
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో మున్సిపల్ అధికారుల తీరు ఓ మహిళ ప్రాణం తీసింది. ఇంటి టాక్స్ కట్టలేదన్న కారణంతో మూడ భూమమ్మ ఇంటి ముందు మున్సిపల్ సిబ్బంది చెత్త వేశారు. ఈ వీడియోను వాట్సప్ లో సర్క్యులేట్ చేశారు. అవమానం భరించలేకపోయిన భూమమ్మ తీవ్రమనస్తాపానికి లోనైంది. ఈ ఉదయం ఆమె హాస్పిటల్ కు తరలించేలోపే కన్నుమూసింది. నారాయణ్ ఖేడ్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సిబ్బంది తీరుపై జనం మండిపడుతున్నారు.
నారాయణ ఖేడ్ మున్సిపల్ అధికారుల తీరే ఈ దారుణానికి కారణంటున్నారు స్థానికులు. మూడ భూమమ్మ, ఆమె కుటుంబసభ్యులు… మున్సిపల్ అధికారులను కొద్దిరోజుల కింద.. రోడ్డు వెయ్యమని అడిగారు. దీంతో… మున్సిపల్ అధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ముందు ప్రాపర్టీ టాక్స్ కట్టాలని అడిగారు. కరోనా టైంలో తమకు ఆదాయం లేకుండా పోయిందని.. ఇప్పట్లో కట్టలేమని బాధితులు మున్సిపల్ అధికారులతో చెప్పారు. ఐతే.. కఠినంగా వ్యవహరించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్.. వారి ఇంటి ముందు చెత్త వేయించారు. టాక్స్ కట్టకపోతే ఇళ్లముందు చెత్త వేస్తామంటూ దానిని వీడియో తీసి.. వాట్సప్ గ్రూప్ లలో సర్క్యులేట్ చేశారు. దీంతో.. భూమమ్మ కుటుంబం తీవ్ర మనస్తాపానికి లోనైంది.
ఇంటి ముందు చెత్త వేసిన తర్వాత.. తమకు అందరికీ జ్వరాలు వచ్చాయని బాధిత కుటుంబసభ్యులు చెబుతున్నారు. అప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న భూమమ్మ కూడా అస్వస్థతనకు లోనైందని…. హాస్పిటల్ కు తరలించే లోగానే.. ప్రాణాలు విడిచిందని అంటున్నారు.