తాగినా,  కన్నీళ్లు పెట్టినా హాస్పిటల్​ పాలవుతుంది​. దానికి కారణం ఆమెకున్న ‘ఆక్వాజెనిక్ ఉర్టికేరియా’ అనే అరుదైన వ్యాధి. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే ‘నీళ్ల ఎలర్జీ’. అందుకే  నీళ్లు చూస్తే ఆమడ దూరం వెళ్తుంది అబిగైల్​. కాస్త ఒళ్లు వేడెక్కినా, ఒంట్లో నలతగా అనిపించినా, జలుబు, దగ్గు.. ఇలా సమస్య ఏదైనా సరే చటుక్కున ట్యాబ్లెట్​ వేసుకుంటాం. ఆ వెంటనే గటగటా అరగ్లాసు నీళ్లు లేదా జ్యూస్ తాగుతాం. కానీ, ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్న అబిగైల్​ బుక్కెడు నీళ్లతో ట్యాబ్లెట్​ వేసుకున్నా సమస్యే. మోతాదుకి మించి నీరున్న జ్యూస్​ తాగినా కష్టమే. ఆ బాధ భరించలేక ఏడ్చినా తిప్పలు తప్పవు. ఇదే విషయం అబిగైల్​ చెప్తే మొదట ఎవరూ నమ్మలేదట. కట్టుకథ అంటూ తనని ఎగతాళి చేశారట. కానీ, అన్నింటినీ దాటి తనకున్న సమస్య గురించి నలుగురికీ అవేర్​నెస్​ కల్పిస్తోంది అబిగైల్​. ఎందుకని అడిగితే తాను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్​ గురించి చెప్తోంది.
 

ఎవరూ నమ్మలేదు
అమెరికాలోని అరిజోనా టక్సన్‌‌లో ఉంటున్న అబిగైల్ మూడేండ్ల నుంచి ఈ ఎలర్జీతో బాధపడుతోంది. కానీ, పోయిన నెలలోనే ఆమెకి ‘ఆక్వాజెనిక్ ఉర్టికేరియా’ ఉన్నట్టు తేల్చారు డాక్టర్లు. మొదట్నించీ వర్షంలో తడిసినా, స్నానం చేసినా ఒంటికి యాసిడ్ తగిలినంత బాధ అనిపించేదట ఈమెకి. శరీరమంతా దద్దుర్లు వచ్చేవట. దాంతో వారానికి రెండు సార్లు మాత్రమే స్నానం చేసేది. పైగా నీళ్లు తాగితే వెంటనే వాంతి అయ్యేది. ఛాతిలో మంట కూడా వచ్చేది. గుండె వేగంగా కొట్టుకునేది. అందుకే ఓ సంవత్సరం పాటు పూర్తిగా ఒక గ్లాసు నీళ్లు కూడా తాగలేదు అబిగైల్​. ఇప్పటికీ ఎనర్జీ డ్రింక్స్​, దానిమ్మ జ్యూస్​ తాగుతూ బతికేస్తుంది. అలాగే ఏదైనా తాగే ముందు, తినే ముందు అందులో నీటి శాతం ఎంత ఉందో తెలుసుకుంటుంది. 
 

మొదట తన ఇంట్లోని నీళ్లలోనే ప్రాబ్లమ్​ 
ఉందనుకుందట. లేదా తను వాడుతున్న స్కిన్​ లోషన్స్​, కాస్మొటిక్స్​ వల్ల ఈ సమస్య వస్తుంది అనుకుందట. కానీ, రానురాను సింప్టమ్స్​ మరీ ఎక్కువ అవడంతో డాక్టర్​ని కలవాలనుకుంది. తన మాట నమ్మరేమోననే భయంతో మళ్లీ వెనకడుగేసింది. చివరికి ఒకసారి ధైర్యం చేసి డాక్టర్ దగ్గరికెళ్లింది. కానీ, ఏ డాక్టర్​కి తన సమస్యపై సరైన అవగాహన లేదు. తనకి నీళ్లతో ఎలర్జీ ఉందని తెలిసిన వాళ్లకి, ఫ్రెండ్స్​కి చెప్పినా నమ్మలేదు. ‘మనిషి శరీరమంతా నీరే ఉంటుంది. అలాంటిది నువ్వు నీళ్లతో ఎలర్జీ అంటున్నావేంట’ని వింతగా చూశారు. దాంతో తన బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు అబిగైల్​కి.  చివరికి... కిందటి నెలలో ఓ హాస్పిటల్​ తనకున్నది నీళ్ల ఎలర్జీ అని తేల్చింది. ట్రీట్​మెంట్ మొదలుపెట్టింది. 
 

అవేర్​నెస్​ కల్పిస్తున్నా.. 
అబిగైల్​​  రెండు రోజులకు ఒకసారి మాత్రమే స్నానం చేస్తుంది. ఆ వెంటనే సింప్టమ్స్​ని కంట్రోల్​ చేయడానికి మందులు వేసుకుంటుంది. డీహైడ్రేట్​ అవ్వకుండా తక్కువ నీళ్లు తాగుతుంది. అలాగే ఈమె ఏడిస్తే ముఖం ఎర్రబడి కాలిపోతున్నట్టు అనిపిస్తుందట. అందుకే ఏడ్చేటప్పుడు కన్నీళ్లు చర్మం మీద పడకుండా జాగ్రత్త పడుతుంది. అయితే ‘‘సాధారణంగా ఈ వ్యాధి చాలామందిలో ఉంటుంది. కానీ, సింప్టమ్స్​ తీవ్రత ఎక్కువ ఉన్నవాళ్లు ఇరవై కోట్ల(200 మిలియన్లు) మందిలో ఒకరే ఉంటారు. హెల్త్ లైన్​ రిపోర్ట్స్​ ప్రకారం మెడికల్​ హిస్టరీలో ఇప్పటి వరకు ఆక్వాజెనిక్ ఉర్టికేరియా కేసులు వంద మాత్రమే ఉన్నాయి. అందుకే ఈ వ్యాధిపై పెద్దగా అవేర్​నెస్​ లేదు. బాధితులు దీని గురించి మాట్లాడినా ఎగతాళి చేస్తుంటారు. అది నాలాంటి వాళ్లని మరింత బాధపెడుతుంది. అందుకే నా సమస్య గురించి నలుగురికీ అవేర్​నెస్​ కల్పిస్తున్నా’’ అని చెప్తోంది అబిగైల్​ బెక్​.